వ్యవసాయ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష

వ్యవసాయ కోర్సులకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష - Sakshi


♦ ఎంసెట్ నుంచి తప్పుకోవాలని వ్యవసాయ వర్సిటీ యోచన

♦ వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక పరీక్షకు వెళ్లాలని సమాలోచనలు

♦ మెడికల్ ప్రవేశాలు నీట్ పరిధిలోకి వెళ్లనున్నందున ఈ నిర్ణయం

 

 సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘నీట్’ ప్రవేశ పరీక్ష ద్వారానే మెడికల్, డెంటల్ సీట్లు భర్తీ చేయాలన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశు వైద్య సీట్లకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించాలని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యోచిస్తోంది. ఇంటర్‌లో ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్‌లో సీటు కోసం, బైపీసీ విద్యార్థులు మెడికల్, డెంటల్, ఆయుష్, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ రాస్తున్న విషయం తెలిసిందే. ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ఆయా సీట్లను కౌన్సెలింగ్ ద్వారా కేటాయిస్తున్నారు.



చాలామంది విద్యార్థులు మెడికల్ సీటు రాకుంటే డెంటల్, ఆయుష్ కోర్సుల్లో వెళ్తుంటారు. వాటిల్లోనూ సీటు రాకుంటే ర్యాంకు ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య కోర్సుల్లో చేరుతుంటారు. అయితే మెడికల్, డెంటల్ సీట్లను నీట్ ర్యాంకుల ఆధారంగా కేటాయిస్తే, ఎంసెట్‌లో బైపీసీ విద్యార్థులు కేవలం వ్యవసాయ అనుబంధ కోర్సులకే ప్రవేశపరీక్ష రాయాల్సి ఉంటుంది. మెడికల్, డెంటల్ కోర్సులే లేనప్పుడు ఇక ఎంసెట్‌తో తమకు సంబంధం లేదనేది వ్యవసాయ వర్సిటీ యోచిస్తోంది. నీట్ ద్వారా మెడికల్ సీట్లు భర్తీ చేస్తే ఎంసెట్ నుంచి బయటకు రావాలని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఉద్దేశం. ఎంసెట్‌తో సంబంధం లేకుండా రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య సీట్లకు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్ష నిర్వహించి కౌన్సెలింగ్ ద్వారా సీట్లను భర్తీ చేస్తే ఎలాగుంటుందన్న చర్చ జరుగుతోంది. దీనిపై కసరత్తు చేస్తున్నారు.



 వ్యవసాయ, అనుబంధ విభాగాల్లో 1,190 సీట్లు..

 తెలంగాణలో 970 వ్యవసాయ సీట్లు, 120 పశువైద్య సీట్లు, 100 ఉద్యాన సీట్లున్నాయి. వాటిల్లో ప్రవేశాలు ఎంసెట్ ద్వారా జరుగుతుంటాయి. ఎంసెట్‌లో మెడికల్ సీట్లు రాని చాలా మంది విద్యార్థులు ఈ కోర్సులవైపు మొగ్గుచూపుతుంటారు. ఈ కోర్సులు చదివితే ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉండటంతో వీటికి డిమాండ్ ఉంది. ఉదాహరణకు ప్రస్తుతం వెటర్నరీలో 300 వరకు ప్రభుత్వ ఉద్యోగాలుంటే అర్హులైన వెటర్నరీ విద్యార్థులు కేవలం 175 మంది ఉన్నారు. అంటే వీరందరికీ ఉద్యోగం గ్యారంటీగా వస్తుందన్నమాట. అలాగే మిగిలిన వ్యవసాయ కోర్సులదీ అదే పరిస్థితి. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ కాలేజీలు లేకపోవడంతో చదివిన వారందరికీ దాదాపు ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు అధికం. ఈ నేపథ్యంలో నీట్‌ను అవకాశంగా తీసుకుని ఎంసెట్ నుంచి తప్పుకోవాలని ప్రత్యేక ప్రవేశ పరీక్షకు వెళ్లాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం యోచిస్తోంది. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక పరీక్ష నిర్వహించే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకాధికారి ప్రవీణ్‌రావు చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top