ఆబ్కారీ శాఖకు సేవాపన్ను దెబ్బ!

ఆబ్కారీ శాఖకు సేవాపన్ను దెబ్బ! - Sakshi


- రూ.492 కోట్లు కేంద్రం ఖాతాలోకి

జూన్ 1 నుంచి అమల్లోకొచ్చిన సర్వీస్ ట్యాక్స్ కొత్త నిబంధనలు

 

 సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఈనెల నుంచి అమలులోకి వచ్చిన సర్వీస్ ట్యాక్స్ కొత్త నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పెడుతున్నాయి. కేంద్రం 2015 నాటి బడ్జెట్‌లో సర్వీస్ ట్యాక్స్ పరిధిని పెంచి.. స్థాని క ప్రభుత్వాలు, సంస్థల ద్వారా సాగే అన్ని సేవలకు అన్వయించింది. ఈ నిబంధనలు 2016 జూన్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ మేరకు ఫీజులు చెల్లించి పొందే పలు సేవలపై 14 శాతం పన్నుతో పాటు 0.5 శాతం స్వచ్ఛభారత్ సెస్, 0.5 శాతం కృషి కల్యాణ్ సెస్‌లతో కలిపి 15 శాతం చెల్లించాలి. ఈ పరి ణామం ఆబ్కారీ శాఖపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఆబ్కారీ శాఖ 2016-17 అంచనాల ప్రకారం వివిధ రకాల ఫీజుల కింద రూ. 3,279 కోట్లు సమకూరనుండగా, ఈ మొత్తం పై సర్వీస్ ట్యాక్స్, సెస్సుల రూపంలో కేంద్రానికి రూ.492 కోట్లు జమచేయాల్సి ఉంటుంది.



 ఫీజులన్నీ పన్ను పరిధిలోకే...

 ఈనెల నుంచి అమలులోకి వచ్చిన సర్వీస్ ట్యాక్స్ కొత్త నిబంధనల మేరకు... సేవలు అందిస్తూ వసూలు చేసే ఫీజులన్నీ పన్ను పరిధిలోకే వస్తాయి. రాష్ట్రంలో నీటి పారుదల శాఖ, ఆర్‌అండ్‌బీ, మైన్స్, స్థానిక సంస్థలు తదితర శాఖల్లో సాగే కాంట్రాక్టు పనులకు చేసే చెల్లింపులు, వసూలు చేసే ఫీజులకు ‘రివర్స్ చార్జ్’  కింద సేవలు పొందేవారు కేంద్రానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో వసూలయ్యే ఫీజులన్నీ సేవల పరిధిలోకి రానున్నాయి. తద్వారా ఎక్సైజ్ శాఖకు 2016-17లో వ్యాట్ పోగా రూ.4,533 కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా వేశారు. ఇందులో పన్ను పరిధిలోకి రాని డ్యూటీ ఆఫ్ ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, ఇతర పన్నులు రూ. 1,254 కోట్లు పోగా,  రూ. 3,279 కోట్లకు 15 శాతం పన్ను కింద రూ. 492 కోట్లు కేంద్రానికి చెల్లించాలి.



 ఢిల్లీలో ప్రయత్నాలు..: జూన్ ఒకటో తేదీ నుంచి 15 శాతం సర్వీస్‌ట్యాక్స్ అమలులోకి రావడంతో ఉన్నతాధికారులు భారం తప్పించుకునే మార్గాలపై దృష్టిపెట్టారు. కొద్దిరోజుల కిందట రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, కమిషనర్ చంద్రవదన్, ఇతర అధికారులు ఢిల్లీకి వెళ్లి సెంట్రల్ ఎక్సైజ్ అధికారులతో చర్చలు జరిపారు. ఇ.వై. అనే ట్యాక్స్ కన్సల్టెన్సీ కంపెనీతో సమావేశమై సేవాపన్ను మినహాయింపునకు సలహాలు కోరారు. ఎక్సైజ్ శాఖలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజులను పన్ను రూపంలోకి తీసుకువస్తే సర్వీస్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉందని ఆ కంపెనీ చెప్పినట్లు సమాచారం.



 సేవా పన్ను పరిధిలోకి వచ్చే ఫీజులు..

 డిస్టిలరీ లెసైన్స్ ఫీజు, హోల్‌సేల్ లెసైన్స్ ఫీజు, రిటైల్ లెసైన్సు ఫీజు, ప్రివిలేజ్ ఫీజు, బార్లు, క్లబ్బుల లెసైన్సు ఫీజు, బ్రాండ్ రిజిస్ట్రేషన్, అప్రూవల్ ఫీజు.

 

 తెలంగాణ, ఏపీలకే అధిక భారం

 ముందస్తు ఆలోచనలు లేకుండా ప్రభుత్వ పెద్దలు, అధికారులు తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆబ్కారీ శాఖలే భారీ మొత్తంలో సేవా పన్ను చెల్లించాల్సి వస్తోంది. 2015 కేంద్ర బడ్జెట్‌లోనే సర్వీస్ ట్యాక్స్ నిబంధనలకు సవరణలు చేసి ఆమోదించగా, 2016 వరకు ఈ రెండు రాష్ట్రాల పెద్దలు పట్టించుకోలేదు. కానీ కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలు ఎక్సైజ్ శాఖలోని ఫీజులను అడిషనల్ డ్యూటీలు, పన్నుల రూపంలోకి మార్చాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో పాతపద్ధతిలోనే కొనసాగుతుండడంతో తెలంగాణ రూ. 492 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 519 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top