సంతకానికి ససేమిరా!

సంతకానికి ససేమిరా! - Sakshi


అవినీతి ‘సాగు’లో భాగస్వాములం కాలేమన్న సీఎస్‌లు..

ఇద్దరూ ‘నో’ అన్నా మళ్లీ కేబినెట్‌కు ఫైల్


 

 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అంటే రాష్ర్ట అధికార యంత్రాంగానికి పెద్ద తలకాయ వంటివాడు. ప్రభుత్వానికి దిక్సూచి వంటి వాడు. అలాంటి సీఎస్ ఒక ఫైలుకు నో చెప్పారు. నిబంధనలకు విరుద్ధం కావడంతో ఫైలును ఆయన తిరస్కరించారు. ఆ విషయం తెలిసి కొత్త సీఎస్ కూడా దానికి నో అన్నారు. అయినా ఆ ఫైలు దొడ్డిదోవన కేబినెట్ ముందుకు వచ్చేసింది. కేబినెట్ ఆమోదం పొంది జీవో కావడానికి సిద్ధమైపోయింది. ఆ దశలో మరోమారు సీఎస్ సంతకం చేయడానికి నిరాకరించడంతో వేల కోట్ల విలువైన భారీ అవినీతి కుంభకోణం సంగతి బైటపడింది. ఇరిగేషన్ శాఖలో ‘చినబాబు’ స్క్రీన్‌ప్లేలో ‘పెదబాబు’ డెరైక్షన్‌లో నడిచిన ఈ అవినీతి వ్యవహారం ఇపుడు రాష్ర్ట అధికారయంత్రాంగాన్ని కుదిపేస్తోంది. ఇంతకీ సీఎస్ నిరాకరించిన ఆ ఫైలు కథా కమామీషు ఏమిటో చూద్దామా..?



 అసలేం జరిగిందంటే..

 హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్), గాలేరు - నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్),  గోరకల్లు ప్రాజెక్టుల్లో 25 ప్యాకేజీల్లో మిగిలిపోయిన పనులను విడదీసి, వాటి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేశారు. తర్వాత టెండర్లు పిలిచి టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఇతర నాయకులకు కట్టబెట్టేశారు. అంచనా వ్యయం పెంచినప్పుడు... ఏ పరిస్థితుల్లో అంచనా వ్యయం పెంచాల్సి వచ్చిందో ప్రభుత్వానికి నివేదించి, సవరించిన అంచనాలకు పరిపాలనా అనుమతులు తీసుకోవాలి. అనుమతుల కోసం ప్రభుత్వానికి రాస్తే.. అడ్డగోలు పెంపుపై అభ్యంతరాలు వ్యక్తమవుతాయని, ఆర్థిక శాఖ ఆమోదం లభించకపోతే టెండర్లు పిలవడం సాధ్యం కాదని జలవనరుల శాఖలోని సర్కారు పెద్దలు భావించారు. సవరించిన అంచనాలకు ప్రభుత్వ ఆమోదం లేకుండానే.. 25 ప్యాకేజీలకు టెండర్లు పిలిచి అధికార పార్టీ నేతలకు కాంట్రాక్టులు అప్పగించేశారు.



చాలా ప్యాకేజీల్లో సగానికి పైగా బిల్లులు చెల్లించిన తర్వాత ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్ల మధ్య ముడుపుల పంపిణీ విషయంలో విభేదాలు తలెత్తాయి. ముడుపుల పంపిణీ సాఫీగా సాగిపోయి ఉంటే.. ఎవరికీ అనుమానం రాకుండా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకొనే వారే. అవినీతి సొమ్ము పంపిణీలో తలెత్తిన విభేదాల ఫలితంగానే జీఎన్‌ఎస్‌ఎస్ 29-ఎ ప్యాకేజీలో రూ. 12 కోట్ల విలువైన (మిగిలిపోయిన) పనుల అంచనా వ్యయాన్ని రూ. 110 కోట్లకు పెంచి వాటిని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అప్పగించిన వ్యవహారం ఆ మధ్య వెలుగుచూసిన సంగతి తెల్సిందే. తమ ఆమోదం లేకుండా అంచనా వ్యయం భారీగా పెంచడాన్ని ఆర్థిక శాఖ సీరియస్‌గా తీసుకుంది. లోతుగా పరిశీలిస్తే.. సగానికిపైగా బిల్లులు కూడా కాంట్రాక్టర్లకు చెల్లించేసినట్లు తేలింది. మరింత లోతుగా పరిశీలిస్తే.. మొత్తం 25 ప్యాకేజీల్లో ఇదే తీరుగా జరిగినట్లు గుర్తించింది. అన్ని ప్యాకేజీల్లో సగానికిపైగా బిల్లులు చెల్లించిన తర్వాత.. మిగతా బిల్లులు నిలిపివేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సాగునీటిశాఖ తీరును తప్పుబట్టింది.



 మంత్రివర్గం ఆమోదానికి తొలి ప్రయత్నం

 మంత్రివర్గం ఆమోదముద్ర పడితే.. అవినీతి వ్యవహారం కాస్తా నీతి వ్యవహారంగా మారిపోతుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. అందుకు అనుగుణంగా సాగునీటి శాఖ సుదీర్ఘ కసరత్తు చేసి.. మంత్రివర్గంలో చర్చించడానికి ‘నోట్’ రూపొందించింది. జనవరి 28న జరిగిన మంత్రివర్గ సమావేశం అజెండాలో చేర్చాలని వారం రోజుల ముందే ‘నోట్’ను సీఎస్‌కి జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పంపించారు. మంత్రివర్గానికి వెళ్లాలంటే సీఎస్ ఆమోదం తప్పనిసరి. ఈ అవినీతి వ్యవహారానికి తాను అంగీకరించలేనని, మంత్రివర్గానికి పంపించడానికి అనుమతించనని అప్పటి సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు తెగేసి చెప్పారు. సీఎస్ ఆమోదం లేకపోవడంతో.. అవినీతి వ్యవహారాన్ని నీతి ముద్ర వేసే తొలి ప్రయత్నం ఫలించలేదు.



 కొత్త సీఎస్ ద్వారా మలి ప్రయత్నం

 జనవరి 31న సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు పదవీ విరమణ చేశారు.  ఫిబ్రవరి 1న కొత్త సీఎస్‌గా ఎస్పీ టక్కర్ వచ్చారు. సీఎస్ ఇతర పనుల్లో బిజీగా ఉన్నారనే సాకుతో ఆయన ఆమోదం లేకుండానే ‘అంచనాల పెంపు ప్రతిపాదన’ 3న జరిగిన మంత్రివర్గ సమావేశానికి చేరింది. కుంభకోణంలో బాగా సొమ్ము దండుకున్న ‘చినబాబే’ ఈ వ్యవహారాన్ని తెరవెనుక నుంచి నడిపారనేది అధికార వర్గాల సమాచారం. సీఎస్ సంతకం లేకుండా సమావేశంలో అజెండాగా వచ్చిందనే విషయం మంత్రులకు తెలిసినా మిన్నకుండిపోయారు. ప్రభుత్వ ‘ముఖ్యనేత’కూ ఈ అవినీతి తంతులో భాగస్వామ్యం ఉన్నందున మంత్రులెవరూ నోరు మెదపలేకపోయారు. దాంతో మంత్రివర్గం మాత్రం ఆమోదముద్ర వేసింది.



 సంతకం పెట్టని సీఎస్!

 మంత్రివర్గ ఆమోదం తెలిపిన తర్వాత సీఎస్ సంతకం పెట్టి సంబంధిత శాఖకు పంపిస్తేనే ఉత్తర్వులు జారీ అవుతాయి. ప్రభుత్వం మీద రూ. 6 వేల కోట్ల భారం పడే అంచనా పెంపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసినా.. సంతకం చేయడానికి సీఎస్ ఎస్పీ టక్కర్ నిరాకరించారు. అడ్డగోలు వ్యవహారాలకు ఆమోదం తెలపలేనని ఆయన తేల్చిచెప్పారని తెలిసింది. సీఎస్‌ను ఒప్పించడానికి ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఉన్నతస్థాయి నుంచి ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. ఆర్థిక శాఖ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు జల వనరుల శాఖ సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తే, తాను సంతకం చేస్తానని సీఎస్ స్పష్టం చేశారని సమాచారం.



 మంత్రివర్గానికి భిన్న నివేదికలు..

 ఒకే అంశానికి సంబంధించి రెండు శాఖలు పరస్పర విరుద్ధమైన నోట్‌లు రూపొందించాయి. వాటిని మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లడానికి సీఎస్ నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అవినీతికి ఆమోదముద్ర వేస్తూ జల వనరుల శాఖ, అవినీతి అంటూ నిర్ధారిస్తూ ఆర్థిక శాఖ రూపొందించిన భిన్న నివేదికలు సోమవారం జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందుకు మరోమారు వెళ్లనున్నాయి. అవినీతికి కేబినెట్ ఆమోదముద్ర వేస్తుందో లేక తిరస్కరించి నీతిని నిలబెడుతుందో ఈ సమావేశంలో తేలిపోతుంది.

 

 ముఖ్యమంత్రి... అదేం ప్రశ్న...?

 ఈనెల 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశం మీద చర్చ జరిగినప్పుడు.. అవినీతి జరిగిందా? నిబంధనల ఉల్లంఘన మాత్రమే జరిగిందా? అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కేవలం నిబంధనల ఉల్లంఘనే జరిగిందని జల వనరుల శాఖ నుంచి సమాధానం వచ్చింది. ఇదే వాదనను ఆ శాఖ అధికారులు.. సీఎస్, ఆర్థిక శాఖ అధికారుల ముందూ వినిపించారు. ‘నిబంధనల ఉల్లంఘన ఎందుకు జరిగింది? ఏదో ప్రలోభం ఉండటం వల్లే నిబంధనలను ఉల్లంఘించారు. అవినీతి లేకుంటే.. నిబంధనలు ఉల్లంఘించాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ఉల్లంఘనలకు మూలం కచ్చితంగా అవినీతే. కథలు చెప్పొద్దు’ అని ఆర్థిక శాఖ ఘాటుగా స్పందించినట్లు సమాచారం.

 

 ఒకే పని.. ధరల్లో మాత్రం తేడా?

 జీఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్యాకేజీల్లో ఒకే రకమైన పనులకు పాత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్న ధరలకు, అదే ప్యాకేజీల్లో మిగిలిన పనులను తాజా టెండర్లలో సర్కారు పెద్దల సహకారంతో దక్కించుకున్న ‘అధికార’ కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్న ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఉదాహరణకు కాంక్రీట్ క్యూబిక్ మీటర్‌కు పాత కాంట్రాక్టర్లకు జీవో-22, 63 ప్రకారం అదనపు అమలుచేసినా రూ. 4 వేల లోపే చెల్లిస్తున్నారు. ‘అధికార’ కాంట్రాక్టర్లకు మాత్రం రూ. 7 వేల పైనే చెల్లిస్తుండటం గమనార్హం. ఇంధన ధరలు, స్టీలు, అల్యూమినియం  ధరలు తగ్గడం, సిమెంట్ ధర పెద్దగా పెరగకపోవడంతో కాంక్రీట్ పనుల ధరలు విపరీతంగా పెరిగే అవకాశం లేదు. కానీ ‘అధికార’ కాంట్రాక్టర్ల కోసం చుక్కలనంటే ధరలు నిర్ణయించడంతో అంచనా వ్యయం కూడా అదే స్థాయిలో పెరిగింది.

 

 ఆర్థిక, జలవనరుల శాఖల మధ్య కుదరని రాజీ

 ఇరు శాఖల అధికారులు నాలుగు రోజుల పాటు కసరత్తు చేశారు. జల వనరుల శాఖ అడ్డగోలు వ్యవహారాలపై రాజీ పడలేమని, అవినీతి వ్యవహారానికి తాము ఆమోదముద్ర వేయలేమని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. ఆర్థిక, జల వనరుల శాఖల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో మరోసారి మంత్రివర్గ సమావేశానికి పంపించడానికి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సీఎస్‌ను కోరినట్లు సమాచారం. అందుకు అంగీకరించడంతో.. మళ్లీ ‘నోట్’ రూపొందించడానికి అధికారులు కసరత్తు చేశారు. ఇటు జల వనరుల శాఖ, అటు ఆర్థిక శాఖ భిన్నాభిప్రాయాలతో పరస్పర విరుద్ధమైన ‘నోట్‌లు’ సీఎస్‌కు ఇచ్చాయి. ఇరు శాఖలు కలిసి ఒకే ‘నోట్’ ఇస్తే మంత్రివర్గానికి పంపిస్తానని, లేకపోతే వీలుకాదని సీఎస్ చెప్పారు. ఎంత కసరత్తు చేసినా.. ఒకే నోట్ రూపొందించడం రెండు శాఖలకు సాధ్యం కాలేదు.

whatsapp channel

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top