ప్రత్యేక హోదా - ప్రయోజనాలు

ప్రత్యేక హోదా - ప్రయోజనాలు - Sakshi


రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అనే కాన్సెప్ట్‌  1969లో మొదలైంది.  ప్రత్యేక హోదాలకు ఇక చెల్లుచీటి చెప్పాలని ఇప్పుడు సిఫార్సు చేసిన ఆర్థిక సంఘమే గతంలో ఈ విధానాన్ని మొదలుపెట్టింది. వెనుకబడిన రాష్ట్టాలకు కేంద్రం నుంచి ప్రత్యేక సాయం, పన్ను మినహాయింపులు కల్పించేందుకు  స్పెషల్‌ స్టేటస్‌ కల్పించాలని ఐదో ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. తొలుత  అస్సాం,  నాగాలాండ్‌, జమ్మూ కశ్మీర్‌  రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు.  ఆ తర్వాతి కాలంలో అరుణాచల్‌ ప్రదేశ్‌,  హిమాచల్‌ ప్రదేశ్‌,  మణిపూర్‌, మేఘాలయ,  మిజోరం, సిక్కిం,  త్రిపుర, ఉత్తరాఖండ్‌ చేర్చారు.



ప్రత్యేక హోదాకు ప్రాతిపదికలు

రకరకాల అంశాల్ని ప్రాతిపదకగా తీసుకొని ప్రత్యేక హోదా కల్పిస్తారు.  సంబంధిత రాష్ట్రంలో తగిన స్థాయిలో వనరులు లేకపోవడం, ఉన్న వనరుల్ని అభివృద్ధికి సమీకరించలేకపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.  ప్రత్యేక హోదా పొందాలంటే  ఆ రాష్ట్రాలకు మరికొన్ని లక్షణాలు కూడా ఉండాలి.  కొండ ప్రాంతాలు, క్లిషతరమైన భూభాగాలు, జనసాంద్రత తక్కువుండటం, లేదా  గణనీయమైన సంఖ్యలో గిరిజనులు ఉండటం.  పొరుగు దేశాలతో  వ్యూహాత్మక  సరిహద్దు కలిగి ఉండటం, ఆర్థికంగా, మౌలిక వసతుల పరంగా  వెనుకబడి ఉండటం. రాష్ట్ర ఆర్థిక వనరులు తగిన స్థాయిలో లేకపోవడం, ఈ ఐదు అంశాల ప్రాతిపదికగా  ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తారు.



నిర్ణయాధికారం

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిర్ణయించే అధికారం నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ది. ప్రధాని అధ్యక్షతన ఉండే ఈ మండలిలో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రణాళిక సంఘం సభ్యులు- సభ్యులుగా ఉంటారు. కేంద్రం నుంచి నిధుల బదలాయింపుతో ముడిపడిన వ్యవహారం కాబట్టి  ఇందులో ప్రణాళిక సంఘం,  ఆర్థిక సంఘం జోక్యం కూడా ఉంటుంది.  



నిధుల కేటాయింపు

కేంద్ర నిధులను ప్రణాళిక సంఘం రాష్ట్రాలకు కేటాయిస్తుంది.  ఇందులో నార్మల్‌ సెంట్రల్‌ అసిస్టెంట్‌ అంటే  కేంద్ర సాధారణ సాయం,  అడిషనల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ అంటే   కేంద్ర అదనపు సాయం, స్పెషల్‌ సెంట్రల్‌ అసిస్టెన్స్‌ అంటే ప్రత్యేక కేంద్ర సాయమనే అంశాలుంటాయి. రాష్ట్రాలకు  కేంద్రం అందించే సాధారణ ఆర్థిక సాయాన్ని ప్రణాళిక సంఘం రెండుగా విభజిస్తుంది.  ప్రత్యేక హోదా రాష్ట్రాలకు అధిక సాయమందించేందుకు వీలుగా  మొత్తం సాయంలో  30 శాతాన్ని స్పెషల్‌ స్టేటస్‌ పొందిన రాష్ట్రాలకు కేటాయిస్తుంది. మిగిలిన 70 శాతాన్ని  మిగిలిన  రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది.



గాడ్గిల్‌- ముఖర్జీ ఫార్మూలా

ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు  గాడ్గిల్‌-ముఖర్జీ ఫార్మూలాను అనుసరించి  కేంద్ర సాయం కేటాయిస్తారు. 2వేల సంవత్సరంలో ఈ ఫార్మూలాను చివరిసారి సవరించారు. 1969లో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేసిన డాక్టర్‌ VR గాడ్గిల్‌  తొలిసారి కేటాయింపుల ఫార్మూలా రూపొందించారు.  1990లో  ఆ ఫార్మూలాను సవరించారు.  అప్పుడు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉన్నారు. ఇద్దరి పేరు వచ్చేలా కేటాయింపులకు  గాడ్గిల్‌- ముఖర్జీ ఫార్మూలా అని పేరు పెట్టారు. రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఫార్మూలా రూపొందించారు. ప్రతీ అంశానికి ఇంతని వెయిటేజ్‌ ఇచ్చారు. జనాభాకు 60 శాతం,  తలసరి ఆదాయానికి 25 శాతం,  ఆర్థిక నిర్వహణకు 7.5 శాతం,  ప్రత్యేక సమస్యలకు 7.5 శాతంగా నిర్ణయించి  కేటాయింపులు జరుపుతారు.



ప్రణాళిక సంఘం పాత్ర

కొండ ప్రాంతాలు, గిరిజన ఉప ప్రణాళిక,  సరిహద్దు ప్రాంతాలను పరిగణనలోకి ఆ ప్రాతిపదికన   ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ఉంటాయి.  ఎక్సైజ్‌, కస్టమ్స్‌ సుంకాల్లో రాయితీ కూడా ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు ఉంటుంది. ఇది మొత్తమనేది కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రత్యేక పథకాల అమలుకు  ప్రణాళిక సంఘం చేసే కేటాయింపులు  సరిపోతాయి.  అతి కీలకమైన  కేంద్ర- రాష్ట్ర నిధుల బదిలీని ఆర్థిక సంఘం చూస్తుంది.



రాష్ట్రాల నుంచి వచ్చిన పన్ను వసూళ్ల ఆధారంగా  ఆర్థిక సంఘం  కేటాయింపుల్ని ఖరారు చేస్తుంది.  ప్రస్తుత ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో  32.5 శాతాన్ని రాష్ట్రాలకు కేటాయించాలని సిఫార్సు చేసింది. కేంద్ర నిధుల కేటాయింపే కాకుండా ప్రణాళికేతర గ్రాంట్లు, రాష్ట్రాలకు మంజూరు చేయాల్సిన అప్పుల్ని నిర్థారించే బాధ్యత కూడా ఆర్థిక సంఘానిదే.  విపత్తుల నివారణ,  రహదారుల నిర్వహణ, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకొని గ్రాంట్లు మంజూరు చేస్తారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలనే తేడాను ఆర్థిక సంఘం కేటాయింపుల్లో ఉండదు.  



ప్రత్యేక హోదాతో దక్కే ప్రయోజనాలు

గాడ్గిల్‌-ముఖర్జీ ఫార్మూలా ప్రకారం ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు కేంద్ర సాయంలో ప్రత్యేక వెసులుబాటు, పన్ను రాయితీలు  దండిగా లభిస్తాయి.  ఎక్సైజ్‌  సుంకంలో  మినహాయింపులు  లభిస్తాయి కాబట్టి  పెద్ద సంఖ్యలో  పరిశ్రమల స్థాపన  జరిగే అవకాశముంటుంది.  దీంతో  ఆర్థికంగా ఎదిగే వెసులుబాటు కలుగుతుంది. ప్రత్యేక హోదా  పొందిన రాష్ట్రాలకు  కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు వస్తాయి కాబట్టి  బడ్జెట్‌పరంగా పెద్దగా ఆంక్షలేమి ఉండవు. రుణ మార్పిడి, రుణ మాఫీ పథకాలు వర్తింపజేసుకోవడం ద్వారా  ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకు   అప్పులపై వడ్డీ తగ్గించుకునే వెసులుబాటు దొరుకుతుంది.



12వ ఆర్థిక సంఘం సిఫార్సులు

46 ఏళ్ల క్రితం  ప్రత్యేక హోదా కల్పించాలని ఆర్థిక సంఘం ప్రతిపాదిస్తే... ఇప్పుడు 12వ ఆర్థిక సంఘం  ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా స్పెషల్‌ స్టేటస్‌కు మంగళం పాడాలని సిఫార్సు చేసింది. కేంద్రం కేవలం గ్రాంట్లు మాత్రమే మంజూరు చేయాలని,  రాష్ట్రాలకు తమకు కావాల్సిన రుణాలను స్వయంగా సమకూర్చుకోవాలని సూచించింది.  ఈ ప్రాతిపదిక ఆధారంగా  ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలకిస్తున్న 90 శాతం గ్రాంట్లు, 10 శాత రుణాన్ని ఇకపై కేంద్ర ప్రాయోజిత పథకాలకు పరిమితం చేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది.



ప్రస్తుత పరిస్థితి

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్ రాజ్యసభలో ప్రకటన చేసినప్పుడు  ఆర్థిక సంఘం సిఫార్సులు రాలేదు.  ఈ లోపు ప్రభుత్వాలు మారిపోయాయి.  ఆర్థిక సంఘం తాజా సిఫార్సులు వచ్చాయి.  ఇప్పుడు ఆ సిఫార్సులను సాకుగా చూపి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు  కేంద్రం నిరాకరిస్తోంది.  వాస్తవానికి  ఆ సిఫార్సుల నుంచి మినహాయింపు తీసుకోవడానికి కేంద్రానికి వెసులుబాటు ఉంది. పునర్విభజన బిల్లుపై చర్చ సందర్భంగా నాడు ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని డిమాండ్‌ చేసిన బీజేపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాకా ఆర్థిక సంఘమనే బూచీని చూపి  నాటి ప్రభుత్వమిచ్చిన హామీకి మోకాలడ్డుతోంది.



-ఆర్‌.పరమేశ్వర్‌

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top