మోదీ పర్యటన గజ్వేల్‌కే పరిమితం

మోదీ పర్యటన గజ్వేల్‌కే పరిమితం - Sakshi


సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ప్రధాని హోదాలో ఆయన మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సీఎంల సదస్సులో తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధానిని ఆహ్వానించారు. మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా వెల్లడించింది. ముందుగా నిర్ణయించిన మేరకు నాలుగు జిల్లాల్లో అయిదు గంటల పాటు మోదీ పర్యటించాల్సి ఉంది.



కానీ తాజాగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ప్రధాని పర్యటన గజ్వేల్‌కే పరిమితం కానుంది. 7న మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కణ్నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 3 గంటలకు మెదక్ జిల్లా గజ్వేల్ చేరుకుంటారు. సీఎంతో కలిసి గజ్వేల్ వేదికగా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మిషన్ భగీరథ తొలి దశ ప్రారంభం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లో సింగరేణి నిర్మించిన 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయడం, రామగుండంలో ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటుకు శంకుస్థాపన, రామగుండం ఎరువుల కర్మాగారం (ఎఫ్‌సీఐ) పునః ప్రారంభం, వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ప్రారంభం, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.



సాయంత్రం నాలుగున్నర గంటలకు గజ్వేల్ నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఎల్బీ స్టేడియంలో మహా సమ్మేళనం: గజ్వేల్ నుంచి హైదరాబాద్‌కు చేరుకోగానే ప్రధాని మోదీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన ‘బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనం’లో పాలుపంచుకుంటారు. ఎల్బీ స్టేడియంలో ఈ సమ్మేళనం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన బూత్‌స్థాయి కార్యకర్తలను ఈ సమావేశానికి పిలుస్తున్నట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. అనంతరం సాయంత్రం 6.40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రధాని ఢిల్లీ వెళ్తారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ శుక్రవారం అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top