ఇక కాస్కోండి!

ఇక కాస్కోండి! - Sakshi


తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలపై  {పత్యేక దృష్టి

కఠిన చర్యలకు ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారుల నిర్ణయం

ఈనెల ఆఖరి వారం నుంచి పూర్తిస్థాయిలో అమలు

విలేకరులకు వెల్లడించిన రెండు విభాగాల అధిపతులు


 

సిటీబ్యూరో: రహదారి భద్రత నిబంధనలు తెలిసినా బేఖాతర్ చేస్తూ దూసుకుపోవడం... ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే నో, ఈ-చలాన్ వస్తేనో ఆ మొత్తం చెల్లించడం... ఆపై షరా మామూ లే అన్నట్లు వ్యవహరించడం... ఈ విధంగా రెచ్చిపోతూ రోడ్డు ప్రమాదాలకు కారణమౌతున్న ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, ఆర్టీఏ అధికారు లు నిర్ణయించారు. ఇప్పటికే అమలులో ఉన్న చర్యలతో పాటు ఈ నెల ఆఖరి వారం నుంచి మరింత కఠిన చర్యలు తీసుకోనున్నారు. నగర ట్రాఫిక్ చీఫ్ జితేందర్, ఆర్టీఏ కమిషనర్ సందీప్ సుల్తానియా సంయుక్తంగా శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను స్పష్టం చేశారు.



‘ఓనర్ల’ పైనా చార్జ్‌షీట్స్...

అసలు డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా, వాహన సామర్ధ్యానికి సరిపడిన లెసైన్స్‌లు లేకుండా రోడ్లపైకి వచ్చే వాళ్లు సిటీలో ఎందరో ఉంటున్నారు. ఇలాంటి వారిని పట్టుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించి వదిలి పెడుతున్నారు. ఇకపై ఈ తరహాలో వాహనాలు నడుపుతూ చిక్కిన వారికి జరిమానాతో పాటు వీరికి వాహనం ఇచ్చిన యజమాని పైనా కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయనున్నారు. కోర్టులో నేరం నిరూపితమైతే ఊచలు లెక్కపెట్టాల్సిందే.



‘ఐదింటికి’ లెసైన్స్ సస్పెన్షన్..

ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, ఓవల్ లోడ్, డ్రంకన్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధించి ఊరుకోరు. ఆర్టీఏ అధికారుల ద్వారా వారి డ్రైవింగ్ లెసైన్స్‌ను నిర్ణీత కాలం సస్పెండ్ చేయిస్తారు. సస్పెండైన లెసైన్స్‌తో డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. ఈ నేరానికి గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

 

పక్కాగా పొల్యూషన్ ‘చెక్’...

నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడానికి కాలుష్య తనిఖీ ( పొల్యూషన్ చెక్)లను కఠినతరం చేయనున్నారు. ప్రస్తుతం ఈ కాలుష్య తనిఖీ యంత్రాలు రెండు సిలిండర్ల పరిజ్ఞానంతో పని చేస్తున్నాయి. దీన్ని నాలుగు సిలిండర్ల పరిజ్ఞానానికి మార్చుకోవడం, డేటాను ఆన్‌లైన్ చేయడం కచ్చితం చేస్తున్నారు. ప్రస్తుతం టెండర్లు, యూని యన్లతో చర్చల దశలో ఉన్న ఈ విధానాన్ని త్వరలో అమలు చేస్తారు. ఆపై ప్రతి వాహనమూ కాలుష్య పరీక్షల ధ్రువపత్రం కలిగి ఉండాలన్నది కచ్చితం చేయనున్నారు.

 

ప్రత్యామ్నాయ చిరునామాకు ‘సైట్’...

 సిటీలో నడుస్తున్న అనేక వాహనాలు వాటి యజ మానుల పేర్లతో, ప్రస్తుత చిరునామాలతో ఉండట్లేదు. దీనివల్ల ఉల్లంఘనలకు సంబంధించిన ఈ- చలాన్ల జారీ సాధ్యం కాకపోవడంతో పాటు అత్యవసర సమయాల్లో యజమానుల్ని, వారి కుటుంబీకుల్ని గుర్తించడం కష్టసాధ్యంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా ఆర్టీఏ వెబ్‌సైట్‌లో (్టట్చటఞౌట్ట.్ట్ఛ్చజ్చ్చ.జౌఠి.జీ) ‘ఆల్ట్రనేట్ అడ్ర స్’ అనే లింకు చేర్చారు. ఈ తరహా వాహనచోదకులు ఇందులోకి వెళ్లి ప్రత్యామ్నాయ చిరునామా పొందుపర్చాలి.

 

టూవీలర్‌పై ‘ఇద్దరికీ’ హెల్మెట్ మస్ట్...

 ద్విచక్ర వాహన ప్రమాదాల్లో వాహనాన్ని నడుపుతున్న వారి కంటే వెనుక కూర్చున్న వారే ఎక్కువ మంది చనిపోతున్నట్లు అధ్యయనాలు చెప్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు వాహనాన్ని నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వాళ్లూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. గతనెల్లో హెల్మెట్ ధరించని 50 వేల మందిపై కేసులు నమోదు చేశామని, వీటిలో వెనుక కూర్చున్న వారు పెట్టుకోని కేసులూ ఉన్నాయన్నారు.  

 

రిపీటెడ్ వైలేటర్స్ పైనే

రోడ్డు ప్రమాదాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సాధికారిక కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకున్నాం. లెసైన్స్ రద్దు, చార్జ్‌షీట్స్ అనేవి ఒకటి కంటే ఎక్కువసార్లు చిక్కిన రిపీటెడ్ వైలేటర్స్‌కు మాత్రమే అమలు చేస్తాం. ప్రస్తుతం అన్నీ ఆన్‌లైన్ చేయడంతో రిపీటెడ్ వైలేటర్స్, సస్పెండైన లెసైన్స్ వివరాలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు తమ చేతిలోని పీడీఏ మిషన్ల సాయంతో పరిశీలించవచ్చు. ‘ఓవర్ స్పీడింగ్’ నిబంధనను అధికారికంగా వేగాన్ని నిర్దేశించి, సైనే జ్ బోర్డులు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే అమలు చేస్తాం.

 - జితేందర్, ట్రాఫిక్ చీఫ్

 

నిమిషానికో రోడ్డు ప్రమాదం

ఏటా దేశంలో ప్రతి నిమిషానికీ ఓ రోడ్డు ప్రమాదం జరుగుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. వీటిలో అత్యధికం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నవే. నిబంధనలు, భద్రతా నియమాలు తెలిసి కూడా పట్టించుకోకపోవడమే దీనికి కారణం. ఆధునిక పరి జ్ఞానం జోడిస్తూ డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ విధానాన్నీ మార్చనున్నాం. నిబంధనల అమలుతో పాటు మౌళిక సదుపాయాల అభివృద్ధి, ట్రామా సెంటర్ల ఏర్పాటు, బ్లాక్‌స్పాట్స్‌కు మరమ్మతులు వంటి చర్యల్నీ ప్రభుత్వం తీసుకుటోంది.

 - సుల్తానియా, ఆర్టీఏ కమిషనర్

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top