తుప్పు వదిలించేందుకు రూ. 35 కోట్లు

తుప్పు వదిలించేందుకు రూ. 35 కోట్లు


నిర్వహణ లేనిప్రకాశం బ్యారేజీ క్రస్ట్ గేట్లు



కృష్ణా నదిపై విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీ క్రస్ట్ గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం ఫలితంగా.. వర్టికల్ గేట్లు తుప్పు పట్టి పెచ్చులు రాలిపోతున్నాయి. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఈ గేట్లకు రూ. 35 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నట్లు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ రమేష్‌బాబు గురువారం హైదరాబాద్‌లో తెలిపారు. పటేల్ అండ్ కంపెనీకి ఈ మరమ్మతు కాంట్రాక్టు ఇచ్చినట్లు వెల్లడించారు.

 

సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: కృష్ణా నదిపై విజయవాడ వద్ద ఉన్న ప్రకాశం బ్యారేజీ క్రస్ట్ గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం ఫలితంగా.. వర్టికల్ గేట్లు తుప్పు పట్టి పెచ్చులు రాలిపోతున్నాయి. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఈ గేట్లకు రూ. 35 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నట్లు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజ నీర్ రమేష్‌బాబు గురువారం హైదరాబాద్‌లో తెలిపారు. పటేల్ అండ్ కంపెనీకి ఈ మరమ్మతు కాంట్రాక్టు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం డ్యాం భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఈ మరమ్మతు పనులు సెప్టెంబర్ నుంచి మొదలై జనవరికల్లా ముగుస్తాయని కృష్ణా జిల్లా నీటిపారుదలశాఖ ఎస్‌ఈ శ్రీనివాస్ విజయవాడలో మీడియాకు వివరించారు.

 

12 ఏళ్ల కిందట కొత్త గేట్ల ఏర్పాటు...

 ప్రకాశం బ్యారేజీకి 25 అడుగుల వెడల్పు, 12.2 అడుగుల ఎత్తు కలిగిన 70 వర్టికల్ (నిలువు) గేట్లు ఉన్నాయి. 1957లో బ్యారేజీ నిర్మాణం జరగ్గా అప్పట్లో ఏర్పాటు చేసిన గేట్లను 2002 తొలగించి ప్రస్తుతం ఉన్న గేట్లను బిగించారు. నిబంధనల ప్రకారం వారానికోసారి వీటి పనితీరును పరిశీలిస్తూ అవసరమైనపుడు స్వల్ప మరమ్మతులు జరుపుతూ ఉండాలి. ప్రతి మూడేళ్లకోసారి వీటికి పెయింటింగ్ పనులు, ఇతరత్రా వెల్డింగ్ వర్కులు చేపట్టాలి. ఈ పనులన్నీ సీతానగరంలోని ప్రభుత్వ పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ ఇంజనీర్లు నిర్వహించాలి. కృష్ణా సర్కిల్ నీటిపారుదల శాఖ అధికారులు వీరికి నిధుల కేటాయింపు జరిపితే.. పీడబ్ల్యూడీ వర్క్‌షాప్ సిబ్బంది మెయింటెనెన్స్ పనులు చేపడుతుంటారు.

 

మెయింటెనెన్స్ లేక తుప్పుపట్టిన గేట్లు...


అయితే ఈ మెయింటెనెన్స్ పనులేవీ సక్రమంగా జరగలేదని తెలుస్తోంది. కేవలం కింది స్థాయి సిబ్బంది గేట్లను పరిశీలించినపుడు డ్రెయిన్ హోల్స్‌కు అడ్డుపడ్డ చెత్తాచెదారాన్ని తొలగించడం మినహా చేసిందేమీ లేనట్లు కని పిస్తోంది. ఫలితంగా గేట్లకు మధ్యనున్న ఐరన్ గడ్డర్ల మధ్య ఉండే డ్రెయిన్ హోల్స్ మూసుకుపోయి అంగుళం మేర ఎత్తులో నీటి నిల్వలు పెరిగి అన్ని గేట్లకు దిగువ వైపున తుప్పు ఎక్కువైంది. దీని కారణంగా గేట్ల పటిష్టత కోసం బిగించిన క్రాస్ స్టిఫ్‌నెర్స్ చాలా చోట్ల దెబ్బతిన్నాయి. పలు గేట్ల కింద రబ్బర్ చానళ్లు, సీళ్లు తొలగిపోయి నీరు స్వల్పంగా లీకవుతోంది.

 

ప్రమాదం లేకపోయినా..

ఈ పరిస్థితుల్లో సర్కారు ఆదేశాల మేరకు బుధవారం ప్రకాశం బ్యారేజీ క్రస్ట్ గేట్లను పరిశీలించిన నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి వేదవ్యాస్‌తో కూడిన నిపుణుల బృందం గురువారం తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ప్రస్తుతం బ్యారేజీకి గానీ, గేట్లకు గానీ చెప్పుకోదగ్గ ప్రమాదమేమీ లేకపోయినప్పటికీ, ఇప్పటినుంచైనా గేట్లకు పీరియాడికల్ మెయింటెనెన్స్ అవసరమని ఆ నివేదికలో స్పష్టంచేసింది. దీంతో గేట్లకు ఉన్న తుప్పును తొలగించడంతో పాటు దెబ్బతిన్న స్టిఫ్‌నెర్స్, హేంగలర్స్, డ్రెయిన్‌హోల్స్, గడ్డర్లకు మరమ్మతులను సెప్టెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు సాగునీటి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. మరమ్మతుల కోసం బ్యారేజీలో నీటి స్థాయిని తగ్గించాల్సి ఉంటుంది కాబట్టి నీటి విడుదలను నిలిపివేయాలని సాగర్ డ్యాం అధికారులను కోరామని తెలిపారు. అలాగే ఎగువ నుంచి నీటిని పులిచింతల రిజర్వాయర్‌లో నిల్వ చేయాలని డ్యాం ఎస్‌ఈకి లేఖ రాశామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top