ఆ పని సింగపూర్ ప్రభుత్వం చేపట్టదు

ఆ పని సింగపూర్ ప్రభుత్వం చేపట్టదు - Sakshi


- రాజధాని అభివృద్ధి ప్రాజెక్టుపై సింగపూర్ మంత్రి స్పష్టీకరణ

- మా కంపెనీలు ఆ పని చేస్తాయి

- వాటిని పురమాయించడమే మా ప్రభుత్వ విధి

- పత్యేక దూతగా గోపీనాథ్ పిళ్లై నియామకం

- జూన్‌కల్లా తొలిదశ మాస్టర్‌ప్లాన్ సిద్ధం

- చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడిన షణ్ముగం


 

సాక్షి, హైదరాబాద్: రాజధాని అభివృద్ధి ప్రాజెక్టును తమ ప్రభుత్వం నేరుగా చేపట్టడం లేదని సింగపూర్ విదేశీ వ్యవహారాలు, న్యాయశాఖ మంత్రి కె.షణ్ముగం స్పష్టం చేశారు. కేవలం తమ దేశానికి చెందిన వివిధ కంపెనీలను, ఏజెన్సీలను పురమాయించడానికే పరిమతవుతుందని తెలిపారు. ప్రాజెక్టును చేపట్టడం తమ ప్రభుత్వం పని కాదని తేల్చిచెప్పారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, సింగపూర్ దూత గోపీనాథ్ పిళ్లైలతో కలిసి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమగ్ర ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల అభివృద్ధి చేసిన తర్వాత పలు సమస్యలు వస్తాయని, పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళితే సమస్యలు రావని చెప్పారు.

 

నిజంగా ప్రపంచస్థాయి నగరం నిర్మించాలంటే మాస్టర్ ప్లాన్ అవసరమని, ఈ ప్లాన్ రూపకల్పనలో తమ అనుభవం, నైపుణ్యం ఉపయోగపడతాయని పేర్కొన్నారు. తొలి దశ మాస్టర్‌ప్లాన్ జూన్ కల్లా సిద్ధం చేస్తామని చెప్పారు. తర్వాత.. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఏపీ, సింగపూర్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, రాజధాని ప్రాజెక్టుకు సంబంధించిన విషయాల్లో మెరుగైన సమన్వయం కోసం తమ రాయబారి గోపీనాథ్ పిళ్లైని ఏపీకి ప్రత్యేక దూతగా నియమిస్తున్నామని చెప్పారు. ‘ఏపీ, సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఏదైనా ఒప్పందం ఉందా? రాజధాని నగరాలను అభివృద్ధి చేసే సామర్థ్యం సింగపూర్‌కు ఉందా? అలాంటి అనుభవం సింగపూర్ ప్రభుత్వానికి ఉందా?’ అని సింగపూర్ మంత్రిని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమాధానం ఇచ్చారు. ‘సింగపూర్ ప్రపంచస్థాయి నగరం. మన తర్వాతే స్వాతంత్య్రం వచ్చినా.. అభివృద్ధిలో మనకంటే చాలా ముందున్నారు. పట్టణాభివృద్ధి రంగంలో వారికి అనుభవం, నైపుణ్యం ఉంది..’ అని చెప్పారు.

 

జర్నలిస్టులూ మా దేశానికి రండి: షణ్ముగం

‘జర్నలిస్టులూ మా దేశానికి వచ్చి చూడండి. ‘సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్’ను సందర్శించండి. అక్కడున్న ఆలోచనలను గమనించండి. సింగపూర్ ఆలోచనలన్నీ తప్పకుండా ఫలితాన్నిస్తాయని చెప్పడం లేదు. ప్రపంచంలోని ఉత్తమ ఆలోచనలను తీసుకొని సింగపూర్‌లో అమలు చేశాం. అదే మమ్మల్ని అభివృద్ధిలో ముందు నిలిపింది’ అని షణ్ముగం ఆహ్వానించారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకు 25 వేల ఎకరాలు సేకరించామని సీఎం చెప్పారు. వచ్చే రెండురోజుల్లో మరో 10-15 వేల ఎకరాలు సేకరిస్తామన్నారు. ప్రధాన నగర నిర్మాణానికి మొత్తం 50 వేల ఎకరాలు సేకరించనున్నామని చెప్పారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top