అకున్‌తో బాహుబలి–3 తీయాలేమో!

అకున్‌తో బాహుబలి–3 తీయాలేమో! - Sakshi

డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ విచారణపై రాంగోపాల్‌వర్మ

- ఫేస్‌బుక్‌లో వివాదాస్పద కామెంట్లు

నటీనటులను విచారించినట్టే విద్యార్థులను విచారిస్తారా అని ప్రశ్న

వర్మపై మండిపడ్డ ఎక్సైజ్‌ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం

అరెస్ట్‌ తప్పదంటూ హెచ్చరిక

 

 సాక్షి, హైదరాబాద్‌: సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌పై ఫేస్‌బుక్‌లో అనుచిత కామెంట్లు పెట్టారు. దీనిపై ఎక్సైజ్‌ అధికారులు, సిట్, రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది. అరెస్టు తప్పదంటూ హెచ్చరించింది. 

 

అకున్‌ను బాహుబలిలా చూపుతున్న మీడియా: వర్మ 

‘సినీ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుబ్బరాజులను 12 గంటలపాటు ప్రశ్నించినట్టుగానే డ్రగ్స్‌ తీసుకున్న స్కూల్‌ విద్యార్థులను కూడా గంటల తరబడి ప్రశ్నిస్తారా? డ్రగ్స్‌ కేసును అడ్డం పెట్టుకొని ఎక్సైజ్‌ విభాగం తన ప్రచారానికి సినీ నటులను ట్రైలర్, టీజర్‌గా వాడుకుంటోంది. డ్రగ్స్‌ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదన్న విషయం చట్టపరంగా బయటపడుతుంది. కానీ అకున్‌ సబర్వాల్‌ విచారణలో సినీ వ్యక్తులు చెప్పిన విషయాలు, చెప్పని విషయాలను మీడియాకు లీకులిస్తున్నారు. అకున్‌ను మీడియా అమరేంద్ర బాహుబలి తరహాలో చూపిస్తోంది.



బహుశా అకున్‌ సబర్వాల్‌తో రాజమౌళి బాహుబలి పార్ట్‌–3 తీయాలేమో. డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఎక్కడా ఎలాంటి కేసులు లేకున్నా విచారణ పేరుతో మీడియాకు లీకులిచ్చి సంబంధిత నటీనటుల కుటుంబీకులు బాధపడేలా, వారి గౌరవం దెబ్బతినేలా అకున్‌ సబర్వాల్, అతడి దర్యాప్తు బృందం వ్యవహరిస్తోంది. డ్రగ్స్‌ నియంత్రణలో అకున్‌ పాత్ర సరైనదే కానీ, విచారణకు హాజరవుతున్న వారితో సిట్‌ వ్యవహరిస్తున్న తీరుపై మీడియాలో వచ్చే ఊహాగానాలను ఆపడం మీ బాధ్యత కాదా? విచారణ జరుగుతున్న తీరుపై మీడియాకు లీకులిచ్చి సంబంధిత విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల పట్ల మీ విభాగం అమర్యాదగా ప్రవర్తిస్తోంది’ అంటూ రాంగోపాల్‌ వర్మ ఫేస్‌బుక్‌లో కామెంట్లు చేశారు. 

 

కేసు పెట్టి అరెస్ట్‌ చేయిస్తాం... 

డ్రగ్స్‌ కేసు విచారణ జరుపుతున్న అధికారులు, అకున్‌ సబర్వాల్‌పై వివాదాస్పద కామెంట్లు చేసిన వర్మపై ఎక్సైజ్‌ సిట్‌తోపాటు రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎలాంటి ఆధారాల్లేకుండా విచారణ సంస్థ, అధికారులపై ఆరోపణలు చేసిన వర్మపై హైదరాబాద్‌ అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ఫిర్యాదు చేస్తామని రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహమూద్‌ అలీ మీడియాకు తెలిపారు. అరెస్టు తప్పదని హెచ్చరించారు. 

 

వర్మ విజ్ఞతకే వదిలేస్తున్నాం: చంద్రవదన్‌

రాంగోపాల్‌వర్మ చేసిన కామెంట్లు సరికాద ని, అయినా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ చెప్పారు. అన్ని ఆధారాలతోనే విచారణ జరుగుతోందని, అంద రూ సహకరిస్తున్నారని తెలిపారు. చట్టాలకు లోబడే చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం పూర్తి అధికారం ఇచ్చిందని చెప్పారు. కేవలం సినిమా వాళ్లనే టార్గెట్‌ చేశామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఎక్సైజ్‌ శాఖను దెబ్బతీసే ప్రయత్నం కొంత మంది చేస్తున్నారని, వాటిని ఖండిస్తున్నామన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఉన్న పబ్బులకు నోటీసులిచ్చి విచారణ జరిపామన్నారు.



వీటిలో నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్న ‘ఎఫ్‌ క్లబ్‌’ పబ్‌ లైసెన్స్‌ రద్దు చేశామన్నారు. మరో 14 పబ్బుల యాజమాన్యాలకు హెచ్చరిక  నోటీసులిచ్చామని, సీసీ కెమెరాలు, రికార్డులు తదితర వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశామన్నారు. పబ్బుల్లో డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్టు అనుమానం వస్తే సమాచారం ఇవ్వాలని, అక్కడ పార్టీలు చేసే ఈవెంట్‌మేనేజర్లు, డ్యాన్సర్ల వివరాలను ఇవ్వాలని ఆదేశించారు. ఆరు నెలల నుంచి ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు సమర్పించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్బుల లైసెన్స్‌ సస్పెన్డ్‌ చేస్తామని హెచ్చరించారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top