ప్రత్యేక హోదాతోనే ఏపీకి గ్రాంటు

ప్రత్యేక హోదాతోనే ఏపీకి గ్రాంటు - Sakshi


రాజధాని కోసం రూ. 1,35,349 కోట్లు ఆశిస్తున్న ఏపీ  

14వ ఆర్థికసంఘాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం


 

సాక్షి, హైదరాబాద్: పధ్నాలుగో ఆర్థిక సంఘం నుంచి భారీ గ్రాంటును రాబట్టుకోవాలని యత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అది ప్రత్యేక హోదా లభిస్తేనే అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఏపీ ప్రభుత్వం 14వ ఆర్ధిక సంఘంనుంచి రూ.1,35,349 కోట్ల గ్రాంటును ఆశిస్తోంది. అందుకు అనుగుణంగా 14వ ఆర్థికసంఘం పెద్ద మొత్తంలో 90 శాతం మేర గ్రాంటుకు సిఫారసు చేయాలంటే అంతకు ముందుగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాల్సి ఉంది. కానీ ఈ అంశంపై కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు కదలికలు కనిపించడం లేదు.

 

అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాజ్యసభలో ప్రకటన చేస్తూ విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారు. ఎన్నికలయిపోయి కేంద్రంలోను, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తున్నా ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు ఎటువంటి కదలికలు లేవని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక హోదా కల్పించకుండా 90 శాతం మేర గ్రాంటుకు ఆర్థికసంఘం సిఫారసు చేయదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఆర్థికసంఘం అక్టోబరు నెలాఖరుకల్లా సిఫారసులతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని నిర్ణయించిందని.. ఆ లోగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకపోతే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున గ్రాంటు పొందకుండా నష్టపోతామని ఆందోళన వ్యక్తంచేశారు.

 

సెప్టెంబరులో సమావేశం

ఆర్థిక సంఘం సెప్టెంబర్ 10 - 15 తేదీల మధ్య రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల కోసం హైదరాబాద్ రానుంది. ఈలోగానే సంఘానికి మొమోరాండం పంపించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు శనివారం  జరిపిన సమీక్షలో ప్రతిపాదనలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాల్సిందిగా అన్ని శాలకు ఆదేశాలు జారీచేశారు. విభజన నేపధ్యంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వీలైనంత మేర నిధులు పొందేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి విద్య, వైద్య సంస్థలతో పాటు పలు రంగాలకు చెందిన సంస్థల ఏర్పాటుకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి పొందాలంటే ఆర్థికసంఘానికి ప్రతిపాదనలు సమర్పించాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా..కొత్త రాజధాని మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 1,35,349 కోట్ల కేంద్ర గ్రాంటుకు సిఫారసు చేయాల్సిందిగా 14వ ఆర్థికసంఘాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధమికంగా నిర్ణయానికి వచ్చింది.

 

రాష్ట్ర రాజధాని జోన్లుగా ఎంపికయ్యేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలపై డీటీసీపీ (డిస్ట్రిక్ట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) విభాగం అధికారులు కమిటీకి ఈ ఏడాది జూలైలో కొంత సమాచారాన్ని అందచేశారు. ఇందులో ముసునూరు ఒక్కటే ఏలూరుకు దగ్గరగా ఉంది. మిగిలిన ప్రాంతాలు పులిచింతల, మాచర్ల, బొల్లాపల్లి, వినుకొండ, మార్టూరు, దొనకొండ, మంగళగిరి. అయితే మునిసిపల్ శాఖ పంపిన ఈ ప్రతిపాదనలన్నీ అనధికారిమేనని, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేదని పేర్కొన్నట్లు శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top