మూడేళ్లలో రూ.2 లక్షల కోట్ల అవినీతి

మూడేళ్లలో రూ.2 లక్షల కోట్ల అవినీతి - Sakshi


విచారణ జరిపిస్తే చంద్రబాబు,లోకేష్‌ జైలుకెళ్లడం ఖాయం

వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ వెల్లడి




సాక్షి, హైదరాబాద్‌: గడిచిన మూడేళ్లలో రూ.2 లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడటమే కాకుండా, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన అవినీతి చక్రవర్తి చంద్రబాబా నీతి వాక్యాలు మాట్లాడేది? అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రంగా మండిపడ్డారు.టీడీపీ మూడేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపితే బాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ జైలుకు వెళ్లటం ఖాయమని చెప్పారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలను, 21 మంది ఎమ్మెల్యేలకు రూ.20–30 కోట్లు ఎరగా వేసి కొనుగోలు చేసి చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.



అభివృద్ధి గురించి చెప్పే దమ్ము లేదు

 ప్రతిపక్ష నేతపై అభాండాలు వేయడం తప్ప, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు లేవని వాసిరెడ్డి విమర్శించారు. మంత్రులు, చంద్రబాబు.. ప్రజల మధ్యకు వస్తే చాలు  జగన్‌ గురించే మాట్లాడుతున్నారని, అంతు చూస్తాం.. అంతం చేస్తామని తప్ప వేరే ఏమీ మాట్లాడటం లేదని విమర్శించారు. చివరకు కుప్పం వెళ్లినా జగన్‌పై ఆరోపణలు చేస్తే తప్ప గెలవలేమన్న భయం చంద్రబాబుకు పట్టుకుందన్నారు. దివంగత  వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన పాలనలో కుప్పం ప్రజలకు ఏమిచ్చారు.. మీరు వచ్చాక ఏం చేశారో ఒక్కమాటైనా చెప్పగలరా  అని నిలదీశారు.  జగన్‌ జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదని మాట్లాడటంపై ఆమె మండిపడ్డారు.  

జగన్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేకే..

 ప్రత్యేక హోదా సాధనకు జగన్‌ నిరంతరం పోరాడుతు న్నారని తెలిపారు. జనం కోసం జగన్‌ పోరాడుతుంటే వారు జగన్‌పై మాత్రమే పోరాటం చేస్తున్నారని పద్మ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందిగా కేంద్రాన్ని అడగాల్సిన చంద్రబాబు, అది చేయకపోగా  ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రంలో ఉండరంటూ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.  ఇది చంద్రబాబులోని భయాన్ని తెలియజేస్తోందని చెప్పారు. ఏపీని ఒక మాఫియా రాజ్యంలా చేశారని, ఇప్పుడు మాఫియాను మించిన నేర సామ్రాజ్యంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వాసిరెడ్డి ధ్వజమెత్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top