‘సీజన్’ దోపిడీ!


మార్కెట్ మాయాజాలం

సాక్షి, సిటీబ్యూరో : మార్కెట్లలో ‘సీజనల్’ దోపిడీ సాగుతోంది. అధికారులు, దళారులు కుమ్మక్కై అన్నదాతను నిలువునా ముంచుతున్నారు. నగరంలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు దిశా నిర్దేశం కొరవడింది. అడిగే నాథుడు లేకపోవడంతో అధికారులదే ఇష్టారాజ్యంగా చెలామణి అవుతోంది. ప్రధానంగా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ పర్సంటేజీలకు, పైరవీలకు  నిలయంగా మారింది.  ఇక్కడ దళారులు, కమీషన్ ఏజెంట్లు రైతులను నిలువునా దోచుకుంటున్నారు. 4 శాతం వసూలు చేయాల్సిన కమీషన్‌ను రెట్టింపు వసూలు చేస్తున్నా... అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ వారికి సహకరిస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.

 

బత్తాయి సీజన్ ప్రారంభం కావండంతో గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు నల్గొండ, ప్రకాశం, మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బత్తాయి సరఫరా అవుతోంది. మార్కెటింగ్ శాఖ నిబంధనల ప్రకారం... సరుకు అమ్మించి నందుకు  రెతు నుంచి 4 శాతం కమీషన్‌గా దళారులకు చెల్లించాలి.  కానీ ఇక్కడి దళారులు 8-10 శాతం మేర కమీషన్ వసూలు చేస్తూ  రైతుల కష్టాన్ని  దోచుకుంటున్నారు. ఒకవేళ రైతు అంత కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించకపోతే.. వేలం సందర్భంగా సరుకు నాణ్యంగా లేదనో...  గ్రేడింగ్ చేయాలనో... లేదా డ్యామేజ్ ఎక్కువగా ఉందని చెబుతూ వేలం వేయనీయకుండా దళారులు అడ్డుకుంటున్నారు.



అంతర్గతంగా సిండికేట్‌గా ఉండే వీరంతా అప్పటికప్పుడు రెండుగా గ్రూపులుగా చీలిపోయి వారిలో కొందరు తక్కువ ధరకు వేలం వేసి రైతులకు నష్టం వచ్చేలా చేస్తున్నారు.  గిట్టుబాటు ధర లేకపోతే రైతు సరుకును వెనక్కి తీసుకువేళ్లలే ని పరిస్థితి. ఒకటి రెండ్రోజులు  నిల్వ ఉంచితే మరింత నష్టపోయే ప్రమాదం ఉండటంతో దళారులు నిర్ణయించిన ధరకే తెగనమ్మి వెనుదిరుగుతున్నారు. దళారులను కాదని నేరుగా వచ్చిన రైతుల సరుకు అమ్ముడుపోని పరిస్థితి ఇప్పుడు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్లో  నెలకొంది.

 

దోపిడీ ఇలా:

పండ్ల మార్కెట్లో కమీషన్ ఏజెంట్లంతా సిండికేట్‌గా మారారు.  ‘చూట్’ (తరుగు), పచ్‌కడ్  పేరుతో ఒక టన్ను బత్తాయిలకు ఒక  క్వింటాల్ చొప్పున తీసివేస్తూ  రైతుకు కుచ్చుటోపీ పెడుతున్నారు. నిజానికి రైతు తెచ్చిన సరుకులో తరుగు (చూట్) తీయాలన్న నిబంధనేదీ లేదు. సరుకు నాణ్యతను బట్టి ధర నిర్ణయించి టన్నుల ప్రకారం కొనుగోలు చేయాలి. అయితే... గడ్డిఅన్నారం మార్కెట్లో ఇందుకు విరుద్ధంగా లాట్‌లు (కుప్పలు)పోసి విక్రయాలు సాగిస్తున్నారు.  వ్యాపారులు బత్తాయి కుప్పల దగ్గరికి  రాగానే కమీషన్ ఏజెట్లు వేలంపాట పాడుతూ ఓ ధరను ఖరారు చేస్తారు. అదే ఫైనల్ ధర అవుతోంది.



10 టన్నుల  బత్తాయిని తెచ్చిన రైతు నుంచి టన్నుకు ఒక క్వింటాల్ చొప్పన మొత్తం 10 టన్నులకు పది క్వింటాళ్లు అంటే... ఒక టన్ను మేర చూట్  పేరుతో తీసేస్తున్నారు. టన్ను ధర రూ.15 వేల ప్రకారం రైతుకు మొత్తం రూ.1.5 లక్షలు చెల్లించాలి. అయితే... ఇందులో తరుగుపేరుతో ఒక టన్ను తీసేస్తుండటంతో రైతు తనకు తెలియకుండానే రూ.15 వేలు నష్టపోతున్నాడు. కమీషన్‌గా 4 శాతం బదులు 8-10 శాతం వసూలు చేస్తుండటంతో రూ.12 నుంచి 15 వేలు అదనంగా రైతు కోల్పోతున్నాడు.



నిజానికి 10 టన్నుల బత్తాయికి కమీషన్ పోను రూ.1.44 లక్షలు సొమ్ము రావాల్సి ఉండగా.... కమీషన్ ఏజెంట్లు, దళారుల మాయాజాలం వల్ల రూ.1.30 లక్షలు మాత్రమే దక్కుతుండటం దళారుల దోపిడీకి అద్దం పడుతోంది. కాగా కొత్త ప్రభుత్వం 8 నెలలుగా పాలకవర్గాన్ని ఏర్పాటు చేయకపోవడంతో కమీషన్ వ్యాపారుల కనుసన్నల్లోనే అధికారుల పాలన సాగుతోంది.  పాలకవర్గం ఉన్నప్పుడు రైతులు  ఫిర్యాదు చేస్తే అంతో ఇంతో స్పందన ఉండేది.

 

ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటాం

పండ్ల మార్కెట్లో అక్రమాలపై సెలక్షన్‌గ్రేడ్ సెక్రటరీ జనార్దన్‌రెడ్డిని ‘సాక్షి’  వివరణ కోరగా ఇంతవరకు రైతులెవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. నిజానికి గడ్డిఅన్నారం మార్కెట్‌కు సరుకు తెస్తున్న వారంతా దళారులేనని..,  రైతులు 5 శాతం కూడా రావట్లేదన్నారు. దళారులే క్షేత్రస్థాయికి వెళ్లి  పంట కొనుగోలుచేసి నేరుగా సరుకు మార్కెట్‌కు తెస్తున్నారని, ఇలాంటి వారిని ఎలా కట్టడి చేయగలం అంటూ ఆయన నిస్సహాయతను వ్యక్తం చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top