తెలుగు వర్సిటీ నోటిఫికేషన్ అమలును నిలిపేయండి

తెలుగు వర్సిటీ నోటిఫికేషన్ అమలును నిలిపేయండి - Sakshi


హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ పిటిషన్

గతంలో మాదిరిగా సేవలందించేలా ఆదేశించాలని అభ్యర్థన


 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు తన సేవల్ని నిలిపేస్తూ శ్రీపొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీలోని క్యాంపస్‌లకు గతంలో మాదిరిగా యథాతథంగా తన సేవల్ని కొనసాగించేలా తెలుగు వర్సిటీని ఆదేశించాలని కోరుతూ ఉన్నత విద్యాశాఖ డిప్యూటీ కార్యదర్శి జి.కన్నందాస్ గురువారం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి, కూచిపూడి, శ్రీశైలం ప్రాంతాల్లో క్యాంపస్‌లు ఉన్నాయని, ఇందులో 348 మంది విద్యార్థులు చదువుతున్నారని, అలాగే బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారని కన్నందాస్ వివరించారు. తెలుగు విశ్వవిద్యాలయం తన సేవల్ని ఆంధ్రప్రదేశ్‌లో క్యాంపస్‌లకు నిలిపేయడం వల్ల వీరంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.



తన సేవల్ని కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేస్తూ తెలుగు వర్సిటీ జారీచేసిన చేసిన నోటిఫికేషన్ ఏపీ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. పదవ షెడ్యూల్‌లో ఉన్న సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే వాటిపై ఆ రాష్ట్రానిదే అధికారమని నిబంధనలు చెబుతున్నాయని, ఇందులోభాగంగా రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయినందున తన సేవలు కావాలంటే ఒప్పందం కుదుర్చుకోవాలని తెలుగు వర్సిటీ వైస్‌చాన్సలర్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు.



ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని తాము కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశామని, అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఏ విధమైన స్పందన రాలేదని వివరించారు. ఇదే విషయాన్ని వైస్‌చాన్సలర్‌కు తెలియచేసి.. వర్సిటీ సేవలను ఏపీ క్యాంపస్‌లకు సైతం కొనసాగించాలని కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తన సేవల్ని ఏపీలోని కేంద్రాలకు అందించకపోవడంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతోందని, అందువల్ల తెలుగు వర్సిటీ విషయంలోనూ జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top