మహోన్నతులను మనమే గుర్తించాలి

మహోన్నతులను మనమే గుర్తించాలి


హైకోర్టు చీఫ్ జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా  

శివానంద ఎమినెంట్ సిటిజన్స్ అవార్డుల ప్రదానం  

భారతరత్న సీఎన్‌ఆర్‌రావు, డాక్టర్ సత్యవ్రత్ శాస్త్రిలకు అందజేత


 

సాక్షి, హైదరాబాద్: మనదేశానికి చెందిన మహోన్నత వ్యక్తులను ముందు ప్రపంచం గుర్తించిన  తర్వాతే మనం గుర్తిస్తున్నామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా అన్నారు. ఇది చాలా విచారించదగ్గ విషయమని పేర్కొన్నారు. సనాతనధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ‘శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డు-2014’ ప్రదానోత్సవం సికింద్రాబాద్‌లోని తివోలి గార్డెన్‌లో వైభవంగా జరిగింది. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కె. బసవరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి చీఫ్ జస్టిస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.



భారతరత్న ప్రొఫెసర్ సీఎన్‌ఆర్  రావు, మహామహోపాధ్యాయ డాక్టర్ సత్యవ్రత్ శాస్త్రిలను శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డులతో చీఫ్ జస్టిస్ సత్కరించారు. చికాగో సభలో స్వామి వివేకానంద భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల గురించి అనర్గళంగా మాట్లాడిన తర్వాతే మనం గుర్తించామని చీఫ్ జస్టిస్ ఉదహరించారు. వివిధ రంగాల్లో ఎనలేని కృషి చేసి దేశానికి సేవలందించిన రత్నాల్లాంటి వ్యక్తులను మనమే మొదట గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సీఎన్‌ఆర్ రావు, సత్యవ్రత్‌లు దేశానికి ఎనలేని సేవచేశారని కొనియాడారు. వారిని సత్కరించే అవకాశం తనకు రావడం సంతోషదాయకమని చె ప్పారు. వారిని భారతదేశ యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.



సీఎన్‌ఆర్ రావు మాట్లాడుతూ... వచ్చే 15 ఏళ్లలో సైన్స్ రంగం లో ప్రపంచంలో మనదేశం అగ్రస్థానానికి చేరుకుంటుందన్నారు.ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో సైన్స్‌లో విశేష ప్రతిభగల పరిశోధకులు ఉన్నారని తెలిపారు. వారిని ప్రోత్సహించి వనరులు సమకూర్చితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. సరికొత్త ఆవిష్కరణలు వారితోనే సాధ్యమన్నారు. దీనికితోడు నాణ్యతగల బోధన లభించడం లేదని, దీన్ని మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని అన్నారు.



శక్తి వంచన లేకుండా దేశం కోసం వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని సత్కరించడాన్ని బాధ్యతగా తీసుకున్నామని మేనేజింగ్ ట్రస్టీ బసవరాజు అన్నారు. ఐఏఎస్ అధికారి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఎల్‌ఎస్‌ఆర్‌కే అవార్డులను కూడా సీఎన్‌ఆర్‌రావు, సత్యవ్రత్‌లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు జస్టిస్ వి. భాస్కరరావు, అప్పారావు, కె. రాజశేఖర్, ఎ. గోపాల్‌రెడ్డి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top