200 డ్రా చేస్తే 24 లక్షలు వచ్చాయి

200 డ్రా చేస్తే 24 లక్షలు వచ్చాయి - Sakshi


హైదరాబాద్: లక్షల రూపాయిలు చేతి దాకా వచ్చినా ఆ డబ్బు తమది కాదంటూ పోలీసులకు అప్పగించారు ముగ్గురు యువకులు. ఉద్యోగ వేటలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా నిజాయితీతో పలువురికి ఆదర్శంగా నిలిచారు. నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ హాస్టల్‌లో ఉంటున్న లతీఫ్, హరిప్రసాద్, శివ దుర్గాప్రసాద్‌లు శుక్రవారం రాత్రి డబ్బులు డ్రా చేసేందుకు సమీపంలోని ఎస్‌బీహెచ్ ఏటీఎంకు వెళ్లారు. లతీఫ్ తన కార్డు నుంచి రూ. 200 డ్రా చేసేందుకు  ప్రయత్నించగా ఒక్కసారిగా డబ్బుల ప్రవాహం పోటెత్తింది. క్యాష్‌డోర్ ఆటోమెటిక్‌గా తెరుచుకొని రూ. 24 లక్షలు బయటకొచ్చాయి. ఇది చూసి అవాక్కైన ఆ ముగ్గురూ వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేంత వరకు ఏటీఎం వద్దే డబ్బులకు కాపలా ఉన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఏటీఎంలో డబ్బులు పెట్టిన అధికారులు క్యాష్ డోర్‌కు లాక్ వేయడం మరిచిపోయినట్లు గుర్తించారు. యువకులు సమాచారం ఇవ్వడం వల్లే లక్షల రూపాయలు కాపాడగలిగామని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని నగర కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి విద్యార్థులకు అవార్డులు ఇప్పిస్తామన్నారు.



నిరుద్యోగంలోనూ నిజాయితీగా ..



పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడే నికి చెందిన లతీఫ్ (22), మహబూబ్‌నగర్‌కు చెందిన హరిప్రసాద్ బీటెక్ గ్రాడ్యుయేట్లు. ఇక శివ దుర్గాప్రసాద్ సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ముగ్గురూ ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్నారు. అక్కడే స్నేహితులయ్యారు. లతీఫ్, హరిప్రసాద్‌ల తండ్రులిద్దరూ టీచర్లు. శివ దుర్గాప్రసాద్ కుటుంబం మహబూబ్‌నగర్‌లో చిన్న హోటల్ నిర్వహిస్తోంది. తల్లిదండ్రులకు అండగా ఉండాలనే తపనతో ఈ ముగ్గురు చదువుకుంటూనే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏటీఎం సెంటర్‌లో లక్షల రూపాయలు కనిపించి, తీసుకునేందుకు అవకాశాలున్నా నిజాయతీతో మెలిగారు. తాము చేసిన పనికి పోలీసులు, స్థానికులు అభినందిస్తుంటే అదే కోట్ల రూపాయలు సంపాదించినంత ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top