‘ఉత్పత్తి’తోనే ఉపాధి


► దేశంలోనే ఉత్పత్తి రంగంలో తెలంగాణది ప్రధాన వాటా: కేటీఆర్‌

► ఉత్పత్తి రంగంలో ముందుకొచ్చే వారికి రాయితీలతో అనుమతులు

► ఖాయిలా పడ్డ పరిశ్రమలను ఆదుకునేందుకు ఆర్‌బీఐతో చర్చలు


సాక్షి, హైదరాబాద్‌: ఉత్పత్తి రంగంలో తెలంగాణ దేశంలోనే గణనీయ అభివృద్ధి సాధిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. దేశంలో ఉత్పత్తి రంగంలో తెలంగాణ వాటా 28.17 శాతంగా ఉందన్నారు. ఉత్పత్తి రంగంలో సాధిస్తున్న ప్రగతితో ఉపాధి అవకాశాలు మెరుగైనట్లు తెలిపారు. బుధవారం నగరంలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ(సీఐఐ) ఆధ్వర్యంలో ‘లీడర్‌షిప్‌ సిరీస్‌ ఆన్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఎక్సలెన్స్‌’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను తీసుకురావడంతో పాటు ఖాయిలాపడ్డ పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రిజర్వ్‌బ్యాంక్‌ తో చర్చలు జరుగుతున్నాయని, నవంబర్‌లో ఈ మేరకు కొత్త విధానాన్ని ప్రకటిస్తామని చెప్పారు. ఉత్పత్తి రంగం ద్వారానే ఉద్యోగాలు లభిస్తాయని ముఖ్యమంత్రి భావిస్తూ ఈ మేరకు ఆదేశాలిచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం ద్వారా 40 శాతం వాణిజ్య రంగంలో వృద్ధి సాధించనున్నట్లు చెప్పారు.



2.5 లక్షల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌

రాష్ట్రంలో పరిశ్రమల కోసం 2.5 లక్షల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌ ఉందని, ఇది దేశంలోని మరే రాష్ట్రంలో లే దని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు కొత్తగా ఉత్పత్తి రంగంలోకి అడుగుపెట్టే వారికి అన్ని సౌకర్యాలు కల్పించి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో భూమితో పాటు పారిశ్రామిక వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సింగిల్‌ విండో విధానం ద్వారా కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను చేపట్టామని, కార్మిక శాఖ ద్వారా కూడా ఇదే విధానం అమలు చేయనున్నామని చెప్పారు. టీఎస్‌–ఐపాస్‌ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణనే అని చెప్పారు. ఎగుమతులు, దిగుమతుల కోసం డ్రైపోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.



రాయితీలతో అనుమతులు..

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్, ఫార్మా సిటీలను ఏర్పాటు చేయడంతో పాటు ఉత్పత్తి రంగంలో ముందుకు వస్తున్న వారికి పలు రాయితీలతో కూడిన అనుమతులిస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. గత కొన్నేళ్లుగా సీఐఐ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందన్నారు. సీఐఐ వైస్‌ చైర్మన్‌ వి.రాజన్న మాట్లాడుతూ ఉత్పత్తి రంగం అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన సీఐఐ అధ్యక్షుడు నృపేందర్‌రావు మాట్లాడుతూ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్న ప్రభుత్వంతో కలసి భారత పరిశ్రమల సమాఖ్య, ఇతర సంస్థలు నడుస్తాయన్నారు. కాగా, ‘తెలంగాణ గేట్‌ వే టు ద ఫ్యూచర్‌ ఆఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌’ అనే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్, సీఐఐ ప్రతినిధులు దేబాషిస్‌ బసు, రమేష్‌ దాట్ల, ఎస్‌బ్యాంక్‌ సౌత్‌ ఇండియా రీజినల్‌ బిజినెస్‌ హెడ్‌ ఆర్‌.రవిచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top