'ప్రగతి' ఇంటి పేరు అభ్యుదయం ఆయన ఊరు


 *విద్యార్థి నేతగా, ఉద్యమకారుడిగా సేవలు, ప్రగతి హనుమంతరావుగా గుర్తింపు

 

నిరంతర శ్రామికుడు 'ప్రగతి ప్రింటర్స్ హనుమంతరావుగా' రాష్ట్ర ప్రజలకు చిరపరిచితుడైన పరుచూరి హనుమంతరావు సోమవారం రెడ్‌హిల్స్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. కేవలం రూ.6వేలతో ఆయన స్థాపించిన ప్రగతి ప్రింటర్స్ సంస్థ నేడు రూ. 200 కోట్లకు పైగా టర్నోవర్ కలిగి ఉంది. తన ఉద్ధాన పతనాలు, ఒడిదొడుకులపై ఇటీవల ఆయన 'సాక్షి'తో ముచ్చటించారు. కృష్ణాజిల్లాలోని చల్లపల్లి సమీపంలోని  చిట్టూర్పుకు చెందిన ఆయన సాధించిన విజయాలపై 'జ్ఞాపకాలు'...ఆయన మాటల్లోనే.     

 

 ఎన్నో ఢక్కామొక్కీలు

 

ఆ  రోజుల్లో మాఊళ్లో బడి లేదు. దగ్గర్లోని అంగలూరు నుంచి  ఓ పంతులు వచ్చి  ఇంటింటికీ వెళ్లి  చదువు చెప్పేవారు. ఆయన దగ్గర కొంతకాలం చదువుకున్న తరువాత  3వ ఫారమ్‌కు  చల్లపల్లి  హైస్కూల్‌లో చేరాను. మచిలీపట్నంలో ఎస్సెస్సెల్సీ పూర్తయ్యాక  హిందూ కాలేజ్‌లో  ఇంటర్‌లో చేరాను. ఒకవైపు  చదువుకుంటూనే అఖిల భారత విద్యార్ధి సమాఖ్య  కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాన్ని. మొదటి నుంచి  నాటకాలు అంటే చాలా ఇష్టం. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా)పక్షాన బాంబేలో అప్పటి కమ్యూనిస్టు నేత ఎస్.ఎ.డాంగే  నేతృత్వంలో  తెలుగులో బుర్రకథలను  ప్రదర్శించాము. అప్పటి ప్రఖ్యాత రచయిత కె.ఎ.అబ్బాస్ రచించిన ‘హమ్ ఏక్ హై’ హిందీ నాటం మాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.  

 

 1956లో 'విశాలాంధ్ర' నుంచి బయటకు

 

 ఆ తరువాత విశాలాంధ్ర పత్రికలో  చేరాను. వార్తలు రాయడంతో పాటు, ప్రజానాట్యమండలి కార్యక్రమాల్లో  పాల్గొనేవాడిని. తాతినేని చలపతిరావు, మిక్కిలినేని రాధాకృష్ణ, బిఎన్ రెడ్డి, సావిత్రి (నటి), ఎస్.జానకి (గాయని) వంటి వాళ్లంతా ప్రజా నాట్యమండలి నుంచి వచ్చిన వాళ్లే. అప్పటికే  పార్టీ  చీలిక దిశగా పయనిస్తోంది. తాపీ ధర్మారావు కుమారుడు చాణక్య నా స్నేహితుడు. అతను నాగార్జున ఫిలిమ్స్ స్థాపించి ధర్మారావు రాసిన 'ఎత్తుకు పై ఎత్తు'  సినిమా తీశారు. చాణక్య ఆహ్వానం మేరకు సినిమా రంగంలోకి వచ్చాను. అప్పటికే రామకృష్ణ హైదరాబాద్‌లో  సారథీ స్టూడియో  ఏర్పాటు చేశారు. నాగార్జున ఫిలిమ్స్‌ను కూడా తమతో కలిసి పని చేయాలని కోరడంతో 1957 ఆగస్టు 1న 'నాగార్జున ఫిలిమ్స్'గా  తెలుగు సినిమా మొట్టమొదట హైదరాబాద్‌కు వచ్చేసింది.  1958లో 'మా ఇంటి మహాలక్ష్మి' 'ఆత్మబంధువు'  వంటి సినిమాలు తీశాము. ఆ సమయంలో నెగెటివ్ ఫిల్మ్ కొరత ఎక్కువగా ఉండడంతో సినిమా రంగంలో ఎంతో కాలం ఉండలేకపోయాను.

 

 కదిలిన  ఆంధ్ర...

 

 వీరోచిత తెలంగాణ సాయుధ పోరాటంతో  తెలంగాణ సమాజం యావత్తు యుద్ధభూమిగా మారింది. ఆ పోరాటానికి మద్ధతుగా  ఆంధ్ర జిల్లాలన్నీ కదిలాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో  ప్రజలను చైతన్యవంతం చేశాము. ఆ రోజుల్లో బ్రిటీష్  మలబారు పోలీసులకు నేతృత్వం  వహించిన పళయనప్ప  ఆంధ్ర ప్రాంతంపై ఉక్కు పాదం మోపాడు. పోలీసులు నన్ను కూడా అరెస్టు చేశారు.‘ ఆర్ యూ కమ్యూనిస్ట్’ అని అడిగారు. కాదంటే వదిలేసే వాళ్లే. కానీ  ‘ఎస్’ అన్నాను గర్వంగా. ఇంకేముంది. తీసుకెళ్లి  రాజమండ్రి జైల్లో వేశారు. 6 నెలల తరువాత కడలూరు జైలుకు మార్చారు. 3 ఏళ్లు అక్కడే ఉన్నాను. ఏకే గోపాలన్, కడియాల గోపాలరావు, మద్దుకూరి  చంద్రశేఖర్, విశాలాంధ్ర ఎడిటర్ రాజగోపాల రావు, మోటూరి హనుమంతరావు  వంటి పెద్దలంతా ఆ  జైల్లోనే పరిచయమయ్యారు.

 

'ప్రగతి' మార్గంలో...

 

 వాసిరెడ్డి సీతాదేవి, నేను  కలిసి  చెరో రూ.6 వేల పెట్టుబడితో 1962 సెప్టెంబర్ 1వ తేదీన  ‘ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్’ ప్రారంభించాము. లక్డికాఫూల్‌లో రెండు  గదులు అద్దెకు తీసుకొని  ప్రెస్ ఏర్పాటు చేశాము. నాణ్యత, నమ్మకం రెండింటిని నమ్ముకున్నాము. అప్పటి వరకు మార్కెట్‌లో  ఉన్న ఒకరిద్దరు ప్రింటర్స్ కంటే  ఎక్కువే తీసుకున్నా అదే స్థాయిలో  క్వాలిటీ  అందించాము. ఆ తరువాత కొద్ది రోజులకు  వాసిరెడ్డి సీతాదేవి  తన భాగస్వామ్యాన్ని విరమించుకున్నారు.  ఏడాదిన్నర కాలంలోనే  70 వేల పుస్తకాల ముద్రణకు  ఆర్డర్ వచ్చింది. వ్యాపారం పుంజుకోవడంతో 1978లో లక్డికాఫూల్ నుంచి  రెడ్‌హిల్స్‌కు మార్చాము. సంస్థ  బహుముఖంగా విస్తరించింది. అత్యాధునిక ప్రింటర్లు, టెక్నాలజీ  వాడడంతో దేశవిదేశాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. ప్రింటింగ్ రంగంలో  అనేక అవార్డులు లభించాయి. నాకు ఎంతో తృప్తిగా ఉంది అంటూ..ప్రగతి యాత్రను ముగించారు.

 

 ప్రజానాట్య మండలిలో..

 

 పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్షతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కీలక దశకు చేరుకున్న సమయంలో మద్రాసులో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమ నిర్వహణ బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది.  తరిమెల నాగిరెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి పెద్దలంతా అప్పుడే పరిచయమయ్యారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top