వైఎస్సార్‌సీపీలోకి శిల్పా మోహన్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీలోకి శిల్పా మోహన్‌రెడ్డి - Sakshi

నంద్యాల మున్సిపల్‌ ౖచైర్‌పర్సన్‌ సహా పలువురు నేతల చేరిక

 

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ మంత్రి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌రెడ్డి తన వందలాది మంది అనుచరులతో కలిసి అట్టహాసంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీడీపీకి రాజీనామా చేసిన మోహన్‌రెడ్డి పెద్ద సంఖ్యలో అనుచరులు వెంట రాగా బుధవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. జగన్‌ ఆయనకు, ఇతర ముఖ్య నేతలకు కార్యకర్తలకు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నంద్యాల నుంచి తరలి వచ్చిన వాహనాలతో పార్టీ కేంద్ర కార్యాలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.



మోహన్‌రెడ్డితో పాటు నంద్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ దేశం సులోచన, మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు పి.పి.నాగిరెడ్డి, 25 మంది మున్సిపల్‌ కౌన్సిలర్లు, 21 మంది ఎంపీటీసీలు, 16 మంది సర్పంచ్‌లు, ఒక జడ్పీటీసీ, ఒక ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీలో చేరారు. మోహన్‌రెడ్డి చేరిక సందర్భంగా పార్టీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరామయ్య, యక్కలదేవి ఐజయ్య, వై.బాలనాగిరెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బివై రామయ్య, కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ ఖాన్, జిల్లా పార్టీనేతలు పోచింరెడ్డి మురళీధర్‌రెడ్డి, నాగరాజు యాదవ్, సురేంద్రరెడ్డి హాజరయ్యారు. మోహన్‌రెడ్డి తొలుత జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఈ సందర్భంగా ఉన్నారు.

 

శిల్పా చేరికతో పార్టీకి బలం: ఎంపీ బుట్టా రేణుక

మోహన్‌రెడ్డి చేరికతో కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూరినట్లు అయిందని ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. శిల్పాకు మంచి పేరుందని, నంద్యాలలోనే కాకుండా ఇతర చోట్ల కూడా ఆయన చేరిక ప్రభావం ఉంటుందని తెలిపారు. గత మూడేళ్లుగా జిల్లాలో వైఎస్సార్‌సీపీ ప్రజల్లో మరింతగా బలపడుతూ వస్తోందని, బలహీన పర్చాలనే ప్రయత్నాలు ఎవరు చేసినా ఫలించవని ఆమె చెప్పారు.

 

ఏపీసీసీ నేత పద్మజారెడ్డి చేరిక

ఏపీసీసీ నేత పద్మజారెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో కలిసి ఆమె బుధవారం ఉదయం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరా లన్న తన అభీష్టాన్ని వెల్లడించారు. జగన్‌ ఆమెను సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ కండువా కప్పి అభినందనలు తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన పద్మజ రాష్ట్ర విభజనకు ముం దు ఏపీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో సాగిస్తున్న అరాచక పాలనపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న రాజీలేని పోరాటంలో ఉడతాభక్తిగా తన వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీలో చేరినట్లు పద్మజారెడ్డి మీడియాకు వెల్లడించారు.

 

సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉంది: శిల్పా

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని, ఇకపై పార్టీ పటిష్టత కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో నంద్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ దేశం సులోచన, మార్క్‌ఫెడ్‌ ఉపాధ్యక్షుడు పి.పి.నాగిరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనకు రాజకీయ గురువు అని, ఆయన వల్లే తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా అయ్యానని వెల్లడించారు. తనకు వైఎస్‌ కుటుంబం పట్ల ఎప్పుడూ గౌరవాభిమానాలున్నాయని, కొన్ని కారణాల వల్ల గతంలో పార్టీలోకి రాలేకపోయినా 2019 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నానని చెప్పారు.



నంద్యాల ఉప ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీని వీడటానికి ప్రధానంగా నంద్యాలలో నెలకొన్న అంతర్గత విభేదాలే కారణమని చెప్పారు. జగన్‌ పోరాట పటిమ, సమర్థవంతమైన ఆయన నాయకత్వం కింద పని చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.  తానేమీ అధికారం కోసం ప్రతిపక్షంలోకి వెళ్లడం లేదన్నారు. నంద్యాల అసెంబ్లీ టికెట్‌ ఆశించి పార్టీలో చేరలేదని, జగన్‌ ఏది చెబితే ఆ పని చేస్తామని ఆయన తెలిపారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top