శబరి రైళ్లలో దళారుల ‘ప్రత్యేక’ దగా!

శబరి రైళ్లలో దళారుల ‘ప్రత్యేక’ దగా!

  •      ఇప్పటికే నిండిపోయిన బెర్తులు

  •       తప్పని వెయిటింగ్ లిస్ట్

  •       రెట్టింపు చార్జీలకు టిక్కెట్ల విక్రయం

  •      అయ్యప్ప భక్తులకు

  •      ప్రయాణ కష్టాలు

  •  సాక్షి, సిటీబ్యూరో: శబరి యాత్ర అయ్యప్ప భక్తులకు భారంగా మారుతోంది. ప్రత్యేక రైళ్ల కోసం ముందస్తుగానే పాగా వేసిన మధ్యవర్తులు టిక్కెట్లు కొల్లగొట్టుకొనిపోయారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన 132 ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భక్తులను వెక్కిరిస్తోంది. మధ్యవర్తుల నుంచి టిక్కెట్లు కొనుక్కోవడానికి భక్తులు రెట్టింపు చార్జీలు చెల్లించక తప్పడం లేదు. అనధికార ఏజెంట్లు, వారికి సహకరించే కొందరు రైల్వే సిబ్బంది కారణంగా టిక్కెట్ చార్జీలకు రెక్కలొస్తున్నాయి.


    రెండు రోజుల క్రితం ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో బెర్తులన్నీ బుక్ అయిపోవడంతో భక్తులు అనధికార ఏజెంట్లను ఆశ్రయించవలసి వస్తోంది.మరోవైపు గతంలో లేని విధంగా ఈ ఏడాది ప్రత్యేక రైళ్లకు 30 శాతం అదనపు చార్జీలు విధించారు. దీంతో రూ.550 ఉండే స్లీపర్ చార్జీ రూ.650 దాటింది. ఏజెంట్లకు భక్తులు ఒక్కో టిక్కెట్‌కు రూ.1250 వరకు చెల్లించవలసి వస్తోంది. డిమాండ్ కారణంగా ఏజెంట్ల వద్ద కూడా టిక్కెట్లు లభించడం లేదు.

     


    పాగా ఇలా..


    ప్రత్యేక రైళ్లలో భక్తులకు టిక్కెట్లు దక్కకుండా అనధికార వ్యక్తులు తమ వాళ్లను రంగంలోకి దించుతారు. నగరంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ బుకింగ్ కేంద్రాల వద్ద కౌంటర్లు తెరుచుకోవడానికి ముందే వారి అనుచరులు లైన్‌లలో మోహరించి ఉంటారు. దీంతో నిజమైన భక్తులకు టిక్కెట్లు లభించడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు ఎంఎంటీఎస్ స్టేషన్లు, ఇతర బుకింగ్ కేంద్రాల్లోనూ మధ్యవర్తులదే హవా.


    ఏటా సీజన్‌కు అనుగుణంగా పెద్ద మొత్తంలో టిక్కెట్‌లను హస్తగతం చేసుకొనే మధ్యవర్తులు అధిక ధరలకు వాటిని తిరిగి భక్తులకు విక్రయిస్తున్నారు. గతంలో ఉన్నట్లుగా టిక్కెట్ బుకింగ్ సమయంలో గుర్తింపు కార్డులు సమర్పించాలనే నిబంధన లేకపోవడంతో పెద్ద సంఖ్యలో  ఏజెంట్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రకటించిన 132 ప్రత్యేక రైళ్లలో బెర్తులన్నీ బుక్ అయిపోవడమే కాకుండా వెయిటింగ్ లిస్టు 100 నుంచి 150కి  చేరుకోవ డమే దళారుల హవాకు నిదర్శనం.

     

    భారంగా రైలు ప్రయాణం

     రోడ్డు మార్గంలో ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడం ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. పైగా ఫిట్‌నెస్ లేని డొక్కు వాహనాలను అప్పగిస్తారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని రైళ్లను ఆశ్రయిస్తే మధ్యవర్తులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో టిక్కెట్‌లు ఎగురేసుకెళ్తున్నారు. దీంతో రెట్టింపు

    చార్జీలు చెల్లించవలసి వస్తోందని అయ్యప్ప భక్తులు వాపోతున్నారు.

     

     ఏటా అరకొర రైళ్లే


     ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. అరకొర రైళ్లు ప్రకటిస్తారు. ఒక్క హైదరాబాద్ నుంచే కనీసం ఐదారు లక్షల మంది భక్తులు శబరికి వెళ్తారు. కానీ రైళ్లు మాత్రం చాలా పరిమితంగా ఉంటాయి. కౌంటర్‌ల వద్ద ఏజెంట్ల ప్రభావమే కనిపిస్తుంది. ఒక్క కౌంటర్‌ల వద్దనే కాదు. రైళ్లలోనూ ఎలాంటి తనిఖీలు ఉండవు. టీసీలు అసలు పట్టించుకోవడం లేదు. బినామీ పేర్లపైన వచ్చే వాళ్లపైన ఎలాంటి నియంత్రణ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top