ఏకాత్మక మానవతా ధర్మమే ధ్యేయం

ఏకాత్మక మానవతా ధర్మమే ధ్యేయం - Sakshi


ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 2 తీర్మానాలు

రెండోరోజు భేటీకి హాజరైన బీజేపీ చీఫ్ అమిత్ షా


ఘట్‌కేసర్: ఏకాత్మక మానవతా ధర్మ సాధన, కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తల రాజకీయ హత్యలను ఖండిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సోమవారం రెండు తీర్మానాలు చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని అన్నోజిగూడలో జరుగుతున్న మూడు రోజుల సమావేశాల్లో రెండోరోజు భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరయ్యారు. సమావేశంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన సుమారు 400 మంది ఆరెస్సెస్ ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశ వివరాలను ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచారక్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య, అఖిల భారతీయ ప్రచార సహప్రముఖ్, కేసరి మలయాళ వారపత్రిక ఎడిటర్ నందకుమార్‌జీ, కేరళ ప్రాంత సహ సంచాలక్ బల్‌రాంజీ విలేకరులకు వెల్లడించారు.



ఏకాత్మక మానవతా ధర్మంపై చేసిన తీర్మానం గురించి వారు మాట్లాడుతూ ప్రకృతి ప్రసాదించిన వనరులను కాపాడుకోకపోతే మానవ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమా దం ఉందన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం అవసరాలకు మించి వనరులను కొల్లగొడుతున్నారని, దీనివల్ల ప్రకృతి సమతౌల్యత లోపించి భూతాపం పెరుగుతోందన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోవడం హిందూ జీవన విధానంలో ఉందని, దాన్ని ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యా య ఏకాత్మక మానవతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించి 51 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దానికి ప్రాధాన్యత ఇస్తూ తీర్మానం చేశామన్నారు. ఏకాత్మక మానవ ధర్మ సాధనకు కృషి చేస్తామన్నారు.



మైనారిటీ ఓట్ల కోసమే హత్యలు...

కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తల హత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని నందకుమార్‌జీ చెప్పారు. ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకును కొల్లగొటెందుకు అక్కడి ప్రభుత్వాలు ఆరెస్సెస్ కార్యకర్తలపై దాడులను పట్టించుకోవట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ కార్యకర్తలపై భారీ స్థాయిలో దాడులు జరుగుతున్నా ప్రభుత్వాల జోక్యంతో అతితక్కువగా కేసు లు నమోదవుతున్నాయని, ఇప్పటివరకు కేవలం 55 కేసులు మాత్రమే నమోదు అయ్యాయన్నారు.



1962 నుంచి కేరళలో ఆరెస్సెస్ కార్యకర్తలపై సీపీఎం హత్యాకాండ కొనసాగుతుందన్నారు. సీపీఐ సైతం గతంలో దాడులు చేసిందన్నారు. కన్నూర్ జిల్లాలో తమ వారిపై ఎక్కువగా హత్యలు జరిగాయన్నారు. గతంలో ఆరెస్సెస్ కార్యకర్తలను హత్య చేసిన వ్యక్తే ప్రస్తుతం కేరళ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దాడులను ఆపేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రయత్నిస్తున్నామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top