రిస్కీ క్లిక్స్

రిస్కీ  క్లిక్స్


Lens   &   లైఫ్

 

 స్మైల్ అనగానే నవ్వవు.. చిటికెలు కొడితే పట్టించుకోవు.. ఇటు చూడమనే అవకాశమే లేదు.. కానీ వాటి నడకలో రాజసం ఉంటుంది. అవి చేసే ప్రతి పనిలో అందం ఉంటుంది. వాటిని కెమెరాలో బంధించాలంటే హైలెన్స్ కెమెరాలు కాదు.. ధైర్యం కావాలి.. అంతకుమించి బోల్డెంత ఓపిక కావాలి. క్షణాల్లో మారిపోయే హావభావాల్లో కత్తిలాంటి దాన్ని సెలెక్ట్ చేసి క్లిక్‌మనిపించాలి. అప్పుడు వైల్డ్ ఫొటోగ్రాఫ్ బోల్డ్‌గా వస్తుంది. అందుకోసం ఎక్కడెక్కడో తిరగాలి.. ఎన్నో వదులుకోవాలి. అలాంటి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో ప్రత్యేకత చాటుకుంటున్న సిటీకి చెందిన శంకర్‌తో ఈ వారం లెన్స్ అండ్ లైఫ్

 

మాది కృష్ణా జిల్లా కొల్లేరు. చిన్నప్పటి నుంచే ప్రకృతి అందాలంటే ఇష్టపడే నేను వాటిని కెమెరాలో బంధించేవాడిని. అలా నాకు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీపై ఆసక్తి ఏర్పడింది. సిటీకి వచ్చాక జేఎన్‌టీయూ నుంచి డిప్లొమో ఇన్ ఫొటోగ్రఫీ కోర్సు చేశా. ఆపై వరంగల్‌లోని ఏటూరునాగారం అడవులు, శ్రీశైలంలోని నల్లమల అడవులు, శ్రీహరికోట సమీపంలోని సూళ్లూరిపేట నీలిపట్టు ప్రాంతాలను నా కెమెరా నేత్రంతో వీక్షించా. అక్కడి ప్రకృతితో పాటు పక్షులు, జంతువుల ఫొటోలు తీశా. వీటిలో కొన్ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ బ్రోచర్‌లు, పోస్టర్లలో కూడా వాడారు.



ఆనాటి గూడు కొంగలేవీ



1972 అనుకుంటా. వైల్డ్‌లైఫ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది. కొల్లేరు సరస్సు సమీప ప్రాంతాల్లో గూడు కొంగలు (గ్రేప్ పొలికన్ స్పాట్ బిల్డ్) తాటి చెట్లపై గూళ్లు కడుతుండటం ఎక్కువగా కనిపించేది. అందులో గుడ్లు పొదిగేవి. అలా వాటి సంతతి రోజురోజుకు పెరిగింది. ఇదే సమయంలో స్థానిక గిరిజనులు గూడు కొంగలను వేటాడడం మొదలెట్టారు. రోజురోజుకి వీరి ఆగడాలు శ్రుతిమించడంతో అక్కడి నుంచి ఆ పక్షులు వలస వెళ్లాయి. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఆ గూడు కొంగలు కొల్లేరు సరస్సులో కనిపించాయి. గూడు కొంగ తన పిల్లలకు ఆహారం ఇస్తున్న సమయంలో నా కెమెరా క్లిక్‌మంది. 2000 డిసెంబర్ 2 పులికాట్ సరస్సుకు వెళ్లా. మర్నాడు ఫ్లెమింగోలు నా కంటపడ్డాయి. వెంటనే వాటిని నా లెన్స్‌లో బంధించా. ఈ ఫొటోలు శభాష్ అనిపించుకున్నాయి.



ప్రకృతితో మాట్లాడొచ్చు



వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే జంతువు హావభావాలే కాదు.. చుట్టూ ఉన్న ప్రకృతీ ప్రతిబింబించాలి. ఫొటోగ్రఫీపై పట్టు, వైల్డ్‌లైఫ్ మీద ఆసక్తి ఉన్నప్పుడే ఇందులో రాణించగలం. ఈ రంగంలో సంపాదన ఉండదు.. పైగా కెమెరాలకు, లెన్స్‌లకు లక్షల్లో ఖర్చవుతుంది. కానీ, ప్రకృతితో మాట్లాడే అవకాశం ఒక్క వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలోనే ఉంది.



టెక్నికల్ యాంగిల్



ఫొటోలు తీసేందుకు కెనాన్ ఏ వన్ వాడుతున్నా. జూమ్ 152 టూ 600. షట్టర్ స్పీడ్ 250పైనే. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ పూర్తిగా నేచురల్ లైటింగ్‌పై ఆధారపడి ఉంటుంది.



శిక్షణ తర్వాతే అడవికెళ్లాలి



ఔత్సాహిక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌లు శిక్షణను జూ నుంచి మొదలుపెట్టాలి. శిక్షణ తర్వాత అడవుల్లోకి వెళ్లి ఫొటోలు తీయడం ఉత్తమం. పులి, చిరుతపులి, అడవి పిల్లి, దుప్పి వంటి వాటికోసం శ్రీశైలం, ఏటూరునాగారం అడువులకు వెళ్లొచ్చు. అలాగే దేశ, విదేశీ పక్షులు, నీటి జంతువుల కోసం షామీర్‌పేట, పాకాల, కొల్లేరు, గుంటూరు జిల్లాలోని ఉప్పలపాడు వంటి సరస్సులకు వెళ్లొచ్చు.

 

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top