నాపై సీబీఐ కేసును కొట్టేయండి..

నాపై సీబీఐ కేసును కొట్టేయండి.. - Sakshi


సాక్షి, హైదరాబాద్: దాల్మియా సిమెంట్స్‌కు గనుల లీజు మంజూరు వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని న్యాయమూర్తి జస్టిస్ బలుసు శివశంకరరావు బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వై.శ్రీనివాసమూర్తి వాదనలు వినిపిస్తూ.. శ్రీలక్ష్మి నిబంధనల ప్రకారమే వ్యవహరించారన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోకుండానే సీబీఐ అధికారులు ఆమెను అన్యాయంగా ఈ కేసులో ఇరి కించారన్నారు. లీజు మంజూరు అప్పటి మం త్రిమండలి తీసుకున్న నిర్ణయమని, మంత్రుల్ని వదిలేసిన సీబీఐ, పిటిషనర్‌ను దురుద్దేశంతో ఈ కేసులో నిందితురాలిగా చేర్చిందన్నారు.

 

 మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాల్ని అధికారులు అమలు చేయాల్సి ఉంటుందని, దీనిని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పిటిషనర్‌ను విచారించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వకపోయినా సీబీఐ దురుద్దేశాలతో వ్యవహరించిందన్నారు. జయమినరల్స్‌కున్న ప్రాస్పెక్టింగ్ లెసైన్స్‌ను దాల్మియా సిమెంట్స్‌కు చెందిన ఈశ్వర్ సిమెంట్స్‌కు బదలాయింపు వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది పిటిషనర్‌పై ఆరోపణని, అయితే సంబంధితశాఖ మంత్రి ఆమోదం తెలిపాకే బదలాయింపు జరిగిందని శ్రీనివాసమూర్తి వివరించారు. ఈ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని, గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాది పి.కేశవరావు కోరడంతో న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top