కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి

కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి - Sakshi


అసెంబ్లీలో విపక్షం డిమాండ్

ఐకేపీ, అంగన్‌వాడీ కార్మికులపై వాయిదా తీర్మానం.. తిరస్కరించిన స్పీకర్

మంత్రి జవాబు కోసం వైఎస్సార్‌సీపీ  పట్టు


 

సాక్షి, హైదరాబాద్: ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ), అంగన్‌వాడీ కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై శనివారం శాసన సభలో దుమారం రేగింది. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం చర్చించకపోయినా సంబంధిత మంత్రితో సమాధానం చెప్పించాలని వైఎస్సార్ సీపీ సభ్యులు డిమాండ్ చేశారు.



ఇందుకు కూడా స్పీకర్ అనుమతించకపోవడంతో సభ్యులు ఆయన పోడియంను చుట్టుముట్టి చర్చ జరగాలని, కార్మికులకు న్యాయం చేయాలని, మంత్రి సమాధానం చెప్పాలంటూ  నినాదాలు చేశారు. స్పీకర్‌తో వాగ్వాదానికి దిగారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. సమస్య తీవ్రమైనదేగానీ అత్యవసరంగా చర్చించాల్సినది కాదని, మరో రూపంలో వస్తే చర్చకు అనుమతిస్తానని చెప్పారు.



బాబు వస్తాడు, జాబు వస్తుందని చెప్పి...

ఈ దశలో జగన్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ‘‘నాలుగు రోజులుగా వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు నిరాహార దీక్ష చేస్తున్నారు. 15 వేల మంది ఏపీ విద్యుత్ సంస్థ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. అంగన్‌వాడీలు, ఐకేపీ సిబ్బంది నిరాహార దీక్షలో ఉన్నారు. బాబు వస్తాడు, జాబు వస్తుందని నమ్మి ఓట్లేస్తే ఈవేళ ఉన్న వాటిని తీసేస్తున్నారు’’ అని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయం చేయాలని, వారి సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం త్వరలో నివేదిక ఇస్తుందని, సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.



సర్కారు తీరు దారుణం : వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

కాంట్రాక్టు కార్మికుల పట్ల చంద్రబాబు సర్కారు తీరు దారుణంగా ఉందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. శనివారం పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వై.విశ్వేశ్వరరెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సర్వేశ్వరరావు, రాజన్న దొర, గిడ్డి ఈశ్వరిలు మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికులకు నెలల తరబడి జీతాలు చెల్లించడం లేదని చెప్పారు. వైఎస్ ఇచ్చిన కాంట్రాక్టు ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం మానవత్వం లేకుండా రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. వీరి సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వం కనీసం ఓ ప్రకటన చేయాలని కోరినా తిరస్కరించారన్నారు. బాబు వచ్చిన తర్వాత జాబ్‌లు పోయే పరిస్థితి నెలకొందని తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top