పెళ్లి సింగిల్... మనీ డబుల్

పెళ్లి సింగిల్... మనీ డబుల్ - Sakshi


 సాక్షి, సిటీబ్యూరో: షాదీ ముబారక్ పథకం అమలులో జరిగిన తప్పిదాన్ని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు సరిదిద్దుతున్నారు. రెండు విభాగాల సమన్వయలోపం కారణంగా ఒక్కో లబ్ధిదారునికి రెండుమార్లు డబ్బులు జమకావడం తెలిసిందే. ఈ తప్పిదంపై ఇటీవల ‘డబుల్ ముబారక్’ పేరిట సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై మైనార్టీ శాఖ అధికారులు స్పందించారు. హైదరాబాద్ నగరంలోని 142 మంది వధువుల బ్యాంక్ ఖాతాలో రెండుమార్లు డబ్బులు జమ అయిన ఘటనపై విచారించారు.


 


వీరి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి నిధుల చెల్లింపులు నిలిపివేశారు. బ్యాంకర్లకు లేఖ రాసి లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న సుమారు రూ.54 లక్షలను రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ఇక లబ్ధిదారులు ఇప్పటికే డ్రా చేసుకున్న రూ.17.42 లక్షలు రికవరీ చేసే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు కొందరు లబ్ధిదారులు మొండికేస్తుండగా, మరికొందరు తిరిగి చెల్లింపుల కోసం కొంత గడువు కోరుతున్నట్లు తెలుస్తోంది.




 తప్పిదం ఎవరిది?

 రెండుమార్లు డబ్బులు జమ చేసిన తప్పిదంపై చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం కింద దరఖాస్తు చేసుకున్న నగరానికి చెందిన 142 మంది లబ్ధిదారుల వివాహాలకు రూ.51 వేల చొప్పున ఆర్ధిక చేయూతకు మంజూరు ఇచ్చిన మైనార్టీ శాఖ అధికారులు ఈ- పాస్ ద్వారా మూడు బిల్లులతో కూడిన లబ్ధిదారుల జాబితాను  ట్రెజరీకి రెండు సార్లు సబ్‌మిట్ చేశారు. ట్రెజరీ అధికారులు కూడా ఆఫ్‌లైన్‌లో చేసిన చెల్లింపులను గుర్తించకుండా నగదు విడుదల చేయడం తో లబ్ధిదారుల ఖాతాలో రెండుసార్లు నగదు జమ అయింది. అయితే ఇరు శాఖల అధికారులు దీన్ని సాంకేతిక తప్పిదంగా పేర్కొంటున్నారు. సీజీజీ రూపొం దిం చిన సాఫ్ట్‌వేర్ అనుసంధానంలో కొంత వ్యత్యాసమే సాంకేతిక తప్పిదానికి కారణమైందని వ్యాఖ్యానిస్తున్నారు.

 

 పూర్తి స్థాయిలో రికవరీ చేస్తాం

 షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు రెండుసార్లు జమ అయిన మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తున్నాం. ఇప్పటికే బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి దాదాపు 72 శాతం రికవరీ చేశామని... లబ్ధిదారులు సహకరిస్తున్నారని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top