రయ్... రయ్...

రయ్... రయ్...


పెద్దఅంబర్‌పేట- ఘట్‌కేసర్ మార్గం ప్రారంభం

వరంగల్- విజయవాడ  హైవేలతో అనుసంధానం

ఉప్పల్, ఎల్బీనగర్‌లలో తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ


 

సిటీబ్యూరో   ఔటర్‌పై వాహనాల పరుగులు మొదలయ్యాయి. కీలకమైన వరంగల్-విజయవాడ జాతీయ రహదారితో ‘లింక్’ కుదిరింది. ఫలితంగా దూరం తగ్గింది. సమయం కలిసి వస్తోంది. ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గంలోని ఔటర్ రింగ్ రోడ్డు ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. సుమారు 14 కి.మీ. ఔటర్ ప్రధాన రహదారి (మెయిన్ క్యారేజ్ వే)ని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) అధికారులు బుధవారం ప్రారంభించారు. 8 లైన్ల ప్రధాన రహదారిపై రయ్... రయ్... మంటూ వాహనాలు దూసుకుపోతున్నాయి. ఘట్‌కేసర్-పెద్దఅంబర్‌పేట మార్గంలో రాకపోకలకు అనుమతించడంతో వరంగల్ నుంచి విజయవాడ జాతీయ రహదారికి అనుసంధానమైంది. ఘట్‌కేసర్ జంక్షన్  వద్ద ఔటర్ పైకి ఎక్కిన వాహనం నేరుగా పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారికి చేరుకునేందుకు వీలు కలిగింది. ప్రధానంగా వరంగల్- విజయవాడ, వరంగల్-బెంగళూరు, వరంగల్- ముంబయ్ ప్రాంతాలకు  వెళ్లే సరుకు రవాణా వాహనాలకు ఈ మార్గంతో ఎంతో ప్రయోజనం కలుగుతుంది.



ప్రస్తుతం వరంగల్ నుంచి వచ్చే సరుకు రవాణా వాహనాలు ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి నాగోల్, ఎల్బీనగర్ మీదుగా వనస్థలిపురం, హయత్‌నగర్ గుండా ప్రయాణించి పెద్దఅంబర్‌పేట వద్ద విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-9)పైకి చేరుకుంటున్నాయి. ఘట్ కేసర్-పెద్ద అంబర్‌పేట ఔటర్ అందుబాటులోకి రావడంతో వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా శివార్ల నుంచే ప్రధాన రహదారులకు చేరుకునే  అవకాశం కలుగుతోంది. వరంగల్ నుంచి వచ్చే వారు శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తక్కువ సమయంలో నేరుగా చేరుకునేందుకు ఈ మార్గం ఉపకరిస్తుంది.



ఉచిత ప్రవేశం



ఘట్‌కేసర్ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనాలకు ప్రవేశం ఉచితం. ఈ మారంలో వాహనదారుల నుంచి టోల్‌ట్యాక్స్ (దారి సుంకం) వసూలు చేయరాదని హెచ్‌జీసీఎల్ అధికారులు నిర్ణయించారు. కొంతకాలం ఉచితంగా అనుమతించి... ట్రాఫిక్ రద్దీని గమనించాక టోల్‌ట్యాక్స్ వసూలుపై దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం ప్రధాన రహదారి మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఔటర్‌కు ఇరువైపులా సర్వీసుల రోడ్లు, ఇతర నిర్మాణాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని జూన్ నాటికి పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. పెద్దఅంబర్‌పేట-ఘట్‌కేసర్ 14 కి.మీ. స్ట్రెచ్‌ను రూ.300 కోట్ల వ్యయంతో ఎన్‌సీసీ సంస్థ నిర్మించింది. నిజానికి 2012 నవంబర్‌కుఈ మార్గం పూర్తవ్వాల్సి ఉంది. భారీగా రాక్ కటింగ్‌తో పాటు మూసీ నదిపై 200 మీటర్ల మేర 6 స్పాన్లతో బ్రిడ్జి నిర్మించాల్సి రావడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరిగినట్లు హెచ్‌ఎండీఏ చెబుతోంది.



త్వరలో పెండింగ్ పనులు పూర్తి



మొత్తం 158 కి.మీ. ఔటర్ రింగ్ రోడ్డుకు గాను ఇప్పటి వరకు 134 కి.మీ. అందుబాటులోకి వచ్చింది. ఇంకా 24 కి.మీ. రోడ్డు నిర్మాణం పెండింగ్‌లో ఉంది. ఘట్‌కేసర్- కీసర (10 కి.మీ.) మార్గాన్ని, ఘట్‌కేసర్ ఆర్వోబీని జూన్‌కుపూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఓఆర్‌ఆర్ సీజీఎం ఆనంద్ మోహన్ తెలిపారు. కీసర-శామీర్‌పేట (10.3 కి.మీ.) ప్రధాన మార్గాన్ని ఈ ఏడాది నవంబర్‌కు పూర్తి చేస్తామని చెప్పారు. కండ్లకోయ జంక్షన్ వద్ద భూసేకరణ కేసు సుప్రీం కోర్టులో ఉన్నందున అక్కడ 1.1 కి.మీ. మేర నిర్మాణం చేపట్టలేకపోయామన్నారు. ప్రస్తుతం 18 జంక్షన్లలో టోల్ అడ్మినిస్ట్రేషన్ భవనాల నిర్మాణం మొదలైందన్నారు. 2016 ఫిబ్రవరి నాటికి నిర్మాణాలు పూర్తి చేసి ఔటర్‌పై ఆధునిక టోల్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని ఆయన వివరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top