పిటీ కాలేజీలు

పిటీ కాలేజీలు


ఆ కాలేజీల దరఖాస్తుఫారాలు కావాలంటే కిలోమీటర్ల కొద్దీ క్యూ కట్టాల్సిందే. రోజులతరబడి కాళ్లరిగేలా కళాశాలల చుట్టూ తిరగాల్సిందే. అడ్మిషన్ల సంగతి సరేసరి! అత్యంత ప్రతిభ చూపినవారికే అక్కడ సీటు. హైదరాబాద్ నగరం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చేవారు.



అనుభవజ్ఞులైన అధ్యాపకులు.. పెద్ద పెద్ద భవనాలు.. విశాలమైన ఆవరణ.. పచ్చని చెట్లు..! ఇదంతా.. ఏదైనా కార్పొరేట్ కళాశాల గురించి అనుకుంటున్నారా? కాదు సుమా! ఇదీ నగరంలో ఒకప్పుడు వెలుగు వెలిగిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల ఘనత. అవే ఆలియా, మహబూబియా, సిటీ కాలేజీలు. తరగతి గదులు కిటకిటలాడేవి. విద్యాసంవత్సరమంతా కళకళలాడేవి. ఆటపాటలతో అలరించేవి. వాటిల్లో తమ పిల్లలను చదివించడం తల్లిదండ్రులకో డ్రీమ్. అవి నగరానికే తలమానికం. అక్కడి విద్యే ప్రమాణికం.    - సాక్షి, సిటీబ్యూరో


 

 ఆలియా, మహబూబియా, సిటీ కాలేజీల్లో తగ్గిన అడ్మిషన్లు



ఆలియాలో గతంలో అడ్మిషన్లు వెయ్యికిపై మాటే.. నేడు 141 మంది చేరిక..

ఆలియాలో 35 పోస్టులకుగాను

ముగ్గురే రెగ్యులర్ అధ్యాపకులు


 

గతమెంతో ఘనమైనది. వర్తమానం మాత్రం దానికి పూర్తి భిన్నం. ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు బోసిపోయి కనిపిస్తున్నాయి. విద్యార్థుల్లేక వెలవెలబోతున్నాయి. ఆగస్టు సమీపిస్తున్నా పూర్తిస్థాయిలో అడ్మిషన్లు భర్తీ కాని పరిస్థితి. దరఖాస్తు ఫారాలు కట్టలుకట్టలుగా అలాగే ఉండిపోయాయి.  ఇంకా విద్యార్థులు రాకపోతారా.. అని సిబ్బంది ఎదురుచూపులు. సరిపడా లేని అధ్యాపకులు. భర్తీ కాని పోస్టులు.. ఇదీ గత పదేళ్లుగా ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాలల దుస్థితి.

 

చారిత్రక నేపథ్యం కలిగిన విద్యాలయాల్లో దుర్భర పరిస్థితులు నెలకొనడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన ఎంతోమంది ప్రముఖులు ఈ కళాశాలల్లో చదువుకున్నవారే. గత పాలకుల నిర్లక్ష్యంతోపాటు పుష్కర కాలంగా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు సాగిస్తున్న వ్యాపార దృక్పథమే ఈ దుస్థితికి ప్రధాన కారణాలు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రప్రభుత్వమైనా ఈ కాలేజీలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేవిధంగా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

 

ఆలియా.. మహబూబియా..

నిజాం నవాబుల కుటుంబ సభ్యుల విద్యాభ్యాసం కోసం 1910లో ఈ భవనాలను నిర్మించారు. ఆలియా స్కూల్లో అబ్బాయిలకు, మహబూబియా స్కూల్లో అమ్మాయిలకు చదువు చెప్పేవారు. ఆప్పట్లో ఒకటి నుంచి 12వ తరగతి వరకు విద్యాబోధన సాగేది. నిజాంల పాలన అనంతరం అన్నివర్గాల వారికి ఈ విద్యాలయాల్లో చదువుకునే అవకాశం కలిగింది. 1974-75నుంచి పాఠశాల నుంచి జూనియర్ కళాశాలలను ప్రభుత్వం వేరు చేసింది. 2000 సంవత్సరం వరకు ఒక్కో కళాశాలలో విద్యార్థుల సంఖ్య వెయ్యికి పైమాటే.

 

ఫస్టియర్ ఇంటర్‌లో అడ్మిషన్ కోసం ఒక్కో కళాశాల్లో 580సీట్లకు గాను ఐదారువేలకు పైగా దరఖాస్తులు వచ్చేవి. పోలీసు బందోబస్తు నడుమ నెలరోజులపాటు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగేది. ప్రస్తుతం ఆలియా జూనియర్ కళాశాల్లో ఫస్టియర్ అడ్మిషన్లు 141కి పడిపోగా, మహబూబియా కళాశాలల్లో కేవలం 101 మందే చేరారు. ఆలియాలో 35 మంది అధ్యాపకుల్లో రెగ్యులర్ అధ్యాపకులు ముగ్గురే. మహబూబియాలో 40 పోస్టులకుగాను పనిచేస్తున్నది నలుగురే. ఇక నాన్‌టీచింగ్ సిబ్బంది సంగతి సరేసరి.

 

సిటీ కాలేజీలోనూ ఇదే పరిస్థితి..

1929 లో సిటీ కాలేజీ నిజాం హయాంలో ఏర్పాటైంది. మదర్‌సా ఫౌకానియా(8-12వరకు) పేరిట బాలురకు హయ్యర్ సెకండరీ విద్యను అందించేవారు. 1963 తర్వాత కళాశాలను అప్‌గ్రేడ్ చేస్తూ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టారు. ఉదయం డిగ్రీ, మధ్యాహ్నం నుంచి జూనియర్ కళాశాలలు షిఫ్టు పద్ధతిన నడుస్తున్నాయి. 1975 నుంచి ఇంటర్ విద్య వేరైంది. జూనియర్ కళాశాల కోసం నిర్మించిన భవనంలో డిగ్రీ కళాశాల నడిపిస్తున్న అధికారులు తగిన వసతులను కల్పించడంలేదు. ఫలితంగా ఇంటర్ కోర్సులకు డిమాండ్ తగ్గిపోయింది. సుమారు 600 మందికి అవకాశం ఉన్నా.. ఈ ఏడాది ఫస్టియర్ అడ్మిషన్ల సంఖ్య 300 లోపే ఉండడం గమనార్హం.

 

 ఆ కళాశాలల దుస్థితికి కారణాలు..

2000 సంవత్సరం వరకు ఓ వెలుగు వెలిగిన ఈ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య గణ నీయంగా పడిపోవడానికి  కార్పొరేట్ సంస్థల ప్రవేశమే ప్రధాన కారణం.

* టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాసిన వెంటనే కార్పొరేట్  జూనియర్ కళాశాలలు వెంటబడి మార్చిలోనే అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం నిబంధనల ప్రకారం జూన్ మొదటి వారంలోనే అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయి.

* పుష్కర కాలంగా రెగ్యులర్ అధ్యాపకుల నియామకం లేదు. ఇటీవల రిక్రూట్ మెంట్ జరిపినా కాలేజీకి ఒకరిద్దరు అధ్యాపకులు మాత్రమే వచ్చారు.  అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కాంట్రాక్టు అధ్యాపకులతోనే కాలం వెళ్లదీస్తున్నాయి.

* పభుత్వపరంగా నియామకాల్లేకపోవడం ప్రైవేటు సంస్థలకు కలిసొచ్చింది. వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తామంటూ విద్యార్థులకు గాలం వేశాయి.

* చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో జవాబుదారీతనం కొరవడింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడంతో.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌విద్య అగమ్యగోచరంగా తయారైంది.

*  మహబూబియా, ఆలియా, సిటీ క ళాశాలల్లో చదువుకునేందుకు నగరంతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది. అవి ఆగిపోవడంతో విద్యార్థులు రావడం లేదు.

* శిథిలావస్థకు చేరిన కళాశాల భవనాలకు మరమ్మతులు చేసేందుకు ఇంటర్ బోర్డు ముందుకు వచ్చినా.. చారిత్రక, వారసత్వ కట్టడాలంటూ పురావస్తు శాఖ ససేమిరా అంటోంది. రిపేర్లు చేయకపోవడంతో శిథిలావస్థకు చేరిన తరగతి గదులు నిరుపయోగంగా ఉన్నాయి.

* తెలుగు మాధ్యమంలో విద్యార్థులు చేరడంలేదు. ఆంగ్లమాధ్యమంలో అడ్మిషన్లు అరకొరగా ఉన్నాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top