ఆస్తుల పంపిణీ అర్ధంతరం

ఆస్తుల పంపిణీ అర్ధంతరం


- షీలా బిడే కమిటీ ఉన్నట్టా.. లేనట్టా?

- ఆగస్టులో ముగిసిన కమిటీ గడువు

- గడువు పొడిగించని కేంద్ర ప్రభుత్వం

- కార్పొరేషన్లు, కంపెనీల విభజనకు పీటముడి


 

 సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ అర్ధంతరంగా ఆగిపోయింది. షీలా బిడే కమిటీ గడువు ముగియటంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు పంపిణీ పూర్తయిన సంస్థలకు సంబంధించిన నివేదికను సైతం ఈ కమిటీ సమర్పించకపోవటంతో రెండు రాష్ట్రాల్లోనూ గందరగోళం నెలకొంది. రాష్ట్ర విభజన అనంతరం తొమ్మిదో షెడ్యూలులో పొందుపరిచిన ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీకి కేంద్ర ప్రభుత్వం షీలా బిడే ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. గత ఏడాది ఆగస్టు నాటితో ఈ కమిటీ గడువు ముగిసింది.

 

 కమిటీ గడువు పొడిగింపుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆర్నెల్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తొమ్మిదో షెడ్యూలులో దాదాపు 90 కార్పొరేషన్లు, కంపెనీలు ఉన్నాయి. వీటిలో 59 సంస్థల విభజన పూర్తికాగా.. మిగతా 31 సంస్థల పంపిణీ ఇప్పటికీ పూర్తవలేదు. 2014 జూన్ 5న కేంద్రం ఈ కమిటీని నియమించింది. అప్పట్నుంచీ 14 నెలల వ్యవధిలో 52 సార్లు సమావేశమై పలు కంపెనీలు, కార్పొరేషన్ల విభజనపై నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా అంతర్గత ఆడిట్ పూర్తయిన సంస్థల విభజనకు ఈ కమిటీ మొగ్గు చూపింది. వివాదాస్పదంగా ఉన్న కంపెనీలు, కార్పొరేషన్లపై దాటవేత ధోరణి అనుసరించింది. కానీ.. కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు రెండు రాష్ట్రాలకు అందజేయకుండా పెండింగ్‌లో పెట్టింది.

 

 ఎందుకంత రహస్యం?

 ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగుల విభజన వ్యవహారాలు చూస్తున్న కమలనాథన్ కమిటీ ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరించింది. ఉద్యోగుల విభజనకు ప్రత్యేక వెబ్‌సైట్ నిర్వహించటంతో పాటు విభజన అనంతరం జాబితాలను ప్రచురించి ఎప్పటికప్పుడు ఉద్యోగులకు, ప్రభుత్వాలకు ప్రతి నిర్ణయం తెలియజెప్పే ఏర్పాట్లు చేసింది. కానీ.. షీలా బిడే కమిటీ ఇవేం చేయలేదు. తొమ్మిదో షెడ్యూలు సంస్థల ఆస్తులు అప్పుల పంపిణీ వ్యవహారాలు బయటకు తెలియకుండా ఉంచేందుకే ఈ కమిటీ ప్రాధాన్యమివ్వడం విమర్శలకు తావిచ్చినట్లయింది.

 

 అంతేకాదు తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి ఏపీ ఉద్యోగులను తొలగించటం రెండు రాష్ట్రాల మధ్య విభజన ప్రక్రియలో చిచ్చు రేపింది. దీంతో తొమ్మిదో షెడ్యూలులోని సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అదే సమయంలో కేంద్రానికి లేఖ రాశారు. అప్పట్నుంచీ తొమ్మిదో షెడ్యూలు సంస్థల ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన ఎక్కడికక్కడే నిలిచిపోయిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

 

 అన్నీ పెండింగ్‌లోనే..

 ఏపీఎస్‌ఆర్‌టీసీ ఆస్తులు, అప్పుల విభజనలోనూ చిక్కుముళ్లు ఇప్పటికీ వీడలేదు. ఇదే తరహాలో ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు తదితరాల విభజన ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విభజన వివాదాల పరిష్కారాల కమిటీ సమక్షంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అయినా సరే కమిటీ గడువు పొడిగింపు, కమిటీ నివేదికల విషయంలో కేంద్రం నుంచి స్పష్టత రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

whatsapp channel

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top