సిటీపై వాన వేటు

సిటీపై వాన వేటు


- మూడు గంటల వర్షానికి అతలాకుతలమైన భాగ్యనగరి  

- వర్ష విలయానికి ఏడుగురు మృత్యువాత

 

 సాక్షి, హైదరాబాద్: మహానగరం మరోసారి ముంపునకు గురైంది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన జడివాన దాటికి భాగ్యనగరం కాస్తా.. అభాగ్య నగరంగా మారిపోయింది. మూడు గంటల వర్షవిలయానికి ఏడు నిండు ప్రాణాలు బలయ్యాయి. రామంతాపూర్ ప్రగతి నగ ర్‌లో గోడ కూలి గుడిసెపై పడడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. భోలక్‌పూర్‌లోని బంగ్లాదేశ్ కాలనీలో పురాతన ఇంటి పైకప్పు కూలడంతో ముగ్గురు తనువు చాలించారు. గ్రేటర్ పరిధిలో బుధవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు సగటున 7.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా అంబర్‌పేట్‌లో 12.1 సెం.మీ వర్షపాతం రికార్డయ్యింది. వర్షవిలయానికి 150కిపైగా బస్తీలు, కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.



ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోవడంతో నగరవాసులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. చెరువులను తలపించేలా రహదారులు.. నోళ్లు తెరచిన నాలాలు భయభ్రాంతులకు గురిచేశాయి. దీంతో ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఉద్యోగులు మధ్యాహ్నానికి ఆఫీసులకు చేరుకున్నారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రూ.కోట్లలో ఆస్తినష్టం సంభవించినట్లు జీహెచ్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. భారీ వర్షానికి నగరంలో పది ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సిటీ బస్సులు సైతం ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుపోయాయి. నగరంలో మూడు వేల బస్సు ట్రిప్పులు రద్దవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడడం.. పలు సబ్‌స్టేషన్లలోకి నీరు చేరడంతో అనేక ప్రాంతాల్లో అంధకారం అలముకుంది.

 

 భోలక్‌పూర్‌లో తల్లి సహా చిన్నారుల మృతి

 భోలక్‌పూర్‌లోని బంగ్లాదేశ్ కాలనీలో నదీమ్ జానీ సెల్‌ఫోన్ రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య బిల్‌కిస్ బేగం(25) ఇద్దరు కుమార్తెలు జయభా ఫాతిమా(5), మార్య(3)తో కలసి వందేళ్ల క్రితం నిర్మించిన పురాతన ఇంట్లో నదీమ్ జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో భారీ వర్షానికి ఇంటి పైకప్పు నుంచి మట్టి రాలి పడుతుండటంతో.. అనుమానం వచ్చి నదీమ్ ఇంటి బయటకు వచ్చి పరిశీలించసాగాడు. ఇదే సమయంలో ఒక పక్కన ఉన్న గోడ కూలి భార్య, ఇద్దరు కుమార్తెలపై పడింది. పై కప్పు కూడా ఒక్కసారిగా పడటంతో ముగ్గురూ విగతజీవులయ్యారు. పెద్ద కూమార్తె పప్పా...పప్పా... అంటూ అరవడంతో ఆమెను రక్షించేందుకు నదీమ్ ప్రయత్నించినా విద్యుత్ తీగలు అడ్డంకిగా మారాయి. విద్యుత్ సరఫరాను నిలిపేయాలని విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా ఎవ్వరూ స్పందించకపోవడంతో కళ్ల ముందు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ వారిని కాపాడే సాహసం ఎవరూ చేయలేపోయారు. చాలా సేపటి తర్వాత శిథిలాలు తొలగించి చికిత్స నిమిత్తం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బిల్‌కిస్ బేగం, ఓ కూతురు చనిపోయారని వైద్యులు తెలిపారు. మరికొద్దిసేపటికి చికిత్స పొందుతూ మరో కూమార్తె కూడా మరణించింది.



 జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం..

 నగరంలో చిలకలగూడలోని పురాతన భవనం కూలిన దుర్ఘటన అనంతరం జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు హడావిడిగా సర్కిల్-9ఏలో పలు పురాతన భవనాలకు నోటీసులు జారీ చేసి కొన్నింటిని కూల్చేశారు. అయితే భోలక్‌పూర్‌లో ఘటన జరిగిన భవనానికికూడా నోటీసులు జారీ చేసినట్లు జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారి జగన్‌మోహన్ తెలిపారు. ఇల్లు ఖాళీ చేయాలని చెప్పినా ఖాళీ చేయలేదన్నారు. అయితే తమకెవరూ నోటీసులు జారీ చేయలేదని ఇంటి యజమాని చెప్పారు.

 

 రామంతాపూర్‌లో గోడ కూలి..

 మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం మూలచింతపల్లి గ్రామానికి చెందిన గంగా బాలస్వామి(48), అతని భార్య చెన్నమ్మ(45) 20 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి రామంతాపూర్ ప్రగతినగర్‌లో నివసిస్తున్నారు. వీరి కూతురు పార్వతి(16) స్థానిక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతుండగా, కొడుకు  శేఖర్(11) రామంతాపూర్ చర్చి స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రగతినగర్ పెద్ద చెరువు కట్ట కింద ఉన్న ఇందిరా ఇంపీరియా భవనం ప్రహరి గోడను ఆనుకుని గుడిసె వేసుకుని వీరు నివాసముంటున్నారు. బుధవారం ఉదయం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా వీరంతా ఇంట్లోనే ఉన్నారు. 9 గంటల సమయంలో ఇందిరా ఇంపీరియా భవన ప్రహరి గోడ పునాది పటిష్టంగా లేని కారణంగా పెద్ద శబ్దంతో గుడిసెపైన కూలింది.



ఆ సమయంలో గుడిసెలో టీ తాగుతున్న బాలస్వామి కుటుంబంపై రాళ్లు, మట్టి పెళ్లలు ఒక్కసారిగా వచ్చిపడ్డాయి. ఏం జరుగుతుందో ఊహించేందుకు కూడా వారికి అవకాశం లేకపోయింది. కాపాడండి అంటూ పెద్దపెట్టున వారంతా ఆర్తనాదాలు చేశారు. అయితే వారి ఆర్తనాదాలు స్థానికులకు చేరులోపే శిథిలాల కింద చిక్కుకుపోయిన బాలస్వామి, కూతురు పార్వతి అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న చెన్నమ్మ, కుమారుడు శేఖర్‌ను 108 వాహనంలో మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.



 బంధువుల నిరసన..

 బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేవరకు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించొద్దని బంధువులు ఆంబులెన్ ్సకు అడ్డుపడ్డారు. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. ససేమిరా అనడంతో మృతదేహాలను బలవంతంగా గాంధీ మార్చురీకి తరలించారు. కాగా, ప్రహారీ గోడ కూలిన ఘటనలో భవన యజమాని ఇందిరారెడ్డిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top