ఏపీకి ప్రత్యేక హోదా అత్యవసరం

ఏపీకి ప్రత్యేక హోదా అత్యవసరం - Sakshi


* వెంటనే ఏపీకి హోదా ఇవ్వాలని వామపక్షాల డిమాండ్

* హోదా కోసం పోరాటం కొనసాగిస్తాం: ఏచూరి

* ఫిరాయింపుదారులపై అనర్హత విధించే అధికారం స్వతంత్ర సంస్థ చేతుల్లో ఉండాలి

* వామపక్షాల నేతలతో వైఎస్ జగన్ భేటీ

* హోదా సహా పలు అంశాలపై చర్చ.. మద్దతు కోసం వినతి

* జీఎస్టీ బిల్లు తర్వాత హోదా మరింత అవసరం: వైఎస్ జగన్

* అది మన హక్కు.. హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు

* సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడి




సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా తక్షణావసరమని, కుంటిసాకులు చెప్పకుండా వెంటనే హోదాను ప్రకటించాలని సీపీఐ రాజ్యసభ పక్ష నేత డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. హోదా సాధనకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని.. ప్రజా ఉద్యమాల ద్వారా, పార్లమెంటులో ఆందోళన ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఏపీకి హోదాతో పాటు ఇతర అంశాలపై చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం వారిరువురిని విడివిడిగా కలిశారు. ఉదయం 10 గంటలకు డి.రాజాను ఆయన నివాసంలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, విజయసాయి రెడ్డి, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి భేటీ అయ్యారు.



అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరిని కలిశారు. ఈ సమావేశంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.ఎ.బేబీ కూడా పాల్గొన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మూడు పేజీల వినతిపత్రాన్ని వారిరువురికీ అందజేశారు. ప్రత్యేక హోదా సాధనలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని, క్షేత్రస్థాయిలో తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా అంశంతోపాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వై.ఎస్.జగన్ ఈ సమావేశంలో వారి దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్‌సీపీ పోరాటాలకు వామపక్షాల మద్దతు ఉంటుందని వారు హామీ ఇచ్చారు. సమావేశాల అనంతరం రాజా, సీతారాం ఏచూరి, జగన్ విలేకరులతో మాట్లాడారు.

 

హోదా కోసం కార్యాచరణ: డి.రాజా

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాని, ప్రభుత్వం హామీలు ఇస్తే.. తదుపరి ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాలి. రాజ్యసభలో విభజన బిల్లు వచ్చినప్పుడు వాళ్లు కూడా పట్టుపట్టారు. నేను కూడా అక్కడే ఉన్నాను. వెంకయ్య నాయుడు ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలన్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. అరుణ్ జైట్లీ ఆనాడు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నేడు రాజ్యసభ సభా నాయకుడిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నారు.



బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. మోదీ తిరుపతిలో ఈమేరకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదాను తిరస్కరిస్తూ నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఈ విషయంలో వారు చెబుతున్న కారణాలు ప్రజలు అంగీకరించేలా లేవు. దీనిపై ఇతర వామపక్షాలతో సంప్రదింపులు జరుపుతాం. హోదా సాధనకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడుతాం. నేను జగన్‌మోహన్‌రెడ్డికి ఇదే హామీ ఇచ్చాను. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీ విషయంలో సామరస్యపూర్వక పరిష్కారం కనుక్కోవాలి. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలి.

 

ఉద్యమాలతో ఒత్తిడి తెస్తాం: ఏచూరి

ప్రత్యేక హోదా ఏపీకి తక్షణావసరం. ఇతర రాష్ట్రాలకు  ఇవ్వాలా లేదా? దాని వల్ల ఏపీకి ఇవ్వలేమన్నది అర్థం లేని వాదన. ప్రత్యేక హోదాపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా అర్థమవుతోంది. చేసిన వాగ్దానాలను అమలుచేయరని స్పష్టమవుతోంది. తిరిగి ఈ అంశాన్ని పార్లమెంటు ముందుకు, ప్రజల ముందుకు తీసుకొస్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా, పార్లమెంటులో ఆందోళన ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. పోరాటాన్ని భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై ఈ సమావేశంలో చర్చించాం. నీటి పంపకం రాష్ట్రాల మధ్య ఎలా ఉండాలన్న అంశంపై చర్చించాం.



ఇది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యమాత్రమే కాదు. అన్ని రాష్ట్రాల మధ్య సమస్య ఏర్పడుతోంది. జాతీయస్థాయిలో ఎలా చేయాలో చర్చించాలి. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ నుంచి ఎన్నికల సంఘంలోకి రావాలన్న ప్రతిపాదన చేశారు. దీనిని ఇతర పార్టీలతో చర్చిస్తాం. ఆ అధికారం ఒక స్వతంత్ర సంస్థ చేతుల్లో ఉండడం అవసరం.

 

రాజీ పడితే చరిత్ర హీనులుగా మిగులుతారు: జగన్

జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం అన్నది అతి ముఖ్యమైన అంశంగా మారింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో సేల్స్‌టాక్స్ అంశం ఉండేది. కొత్త పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సేల్స్ టా క్స్ రాయితీలు ఇచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సేల్స్ టాక్స్ అన్న అంశం కూడా జీఎస్టీ రావడం వల్ల కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయింది.



సేల్స్ టాక్స్‌పై ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటి మినహాయింపులు లేనప్పుడు ఎవరైనా కూడా కొత్త రాష్ట్రం, ఏ మౌలిక వసతులు లేని ఏపీకి రావడానికి ఏ పారిశ్రామికవేత్తయినా ఎందుకు ఉత్సాహం చూపుతారు? ఇప్పటికే మౌలిక వసతులు ఉన్న చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్‌కో పోవడానికి ఉత్సాహం చూపుతారు. ఒకవైపు హైదరాబాద్ పోయింది.. ఇతర రాష్ట్రాలతో సమాన బలం లేకుండా పోయిం ది.. సేల్స్‌టాక్స్ మినహాయింపులు ఇచ్చే అవకాశం పోయింది. కాబట్టి ఇప్పుడు జీఎస్టీ వచ్చిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా రావడం తప్పనిసరి అయింది. హోదా కలిగిన రాష్ట్రాలకే జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలకు ఉండదు.



రూ. లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రానికి రావాల్సినవన్నింటినీ మూటకట్టి ప్యాకేజీగా చూపిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వందేళ్లు పోరాటం చేస్తేనే స్వాతంత్య్రం వచ్చింది. ఏదైనా పోరాడితేనే సాధిస్తాం. రాజీపడకుండా గట్టిగా పోరాటం చేస్తేనే హోదాను మరిచిపోలేరు. హోదా మన హక్కు. హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయి. లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడాలంటే హోదా తప్పనిసరి. ఎవరైనా కూడా రాజీ పడకూడదు. పడితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ప్రత్యేక హోదా అన్న అంశంపై అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అంశం.



ఈ అంశం జాతీయస్థాయిలో కూడా చర్చించదగ్గ అంశం. పార్లమెంటు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే... ప్రజల్లో ప్రజాస్వామ్య విశ్వసనీయతను కాపాడాలంటే... ప్రతిఒక్కరు అడగాల్సిన అంశం. ఈ విషయంలో ఏచూరి ఇంతవరకు మద్దతు ఇస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై రాష్ట్రంలోనూ, పార్లమెంటులో కలిసికట్టుగా ఒక్కటై పోరాటం చేయాలి. ఇతర పార్టీలను కూడా కలుపుకుని హోదా సాధించే దిశగా అడుగులు వేస్తాం. సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని ఘంటాపథంగా చెబుతున్నాం.

 

నేడు రిషికేష్‌కు వైఎస్ జగన్

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రిషికేష్‌కు వెళుతున్నారు. అక్కడ విశాఖ శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులను ఆయన తీసుకుంటారు. ఏపీకి హోదా ఇచ్చేలా కేం ద్రం మనసు మారాలని, రాష్ట్రం సుభిక్షం గా ఉండాలనే ఆకాంక్షతో జగన్ అక్కడికి వెళుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top