డ్రగ్స్‌ వాసనా పట్టేస్తాయ్‌..!

డ్రగ్స్‌ వాసనా పట్టేస్తాయ్‌..! - Sakshi

త్వరలో అందుబాటులోకి స్పాట్‌ డ్రగ్‌ టెస్ట్‌ కిట్స్‌

- వాడకందారులను నిమిషాల్లో పట్టించగల పరికరాలు

- అనుమానితుల మూత్ర, జుట్టు నమూనాల ద్వారా పరీక్షలు

 

సాక్షి, హైదరాబాద్‌: మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబులెవరో చిటికెలో తేల్చే డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షల తరహాలోనే డ్రగ్స్‌ బానిసలను స్పాట్‌లోనే పట్టుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్‌ తీసుకున్నది ఎవరు... ఎంత మోతాదులో తీసుకున్నారు...వాటి పేర్లు ఏమిటి వంటి విషయాలను నిమిషాల్లో పసిగట్టగలిగే పరికరాల (కిట్స్‌)ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం పోలీసు, ఎక్సైజ్‌శాఖ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. 

 

ఎన్‌సీబీ నేతృత్వంలో... 

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) నేతృత్వంలో రాష్ట్రం లో డ్రగ్స్‌ మూలాలను ఛేదించడంతోపాటు హైదరాబాద్‌లో డ్రగ్‌ పెడ్లర్లను నియంత్రించాలని పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించినట్టుగానే అనుమానాస్పద వ్యక్తులపై డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించాలనుకుంటున్నాయి. తద్వారా డ్రగ్స్‌ బానిసలను కచ్చితమైన ఆధారాలతో పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాయి. ఎన్‌సీబీ ఆధ్వర్యంలో బెంగళూరులో ఇటీవల జరిగిన శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అధికారుల బృందం పాల్గొంది. దీనిలోనే ఎన్‌సీ బీ అధికారులు స్పాట్‌ డ్రగ్‌ టెస్ట్‌ కిట్స్‌పై అవగాహన సైతం కల్పించినట్టు తెలిసింది. ఈ కిట్స్‌ను అమెరికా, లండన్, జర్మనీ, ఇజ్రాయెల్‌లలో తయారు చేయిస్తున్నట్టు అధికారులకు ఎన్‌ సీబీ వివరించింది. వాటి ని త్వరలోనే అన్ని రాష్ట్రా ల ఎక్సైజ్, పోలీసు ఇతర ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలకు అందించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

 

ఆరు రకాల డ్రగ్స్‌కు స్పాట్‌... 

ఎన్‌సీబీ వివిధ దేశాల్లో తయారు చేయిస్తున్న స్పాట్‌ డ్రగ్‌ టెస్ట్‌ కిట్స్‌ ద్వారా ఆరు రకాల డ్రగ్స్‌ను ఇట్టే గుర్తించవచ్చని అధికారులు తెలిపారు. విదేశాల్లో చిన్న, చిన్న కిట్స్‌ ద్వారా 99 శాతం పక్కా ధ్రువీకరణతో డ్రగ్స్‌ కేసులను ఛేదిస్తున్నారని, అక్కడి టెక్నాలజీ సాయంతో రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణకు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఓ సీనియర్‌ ఐపీఎస్‌ ‘సాక్షి’కి తెలిపారు. గంజాయి, కొకైన్, హెరాయిన్, సెకోట్రోఫిక్‌ డ్రగ్స్, ఎండీఎంఏ తదితర మత్తు పదార్థాలను స్పాట్‌ డ్రగ్‌ టెస్ట్‌ కిట్స్‌ ద్వారా గుర్తించవచ్చన్నారు.



ప్రత్యేకమైన బ్రీత్‌ అనలైజర్‌ రూపంలో ఉండే పరికరాలతో డ్రగ్స్‌ వాడిన వారిని గుర్తించి కౌన్సెలింగ్‌ సెంటర్లకు పంపించేందుకు ఏర్పాట్లు చేసే ఆలోచన ఉందని, ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింద న్నారు. ప్రస్తుతం విదేశాల్లో అనుమానాస్పద వ్యక్తుల యూరిన్, బ్లడ్‌ శాంపిల్స్‌ను సేకరించి 6 నిమిషాల్లో ఈ టెస్ట్‌ పూర్తి చేస్తున్నట్లు ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ గుర్తింపు పొందిన సంస్థలు తెలిపాయి. రూ. 120 నుంచి రూ. 5 వేల వరకు కిట్స్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నట్టు సంస్థలు చెబుతున్నాయి.

 

డ్రగ్స్‌ తీవ్రతనూ గుర్తించొచ్చు... 

డ్రగ్స్‌ తీసుకున్న వారితోపాటు పెడ్లర్ల వద్ద నుంచి స్వాధీనం చేసుకునే మాదక ద్రవ్యాల రకం, మత్తు తీవ్రతను కూడా స్పాట్‌ డ్రగ్‌ టెస్ట్‌ కిట్స్‌ ద్వారా తేల్చవచ్చని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ఒక డ్రగ్‌ పెడ్లర్‌ను అరెస్టు చేసిన సందర్భంలో ఆ డ్రగ్‌ ఎలాంటిది? దాని తీవ్రత ఎంత ఉంటుంది? ఎలాంటి కారకాలు అందులో కలిశాయన్న దానిపైనా పక్కగా తేల్చేందుకు ఎన్‌సీబీ రూపొందిస్తున్న కెమికల్‌ కిట్స్‌ ద్వారా గుర్తించవచ్చు. ఏ1, ఏ2, ఏ3, బీ1, బీ2, బీ3, సీ1, సీ2, సీ3 కెమికల్‌ టెస్టింగ్‌ ద్వారా ఏ డ్రగ్‌ అన్నది తేల్చవచ్చు. సంబంధిత డ్రగ్‌పై రసాయన చుక్క వేయగానే అది మారే రంగును బట్టి అది ఏ రకమైన మాదకద్రవ్యమో తెలుసుకోవడంతోపాటు దాని తీవ్రతను విశ్లేషించవచ్చని అధికారులు తెలిపారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top