మూడు గంటల్లో రాష్ట్ర సరిహద్దులకు

మూడు గంటల్లో రాష్ట్ర సరిహద్దులకు - Sakshi


రాజధాని నుంచి జిల్లా కేంద్రాలకు

రెండు గంటల్లో చేరేలా రోడ్ల నెట్‌వర్క్

రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని నుంచి కేవలం మూడు గంటల్లో పొరుగు రాష్ట్రాల సరిహద్దుకు చేరుకునేలా రోడ్డు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని మిగిలిన 9 జిల్లా కేంద్రాలకు గరిష్టంగా 2 గంటల్లో చేరుకునేలా రోడ్లు ఉంటాయన్నారు. వచ్చే మూడేళ్లలో రోడ్ల అనుసంధానం విషయంలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానం ఆక్రమిస్తుందని భరోసా ఇచ్చారు. ఆయన మంగళవారం హైటెక్స్ ప్రాంగణంలోని ‘న్యాక్’లో సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... దక్షిణ భారత దేశంలో రోడ్ల అనుసంధానంలో వెనకబడ్డ తెలంగాణలో ఆ లోటు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రూ.15 వేల కోట్లతో పనులు ప్రారంభించిందన్నారు.


మూడేళ్లలో వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలకు 1,847 కి.మీ. మేర రూ.1,950 కోట్లతో  రెండు వరసల రోడ్ల నిర్మాణం చేపట్టామని, ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయన్నారు. రూ.2,500 కోట్లతో 2,284 కి.మీ. మేర సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తున్నామని, ఈ పనులూ సగం వరకు పూర్తయ్యాయన్నారు. వివిధ ప్రాంతాల్లో నదీ పాయలు, వాగులు, వంకలపై 220 వంతెనల నిర్మాణం చేపట్టామన్నారు. గోదావరి నదిపై వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో మూడు భారీ వంతెనల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. పర్ణశాల, బోర్నపల్లి, పరికగుడి ప్రాంతాల్లో నిర్మించే ఈ వంతెనలకు త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.


 జాతీయ రహదారులకు రూ.3 వేల కోట్లు

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 1,850 కి.మీ. మేర జాతీయ రహదారుల విస్తరణకు అనుమతించిన నేపథ్యంలో... అందులో 850 కి.మీ. రోడ్ల కోసం రూ.3 వేల కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు ఇళ్ల నిర్మాణానికి కూడా త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. 80 చోట్ల ఇప్పటికే స్థలాలు ఎంపిక చేశామని, హైదరాబాద్‌లో స్థలాల ఎంపిక ఇబ్బందిగా ఉందన్నారు. జిల్లా కేంద్రాల్లో నిర్మించే ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో ఓ సూట్‌ను స్థానిక ఎంపీకి కేటాయించాలని నిర్ణయించామన్నారు. కృష్ణా పుష్కరాలకు రోడ్లను అభివృద్ధి చేయటంతో పాటు ఇతర పనులకు రూ.309 కోట్లు విడుదలయ్యాయని తుమ్మల వెల్లడించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top