ఏటీఎం గోల్‌మాల్ ఆర్సీఐ పనే

ఏటీఎం గోల్‌మాల్ ఆర్సీఐ పనే


 సాక్షి, హైదరాబాద్: ఏటీఎం కేంద్రాల్లో పెట్టాల్సిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు చెందిన రూ.9.98 కోట్ల గోల్‌మాల్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ అధికారులు శుక్రవారం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. సబ్-కాంట్రాక్ట్ ద్వారా ఈ వ్యవహారాలు నెరపుతున్న ఆర్సీఐ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ యాజమాన్యమే తొలుత దారి తప్పిందని, ఆపై దాని ఉద్యోగులు, కస్టోడియన్లు సైతం నగదు స్వాహా చేశారని డీసీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. దాదాపు ఏడాది పాటు ఈ వ్యవహారాలు సాగాయన్నారు.



 దేశ వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు చెందిన ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే, నిర్వహణ బాధ్యతల్ని ఎఫ్‌ఎస్‌ఎస్ సంస్థ కాంట్రాక్ట్ పద్ధతిన చేపడుతోంది. హైదరాబాద్‌కు సంబంధించి 116 ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే బాధ్యతల్ని ఆర్సీఐ క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 2013 నవంబర్ 15న సబ్-కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆర్సీఐకి చెందిన హైదరాబాద్ వాసులు సుదీప్‌కుమార్, పవన్‌కుమార్ గుప్తా డెరైక్టర్లు. జి.నాగరాజును ఆపరేషన్స్ విభాగం మేనేజర్‌గా, కె.లోకేశ్వర్‌రెడ్డి, కర్రె అజయ్‌కుమార్, జి.ప్రవీణ్‌కుమార్, ఆర్.పండు, నర్సింగ్‌రావుని కస్టోడియన్లుగా నియమించుకున్నారు.



 ఆర్థిక ఇబ్బందులతో దారి తప్పి...

 మహేంద్రాహిల్స్ త్రిమూర్తి కాలనీలోని ఆర్సీఐ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఏడాది క్రితం సుదీప్‌తో పాటు సంస్థకు చెందిన గిరిరాజు తమ ఉద్యోగుల్ని దారి తప్పించారు. ఏటీఎం కేంద్రాల్లో నింపాల్సిన నగదులో రూ.2.15 కోట్లను తెప్పించుకుని, తమ అవసరాలకు వాడుకున్నారు. దీన్ని అదనుగా చేసుకున్న ఆపరేషన్స్ మేనేజర్, కస్టోడియన్లు రూ.7.83 కోట్లను స్వాహా చేశారు. ఈ నగదుతో భారీ మొత్తంలో క్రికెట్ బెట్టింగ్స్ కట్టి పోగొట్టుకున్నారు.



 ఇన్సూరెన్స్ రెన్యువల్‌తో వెలుగులోకి...

 ఒప్పందం ప్రకారం గడువు (ఏప్రిల్ 28) ముగిసినా ఆర్సీఐ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకోకపోవడంతో ఎఫ్‌ఎస్‌ఎస్ ఆ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నగదు, బ్యాంకు స్టేట్‌మెంట్లు పరిశీలించిన ఎఫ్‌ఎస్‌ఎస్ రూ.9.98 కోట్లు గోల్‌మాల్ అయినట్లు గుర్తించింది. ఈ నెల మొదటి వారంలో నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు సీసీఎస్ అధికారులు విచారణ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఆర్సీఐ నిర్వాహకులు మేనేజర్ నాగరాజు ద్వారా తమ కస్టోడియన్లపై పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. అదనపు డీసీపీ విజయేందర్‌రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు శుక్రవారం నాగరాజు, లోకేశ్వర్, అజయ్, ప్రవీణ్, పండు, నర్సింగ్‌రావును అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.34 కోట్ల నగదు, రెండు కార్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సుదీప్ తదితరుల కోసం గాలిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top