సమగ్ర దర్యాప్తు జరిపించాలి


వామపక్ష పార్టీల డిమాండ్



 సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో మాల్కాన్‌గిరీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పుల పేరిట 24 మందికి పైగా మావోయిస్టులను దారుణంగా కాల్చిచంపారని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ(చంద్రన్న) ఆరోపించాయి. ప్రజలు, ప్రజాతంత్ర, ప్రజాస్వామిక వాదులు, రాజకీయ పార్టీలు ఈ ఘటనను ఖండించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయా పార్టీలు వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశాయి. 500 మందికి పైగా సాయుధ పోలీసులు జరిపిన హంతక దాడిగా న్యూడెమెక్రసీ కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రన్న అభివర్ణించారు.



పక్కా సమాచారం ఆధారంగా ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్న దానివెనుకున్న పరమార్థమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కోవర్టు ఆధారంగా పోలీసులు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారా? అనే అనుమానాన్ని కూడా చంద్రన్న వ్యక్తం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు ఉన్నతాధికారులపై 302 సెక్షన్ కింద హత్యానేరం మోపి విచారించాలన్నారు. సామూహిక హత్యాకాండకు పాల్పడమని ఏ చట్టంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మావోయిస్టుల్ని పట్టుకునేందుకు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కాల్చిచంపడం దారుణమని సీపీఎం నాయకుడు పి.మధు మండిపడ్డారు. ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని సీపీఐ (ఎంల్) న్యూడెమోక్రసీ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి చంద్రం, రాష్ర్ట కార్యదర్శి సాధినేని వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top