నేను సిసలైన హైదరాబాదీని!

నేను సిసలైన హైదరాబాదీని! - Sakshi


చివరి శ్వాస వరకు భారతీయురాలినే

‘బ్రాండ్’ వివాదంపై సానియా వివరణ


 

హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ‘బ్రాండ్ అంబాసిడర్’గా తనను నియమించడంపై వస్తున్న విమర్శలను టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తిప్పి కొట్టారు. తాను సిసలైన హైదరాబాదీనని, తనను బయటి వ్యక్తిగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. వందేళ్లకు పైగా తమ కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోందని గుర్తుచేశారు.

 

కొందరు రాజకీయ నాయకులు అనవసరపు రచ్చతో విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారంటూ సానియా గురువారం ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు చెందిన షోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకోవడంపై వివరణ ఇస్తూ..  ఏ దేశస్తుడిని వివాహమాడినా.. తాను తుది శ్వాస వరకూ భారతీయురాలిగానే ఉంటానని తేల్చిచెప్పారు.

 

వివాదం నేపథ్యం..: సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి నియమించడాన్ని బుధవారం బీజేపీ సీనియర్ నేత కె. లక్ష్మణ్ తప్పు పట్టారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకే పాకిస్థానీ కోడలు అయిన సానియాను ప్రచారకర్తగా ఎంపిక చేశారని, దీనికి టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా మద్దతు పలికారు. బ్రాండ్ అంబాసిడర్‌గా  సానియా సరితూగదని ఆయన అనటంతో వివాదమైంది.

 

పార్లమెంట్‌లోనూ రచ్చ..: సానియా అంశంపై గురువారం పార్లమెంటులోనూ వాదోపవాదాలు జరిగాయి. సానియా అసలైన హైదరాబాదీనే అని, ఆమె రాష్ట్రానికి గర్వకారణమని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సానియాలాంటి క్రీడాకారిణిని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారి అన్నారు. అమితాబ్‌ను గుజరాత్‌కు బ్రాండింగ్ చేయగా లేనిది, సానియాను సొంత రాష్ట్రానికి చేస్తే తప్పేంటని కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సానియాను అంబాసిడర్ చేయడం సంతోషకర విషయమని, దీనికి మతపరమైన రంగు పులమవద్దని బీఎస్పీ అధినేత్రి మాయావతి అభిప్రాయ పడ్డారు.

 

మరో వైపు బీజేపీ జాతీయ నేత, సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సానియాకు మద్దతు పలికారు. ‘సానియా అగ్రశ్రేణి అంతర్జాతీయ క్రీడాకారిణి. ఆమె భారత్‌కే బ్రాండ్ అంబాసిడర్’ అని జవదేకర్ అన్నారు. పార్టీ సీనియర్ నేత ఎంఎం జోషి లక్ష్మణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఎవరైనా అలా మాట్లాడితే అది వారి సంస్కృతిని సూచిస్తుంది’ అంటూ పార్టీ సహచరుడిని మందలించారు.  క్రీడలు ప్రజలందరినీ ఒక్కటి చేసేవనీ, దేశం నుంచి ప్రాతినిథ్యం వహించే ప్రతిఒక్కరినీ దేశానికి గర్వకారణంగా భావించాలని కాంగ్రెస్  పేర్కొంది. మీర్జాపై లక్ష్మణ్ వ్యాఖ్యలను ఆమ్‌ఆద్మీ పార్టీ కూడా ఖండించింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top