చూస్తున్నారా.. ఈ ‘చిత్రం’ .. !

చూస్తున్నారా.. ఈ ‘చిత్రం’ .. ! - Sakshi


సిటీబ్యూరో: నగరంలో రెండేళ్ల క్రితం నిర్వహించిన జీవవైవిద్య సదస్సు(కాప్-11) సందర్భంగా విదేశీ అతిథులను ఆకట్టుకునేందుకు ‘నగర సుందరీకరణ పేరిట’ జీహెచ్‌ంఎసీ అధికారులు దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేశారు. ఫ్లై ఓవర్ల దిగువ స్తంభాలకు  రంగులు, పక్క గోడలపై వర్ణచిత్రాలు తదితర పనుల పేరిట రూ.20 కోట్లు ఖర్చు చేశారు. నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచేందుకు అందరూ సహకరించాలని, గోడలపై వాల్‌పోస్టర్లు తదితరమైనవి అంటిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం చేశారు. దీనిని అధికార పక్షం నేతలే పాటించడంలేదు.



టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోచేరిన తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాతో సహా ఫ్లై ఓవర్ పొడవునా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అంతటితో ఆగకుండా ఎంతో వ్యయంతో రూపొందించిన కళాఖండాలను సైతం ఖాతరు చేయలేదు. వాటిని మూసివేస్తూ తలసానికి అభినందనలు తెలుపుతున్న పోస్టర్లను అంటిచేశారు. ఇదంతా ఒక ఎత్తయితే.. ‘ఈ క ళాఖండాలపై పోస్టర్లు అంటించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం ’అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నా, వాటి దిగువనే బేఖాతరుగా పోస్టర్లను నింపేశారు. గోడపై నోటీసులు, పోస్టర్లు అంటిస్తే చట్టపర చర్యలని మరోచోట ఉన్నా పట్టించుకోలేదు. మన సారే మంత్రి.. మనదే రాజ్యం.. పోస్టర్లపై సీఎం కూడా ఉన్నారు.. ఎవరేం చేస్తారు..? అనుకున్నారో ఏమో కానీ.. ఇలా నింపేశారు.



సాధారణ ప్రజలపై కొరడా ఝళిపించే జీహెచ్‌ఎంసీ అధికారులు దీనికేం సమాధానం చెబుతారు..? ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేసిన వారిని ఏమని ప్రశ్నిస్తారు..? ఈ మార్గం నుంచే నిత్యం సర్కారు ప్రముఖులు, అధికార గణాలు, ఇతరత్రా వీఐపీలు ఎందరెందరో వెళ్తున్నా.. ఎవరి దృష్టికీ రాకపోవడం.. వచ్చినా పట్టించుకోకపోవడం.. దేనికి సంకేతం..?      

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top