ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం

ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం


* ఏర్పాట్లు ప్రారంభించిన ఆర్‌అండ్‌బీ

* ఐఏఎస్ అధికారుల సంఘం స్థలంలో నిర్మాణం

* అప్రోచ్ రోడ్ల కోసం ఐఏఎస్‌ల ఇళ్ల కూల్చివేత

* ఇప్పటికే కొన్ని ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు

* అనుమతి కోసం జీఏడీకి ప్రతిపాదనలు


సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కొత్త క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమవుతున్నాయి.



ప్రస్తుతం సీఎం కేసీఆర్ అధికార నివాసం వెనకవైపు ఉన్న ఐఏఎస్ అధికారుల సంఘం స్థలంలో కొత్త భవనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భవనం సిద్ధమయ్యాక అక్కడికి చేరుకునేందుకు వీలుగా కొత్తగా అప్రోచ్ రోడ్లు నిర్మించాలని తాజాగా నిర్ణయించారు. ఇందుకోసం సమీపంలో ఉన్న ఐఏఎస్ అధికారుల గృహ సముదాయాలు తొలగించాలని అధికారులు నిర్ణయించారు. దానికి సంబంధించిన ప్రతిపాదనను రోడ్లు భవనాల శాఖ అధికారులు జీఏడీకి పంపారు. అక్కడి నుంచి అనుమతి రాగానే భవనాల తొలగింపు పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే అక్కడ దాదాపు 25 మంది ఐఏఎస్‌ల గృహాలను ఖాళీ చేయించారు.



ఇందులో ఎన్నింటిని తొలగించాలనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ముందువైపు విశాలమైన క్యాంపు కార్యాలయం, వెనకవైపు భారీ గృహసముదాయాన్ని నిర్మించారు. వాస్తులోపం అన్న కారణంతో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయ భవనాన్ని వినియోగించడం లేదు. వెనకవైపు ఉన్న అధికారిక నివాసాన్నే ఇంటిగా, క్యాంపు కార్యాలయంగా వాడుతున్నారు.



కొత్తగా ఐఏఎస్ అధికారుల సంఘం నుంచి సేకరించిన స్థలంలో క్యాంపు కార్యాలయాన్ని నిర్మించనున్నారు. ఆ స్థలంతోపాటు సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్‌కు సంబంధించిన కొంత స్థలాన్ని కూడా వినియోగించనున్నట్టు సమాచారం. ఇక్కడ ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన దూరవిద్య కేంద్రాన్ని ఇప్పటికే తరలించారు. ప్రస్తుతం బేగంపేట ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న క్యాంపు కార్యాలయ రహదారిని కాకుండా కొత్త క్యాంపు కార్యాలయానికి మరో ప్రధాన రహదారిని అధికారులు సిద్ధం చేయనున్నారు. ఇది గ్రీన్‌ల్యాండ్స్‌తోపాటు ఇటు బేగంపేటకు, అటు అమీర్‌పేట ప్రధాన రహదారికి వెళ్లేలా నిర్మిస్తారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top