ప్లీజ్.. మమ్మల్ని బలి చేయొద్దు


ఎంసెట్-2 ర్యాంకర్లు, తల్లిదండ్రుల గోడు

 

హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ప్రభుత్వం ఎంసెట్-3 నిర్వహించనుందన్న వార్తలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  ఆందోళన చెందుతున్నారు. వారేమంటున్నారంటే..

 

మా అబ్బాయి డిప్రెషన్‌లోకి వెళ్లాడు


మా అబ్బాయి ఈ విషయం తెలిసినప్పటి నుంచి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. మళ్లీ పరీక్ష నిర్వహించినా తను రాయడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చిన ర్యాంక్ మళ్లీ వస్తుందనే గ్యారంటీ ఉండదు కదా? తప్పు చేసిన వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టి మిగిలిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలి.      - రోహిణి, ఎంసెట్-2లో ఫస్ట్ ర్యాంకర్ ఉజ్వల్ తల్లి

 

తప్పు చేసిన వారినే శిక్షించాలి

ఎంసెట్-2లో తప్పు చేసిన వారికే శిక్ష పడాలి. రేరుుంబవళ్లు కష్టపడి పరీక్ష రాసిన నాలాంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. భవి ష్యత్తుపై ఎన్నో కలలతో ర్యాంకును సాధిం చాను. ఇప్పుడు ఇలా జరగడం బాధగా ఉంది.    - కాసం ఐశ్వర్య, సెకండ్ ర్యాంకర్

 

వారికే పరీక్ష పెట్టాలి


లీకేజీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. దీంతో సంబంధం ఉన్న విద్యార్థులకు మాత్రమే తిరిగి పరీక్ష నిర్వహించాలి. కష్టపడి చదివి రెండుసార్లు ఎంసెట్ రాశాం. చేతికి అందిన మెడికల్ సీటు చేయి జారి పోతుందంటే ఎంత బాధ ఉంటుందో మాటల్లో చెప్పలేం.   - జె.ప్రణవీరెడ్డి, 6వ  ర్యాంకర్



మాకెందుకీ శిక్ష

తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే. కానీ ఏ తప్పు చేయని మాలాంటి వారికి నష్టం కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం సమంజసం కాదు. ఎంసెట్-2 రద్దు అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలి.     - వినీత్‌రెడ్డి, 9వ ర్యాంకర్

 

మళ్లీ పరీక్ష వద్దే వద్దు

మెడిసిన్‌లో సీటు కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. కష్టపడి చదివి 18 వ ర్యాంకు సాధించాను. కొందరి కోసం అందరిని బలి చేయడం భావ్యం కాదు. ఎంసెట్-3 వద్దే వద్దు.     - మాడూరి చైతన్య, 18వ ర్యాంకు



ఎంసెట్టా..? యూనిట్ టెస్టులా?

ఇప్పటికే తెలంగాణ, ఏపీ కలిపి 3 ఎంసెట్‌లు రాశాం. దీనికి అదనంగా నీట్ కూడా. ఏ కోర్సుకైనా ఒకేసారి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో ఇప్పటికే 2 నిర్వహించారు. మరోసారి నిర్వహిస్తామని చెబుతున్నారు. ఇది ఎంసెట్టా..? లేక యూనిట్ టెస్ట్‌లా? అర్థం కావడం లేదు.  - హేమ,  26వ ర్యాంక్,  తార్నాక



నిద్ర కూడా పట్టడం లేదు


ఇప్పటికే రెండు సార్లు ఎంసెట్ రాశాం. మళ్లీ మూడోసారి పెడతాం.. రాయండి అంటే కష్టం. లీకేజీ వ్యవహారంతో నిద్ర కూడా పట్టడం లేదు. మళ్లీ పరీక్ష అంటే ఎంత టార్చర్ ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రభుత్వానికి అర్థం కావట్లేదు.    - తనిష్ట్, 27వ ర్యాంక్

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top