నవరంగ్ సిటీ

నవరంగ్ సిటీ


గాండ్రించే బొబ్బిలి పులికి గాయాలెన్నో.. ఉదయించిన సూర్యుడిని మింగిన గ్రహణాలెన్నో.. అనుభవాల పునాదులపై పదిలంగా నిర్మించుకున్న జీవితంలో.. ఎన్నో గురుతులు, మరెన్నో జ్ఞాపకాలు. నగరంతో ఆయనకున్న అనుబంధం ఓ కదంబం. దర ్శకుడిగా జగద్విఖ్యాతి గాంచినా.. నటుడిగా వహ్వా అనిపించినా.. పత్రికాధిపతిగా వెలిగినా.. రాజకీయనేతగా రాణించినా.. గెలుపోటములపై స్వారీ చేసినా.. అన్నింటి నేపథ్యం ముడిపడి ఉన్నది ఈ సిటీతోనే అంటారు దర్శకరత్న దాసరి. భాగ్యనగరంతో అల్లుకున్న జ్ఞాపకాలను సిటీప్లస్‌తో పంచుకున్నారు.

 

నా ప్రతి అడుగులోనూ జయాపజయాలున్నాయి. ప్రతి విజయం వెనుక ఓడిపోయిన క్షణాలున్నాయి. చిన్నతనం నుంచి నాతో దోస్తీ చేసిన కష్టాలే నాలో తెగింపు పెంచాయి. నా జయాపజయాలన్నిటికీ హైదరాబాద్ ప్రత్యక్ష సాక్షి. ఈ నగరంతో నాకున్న అనుబంధం మరెవరికీ ఉండదేమో. పొట్టచేత పట్టుకుని ఇక్కడికి వచ్చాను. 1960లో హైదరాబాద్‌లో అడుగుపెట్టిన నాకు ఇక్కడ అణువణువు సుపరిచితమైనదే. తొలిరోజుల్లో వీఎస్‌టీ దగ్గరుండే చార్మినార్ డిస్ట్రిబ్యూటర్స్‌లో పనిచేశాను. తర్వాత హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో అసెంబ్లీ సెక్షన్ ఇన్‌చార్జి దగ్గర పీఏగా ఉద్యోగం వచ్చింది.



బండరాయి నీడలో..



సిటీలో నాటక సమాజంలోని వారంతా నా ఫ్రెండ్సే. స్కాట్ అనే పేరుతో స్థాపించిన మా సంస్థ అన్ని పరిషత్ నాటకాల్లో పాల్గొనేది. రవీంద్రభారతిలో శనివారం, గాంధీభవన్‌లో ఆదివారం రెగ్యులర్‌గా నాటకాలు వేసేవాళ్లం. వీటిల్లో చాలా వరకూ నేను డెరైక్ట్ చేసినవే. సిటీలో రిహార్సల్స్‌కు అనువైన ప్లేస్ దొరికేది కాదు. వెదికి వెదికీ ఓ ప్రదేశాన్ని గుర్తించాం. ఇప్పుడున్న అన్నపూర్ణ స్టూడియో దగ్గర శ్లాబ్ వేసినట్టు ఓ పెద్ద బండరాయి ఉండేది. దాని నీడలో రిహార్సల్స్ చేయడం ఇప్పటికీ మరచిపోలేని అనుభవం. తర్వాత అక్కడే కట్టిన అన్నపూర్ణ స్టూడియోలో ఎన్నో సినిమాలు డెరైక్ట్ చేశాను.



అన్ని రూట్లూ తెలుసు..



నాకు మద్రాసులో అన్ని దారులు తెలియవేమోగాని.. హైదరాబాద్‌లో పాతబస్తీ సహా అన్ని రూట్లూ తెలుసు. ఈ సిటీ అంతా సైకిల్‌పై చక్కర్లు కొట్టాను. సిటీబస్సులో ప్రయాణించాను. అప్పట్లో సైకిల్‌కు  స్క్వేర్‌షేప్ లైట్లు ఉండేవి. కిరోసిన్‌తో వెలిగేవి. ల్యాంప్ లేకపోతే పోలీసులు కేసులు పెట్టేవాళ్లు. అబిడ్స్, నాంపల్లి, కోఠి అప్పట్లో పెద్ద సర్కిల్స్. అప్పట్లో నవాబు వస్తున్నారంటే సిటీలో హడావుడి అంతాఇంతా కాదు. ఆయన కంటే ముందు మిలటరీ పరేడ్ వెళ్లేది. గుర్రాలు.. సైనికులు.. వెంట ఉండేవాళ్లు. జనాలను రోడ్డు పక్కనే ఆపేసేవాళ్లు. ఆ సన్నివేశాలను నా స్నేహితులతో కలసి ఆసక్తిగా చూసేవాణ్ని.



అదీ అప్పటి లెక్క..



కాలంతో పాటు సిటీ పూర్తిగా మారిపోయింది. అప్పట్లో చిక్కడపల్లిలో సుధా హోటలే ఆఖరు. తర్వాత ముషీరాబాద్ జైలు వరకు అడ వి ఉండేది. జైలు తర్వాత మళ్లీ సికింద్రాబాద్ వరకు మొత్తం పచ్చదనమే. ఇటు కమల్ థియేటర్‌తో మలక్‌పేట ఎండ్ అయ్యేది. నవరంగ్ థియేటర్లో సినిమా చూడటం గొప్ప అనుభూతి. తర్వాత దాన్ని ఎయిర్ కూల్ చేశారు. ఇక తెలుగు సినిమాలకు దీపక్ మహల్, బసంత్ టాకీస్, ప్రభాత్, దుర్గాసాగర్  ఫేమస్. స్తంభాలతో ఉండే దుర్గాసాగర్ ఆహ్లాదంగా ఉండేది.  సినిమా 100 రోజులాడితే శతదినోత్సవం అనడం మాత్రమే జనాలకు తెలుసు. అప్పట్లో హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు థియేటర్లలో సినిమా రిలీజ్ అయ్యేది. రెండు చోట్ల సినిమా 25 రోజులాడితే.. సంయుక్త 50వ రోజు, రెండు థియేటర్లలో 50 రోజులాడితే.. సంయుక్త 100వ రోజు అనేవాళ్లు.



మెట్రోలో భోజనం.. కరాచీలో పాటలు



అబిడ్స్‌లో రెడ్డి హాస్టల్ పక్కన రిసాలా కుర్సీ జాయ్ అని ఒక అఖేలా మంజూరీ ఉండేది. ఇందులోని ఓ రూమ్‌లో ఐదుగురం బ్యాచిలర్స్ ఉండేవాళ్లం. అద్దె ఐదు రూపాయలు. ఐదారు పోర్షన్లకు కలిపి ఒకే టాయ్‌లెట్. ఉదయాన్నే దాని ముందు పెద్ద క్యూ ఉండేది. అబిడ్స్‌లోని మెట్రో హోటల్‌లో భోజనం చేసేవాణ్ని.  స్నేహితులతో కబుర్లు చెబుతూ రాత్రి 12 గంటల వరకు అక్కడే ఉండేవాణ్ని. ఆ పక్కనే ఉన్న కరాచీ హోటల్‌లో టీ రుచి అద్భుతం. ఆ టైంలో కొత్తగా గ్రామ్‌ఫోన్ రికార్డు వచ్చింది. డబ్బులేస్తే మనకు కావాల్సిన రికార్డు బయటకొచ్చి.. ప్లే చేసి వెనక్కు వెళ్లేది. ఆ పాటలు వినడం ఓ పిచ్చి. సెలవొస్తే మా నాటక బృందం పబ్లిక్ గార్డెన్స్‌లో వాలిపోయేది.



ఆ క్షణమే రిజైన్ చేశా



ఉద్యోగం చేస్తున్నా నాటకాలు మానలేదు. నా ప్రయత్నం ఫలించి ఓ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. షూటింగ్ మద్రాసులో. రెండు నెలలు సెలవు కావాలని మా అధికారిని అడిగాను. ఆయన ఎందుకని అడిగితే.. షూటింగ్ కోసం అని చెప్పాను. ఆయన పకాపకా నవ్వి.. ‘సినిమాలోనా... నువ్వా... ఎప్పుడన్నా అద్దంలో ముఖం చూసుకున్నావా?’ అని వెక్కిరించాడు. చాలా బాధేసింది. నేను హీరో వేషానికి కాదు.. ఓ మెయిన్ రోల్ కోసం వెళ్తున్నా.. అని వివరణ ఇవ్వాలనుకున్నా. కానీ చెప్పాలనిపించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి వె ళ్లమన్నాడు. అంతే ఆ క్షణమే రాజీనామా చేసి వెళ్లిపోయాను. తర్వాత నా సినీప్రయాణం మీకు తెలిసిందే!

 ..:: వనం దుర్గా ప్రసాద్

 

లవ్ ఎట్ సుల్తాన్ బజార్



ఒకసారి చెల్లెలికి గాజులు కొనడానికి సుల్తాన్ బజార్ వెళ్లాను. షాపు అతను సైజు అడిగాడు. నాకేమో తెలియదాయే. ఆ సమయంలోనే నా పక్కన ఓ అమ్మాయి కన్పించింది. వాళ్ల అమ్మ, చెల్లి ఆమె పక్కనే ఉన్నారు. ఒక్కసారి ఆమె చేతుల వైపు చూశాను. ఆ మరుక్షణంలోనే ‘అదిగో ఆ అమ్మాయి సైజు.’ అనేశాను. వాళ్లకు అర్థం కాలేదు. ‘ఏంటీ ఏమంటున్నారు’ అన్నారు. విషయం చెప్పాను.  ఆమే వచ్చి నా చెల్లెలికి గాజులు సెలెక్ట్ చేసింది. ఆమె పేరే పద్మ. తర్వాత అనుకోకుండా సినిమా హాల్‌లో కలిసింది. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాను.కొన్నాళ్లకు ఎగ్జిబిషన్‌లో తారసపడింది. తర్వాత మా మధ్య మాటలు పెరిగాయి.. మనసులు కలిశాయి. అమ్మాయి వాళ్లు న న్ను ఇష్టపడ్డారు.. మా పెద్దన్నయ్య తప్ప మా వాళ్లెవరూ పెళ్లికి ఒప్పుకోలేదు. ఎవరినీ లెక్కచేయకుండా పద్మను ముందు గుళ్లో పెళ్లి చేసుకున్నా. తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. పద్మ నా నుంచి దూరమవ్వడం తట్టుకోలేకపోయాను. ఇంటికే పరిమితమయ్యాను. రానురాను ఆరోగ్యం దెబ్బతింటోందని భావించడంతో.. ‘ఎర్రబస్సు’ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాను.షూటింగ్ మొదలైన తర్వాత మళ్లీ నాలో ఎనర్జీ పెరిగింది. 20 ఏళ్లు వెనక్కు వెళ్లి పనిచేస్తున్నాను.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top