చిన్న రాష్ట్రాలతోనే సమాఖ్య వ్యవస్థ బలోపేతం


సాక్షి,సిటీబ్యూరో : ప్రాంతీయ అస్తిత్వ, స్వయంప్రతిపత్తి ఉద్యమాలు దేశంలో నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఒకప్పుడు విచ్ఛిన్నకరంగా భావించిన ప్రాంతీయ ఉద్యమాలే నేడు సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తున్నాయన్నారు. సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్, ఉస్మానియా వర్సిటీ రాజనీతిశాస్త్ర విభాగం సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ‘ప్రాంతీయ స్వయంప్రతిపత్తి-నూతన రాజకీయాలు’ అన్న అంశంపై రెండు రోజుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌతమ్ పింగ్లే  మాట్లాడుతూ, దేశంలో చిన్న రాష్ట్రాల కారణంగా ఫెడరల్  వ్యవస్థ  బలపడుతుందన్నారు.



బ్రిటీష్ పాలిత, స్వతంత్య్ర రాజ్యాలను విలీనం చేస్తూ  ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లోనే  స్వయంప్రతిపత్తి ఉద్యమాలు జరిగినట్లు గుర్తు చేశారు. నిజాం పాలనలో ఉన్న తెలంగాణ, బ్రిటీష్ పాలనలో ఉన్న ఆంధ్ర ప్రాంతాల విలీనం అలాంటిదేనన్నారు. నూతన రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా  ప్రభుత్వం కృషి చేయాలని, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ అభివృద్ధిలో  పౌరసమాజం  క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు.



ప్రజలు రాజకీయ పార్టీలపై నమ్మకాన్ని కోల్పోతున్నారని దాని ఫలితంగానే అనేక రాజకీయేతర  సంఘాలు  ముందుకు వస్తున్నాయన్నారు.  ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ, ఆంధ్ర కార్పొరేట్ శక్తుల లాబీయింగ్ మూలంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జాప్యం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో  పార్టీయేతర రాజకీయాలే క్రియాశీలక  పాత్ర పోషించాయన్నారు. ఇప్పటికీ ఆంధ్ర కార్పొరేట్ శక్తులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ  రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాలని  సూచించారు.  కార్యక్రమంలో ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ప్రొఫెసర్ ఎస్.ఎ పాలేకర్, ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top