సీఎం కేసీఆర్ నుంచి ప్రాణహాని

సీఎం కేసీఆర్ నుంచి ప్రాణహాని - Sakshi


♦ హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్

♦ నాకు 4+4 గన్‌మెన్లు ఇచ్చేలా కేంద్రాన్ని ఆదేశించండి

♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యున్నత రాజకీయ పాలకుని నుంచి, పోలీసుల నుంచి తనకు ముప్పు ఉందని, ఈ నేపథ్యంలో తనకు 4+4 గన్‌మెన్లను, ఎస్కార్ట్ సెక్యూరిటీని కల్పించేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత ఎ. రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేస్తున్నందుకు, ప్రభుత్వాన్ని బహిరంగంగా నిలదీస్తున్నందుకు సీఎం కేసీఆర్ తనపై కక్షకట్టారని రేవంత్ పిటిషన్‌లో ఆరోపించారు. సీఎం వ్యక్తిగత ప్రతీకారానికి బాధితునిగా మారానని పేర్కొన్నారు. ఆపరేషన్ బ్లూస్టార్ లాగా తనను తుదముట్టిస్తానంటూ అసెంబ్లీలోనే సీఎం ప్రకటించారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ తనపై భౌతిక దాడులకు దిగాయని తెలిపారు.



ఈ నేపథ్యంలో తనకు 3+3 గన్‌మెన్ సౌకర్యాన్ని కల్పించారన్నారు. రాష్ట్ర విభజన జరిగి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తనకు ముప్పు పెరిగిందని వివరించారు. అయితే ప్రభుత్వం తన భద్రతను 2+2కు కుదించిందన్నారు. తమ పార్టీ నుంచి పలువురు శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడంపై సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్నానని, ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి బెదిరింపులు వస్తున్నాయన్నారు. పోలీసులూ అధికార పార్టీ చెప్పినట్లే చేస్తున్నారని ఆరోపించారు. భద్రత పెంపు కోసం కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అందువల్ల తనకు ఎస్కార్ట్ సెక్యూరిటీని కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top