బీర్.. కుటీర్!

బీర్.. కుటీర్!


వాటర్ ప్లాంట్ల మాదిరి బీరు ప్లాంటు

డ్రాట్ బీరు ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

 

హైదరాబాద్: ఇక బీరు కూడా కుటీర పరిశ్రమగా మారబోతోంది! బార్ అండ్  రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల యజమానులతోపాటు ఎవరైనా సొంతంగా బీరు తయారుచేయవచ్చు. వారి సొంత బ్రాండ్‌తోనే దాన్ని దర్జాగా ఆమ్ముకోవచ్చు. ఇందుకు చేయాల్సిందల్లా.. వాటర్ ప్లాంట్ మాదిరి ఓ బీరు ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే సరి! ప్లాంటుకు వెయ్యి చదరపు మీటర్ల స్థలం చూపి ఎవరైనా ఇలా బీరు తయారు చేసేందుకు

అనుమతి పొందొచ్చు. ఈ తరహా బీరు ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఇప్పటిదాకా పబ్బుల్లోనే లభించే డ్రాట్ బీర్లు ఇకపై బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లు, గల్లీల్లో కూడా కనిపించనున్నాయి. అక్టోబర్ నుంచి గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు పర్యాటక ప్రాంతాల్లో ఈ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. పుణ్యక్షేత్రాలను మాత్రం ఈ విధానం నుంచి మినహాయించారు.



ఈ మేరకు ‘మైక్రో బ్రేవరీ రూల్స్- 2015’ పేరుతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబర్ 151) జారీ చేసింది. ఈ నిబంధనలు తెలంగాణ అంతటా వర్తిస్తాయని జీవోలో పేర్కొన్నారు. అయితే ముందుగా జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు దాన్ని ఆనుకొని ఉన్న మరో

5 కి.మీ ప్రాంతం, పర్యాటక ప్రాంతాల్లోనే బీరు ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తారు. మున్ముందు మున్సిపాలిటీలు,

కార్పొరేషన్లలో కూడా ఇలాగే అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

రోజుకు వెయ్యి లీటర్ల బీరు..

కొత్తగా మెక్రో బ్రేవరీ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు లెసైన్స్ కోసం ఎక్సైజ్ శాఖకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీ లెసైన్స్ పేరుతో ప్రత్యేకంగా ఈ బీరు ప్లాంట్లకు అనుమతులు మంజూరు చేస్తారు. ప్రతి రోజూ వెయ్యి లీటర్ల మేర డ్రాట్‌బీరును ఉత్పత్తి చేసుకునేలా ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు వెయ్యి చదరపు మీటర్ల స్థలం ఉంటే సరిపోతుంది. అందులో తప్పనిసరిగా 100 చ.మీ. సర్వింగ్ ఏరియా, 300 చ.మీ. ప్లాంటుకు కేటాయించాలి. మరో 200 చ.మీటర్లు పార్కింగ్‌కు కేటాయించాల్సి ఉంటుంది. అనుబంధంగా రెస్టారెంట్ ఉంటే మాత్రం.. ప్లాంటు ఏర్పాటుకు కేవలం 300 చ.మీ. స్థలం ఉంటే సరిపోతుంది. ఒక్కో మైక్రో బ్రేవరీ ప్లాంట్ అనుమతికి లెసైన్సు ఫీజుగా రూ.3 లక్షలు నిర్ణయించారు. మైక్రో బ్రేవరీ ఏర్పాటుకు ముందుగా స్థానిక పాలక మండలి(జీహెచ్‌ఎంసీ)కి రూ.5 వేలు చెల్లించి అనుమతి పొందాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాధారణంగా బార్లు, మద్యం దుకాణాలకు ఉండే నిబంధనలే ఈ మైక్రో బ్రేవరీలకు వర్తిస్తాయి. స్టార్ హోటళ్లకు ఈ నిబంధనల్లో కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చారు.

 

రూ.2 కోట్లు చాలు..

ప్రస్తుతం పబ్బుల్లో బ్రాండెడ్ బీర్ల కంపెనీలే డ్రాట్ బీరును సరఫరా చేస్తున్నాయి. మైక్రో బ్రేవరీలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇప్పటిదాకా లేకపోవడమే ఇందుకు కారణం. దేశంలోని కొన్ని మెట్రో నగరాలు, పర్యాటక ప్రాంతాల్లో మైక్రో బ్రేవరీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సొంత ప్లాంట్‌లో తయారు కావడం వల్ల తక్కువ ధరకు బీరు లభించనుంది. బీరు ప్లాంటు మిషనరీ, రెస్టారెంటుకు అయ్యే ఖర్చు కూడా తక్కువేనని అధికారులు చెబుతున్నారు. రూ.2 కోట్ల పెట్టుబడితో బీరు ప్లాంటు, రెస్టారెంటు ఏర్పాటుతోపాటు అనుమతులు అన్నీ సమకూరుతాయని టీఎస్‌బీసీఎల్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

 

ఇవీ నిబంధనలు..

మైక్రో బ్రేవరీల్లో రోజుకు వెయ్యి లీటర్ల కన్నా ఎక్కువ బీరు ఉత్పత్తి చేయరాదు

బీరును బాటిళ్లలో నింపరాదు. బ్రేవరీ వెలుపల అమ్మరాదు

ఈ బీరు జీవితకాలం 36 గంటలే.. 36 గంటల తర్వాత వినియోగించరాదు

మైక్రో బ్రేవరీ ప్లాంటులో తప్పనిసరిగా ఓ కెమిస్ట్ ఉండాలి

మైక్రో బ్రేవరీ అమ్మకాల్లో 50 శాతం మొత్తాన్ని ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ కింద చెల్లించాలి

బార్లలో మద్యం అమ్మకాల సమయమే ఈ డ్రాట్ బీర్ల అమ్మకాలకు వర్తిస్తుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top