'విభేదాలు సృష్టించడానికి చంద్రబాబు కుట్ర'


- మద్దతు కోసం పీసీసీ అధ్యక్షునితో భేటీ అయిన ముద్రగడ



హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిజర్వేషన్లు కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించకుండా కాపులు, బీసీల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. చంద్రబాబు చేస్తున్న ఈ తెర వెనుక కుట్రలో కాపులు, బీసీలు భాగస్వాములు కావద్దని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో తలపెట్టబోయే కాపుల ఉద్యమానికి మద్దతు కోరడానికి శనివారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రఘువీరాతో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. సుమారు 25 మంది కాపు సంఘం రాష్ట్ర నాయకులు కూడా ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి నివాసానికి వచ్చారు. తొలుత ముద్రగడ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ జరిగిన కాపుల ఉద్యమానికి మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చానన్నారు.



భవిష్యత్తులో చేపట్టబోయే ఉద్యమానికి కూడా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని కోరేందుకు మొదటిగా పీసీసీ అధ్యక్షుడిని కలిశామన్నారు. కాపు రిజర్వేషన్ల కల్పనకు పార్లమెంటులో జరగాల్సిన చట్టబద్ధ కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ మద్దతు చాలా అవసరమని ముద్రగడ అన్నారు. రఘువీరా మాట్లాడుతూ.. బీసీలకు అన్యాయం జరగకుండా కాపుల డిమాండ్ నెరవేర్చడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చడం ద్వారా కాపులకు న్యాయం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆగస్టులోపు కమిషన్ నివేదికను వచ్చేలా చేసుకుని పార్లమెంటు వర్షాకాల సమావేశం ముందుకు తీసుకువస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతునివ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top