అమ్మాయిలూ.. సెల్ఫీలతో జరభద్రం!

అమ్మాయిలూ.. సెల్ఫీలతో జరభద్రం!


అర్ధనగ్న సెల్ఫీలు సేకరించి బ్లాక్‌మెయిల్

అమ్మాయిలపై వల వేస్తున్న సైబర్ నేరగాళ్లు

కేసులు పెట్టేందుకు ముందుకురాని తల్లిదండ్రులు

తెలిసిన వారి చేతుల్లోనే ఎక్కువ మోసాలు

ఎవరికీ ఫొటోలు ఇవ్వద్దని సైబర్ క్రైం పోలీసుల సూచన



హైదరాబాద్


అమ్మాయిలను బుట్టలో వేసుకుని.. వాళ్లతో అర్ధనగ్నంగా సెల్ఫీలు తీసుకుని.. ఆ తర్వాత ఆ ఫొటోలతో వాళ్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్న వ్యవహారాలు హైదరాబాద్‌లో ఎక్కువయ్యాయి. సఫిల్‌గూడకు చెందిన నిజాముద్దీన్ హైదర్ (32) 2011లో హైదరాబాద్‌కు ఇంటర్వ్యూకు వచ్చిన ఎంబీఏ విద్యార్థినితో పరిచయం పెంచుకుని, తాను అనాథనని చెప్పి స్నేహం చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. రెండేళ్ల పాటు వారి స్నేహం కొనసాగింది. ఈ మధ్యలో ఆమెతో సన్నిహితంగా ఉంటూ సెల్ఫీలు తీసుకున్నా, ఆమెకు అనుమానం రాలేదు. తర్వాత అతడికి అప్పటికే పెళ్లయిన విషయం ఆమెకు తెలిసింది. అప్పట్నుంచి ఆ సెల్ఫీలతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడంతో ఆమె సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఎట్టకేలకు మొన్న ఏప్రిల్ నెలలో నిజాముద్దీన్‌ను అరెస్టు చేశారు.



మరోకేసులో, భోలానగర్‌కు చెందిన అబ్దుల్ మాజిద్ (21) కొందరు టీనేజి అమ్మాయిల నుంచి వందలాదిగా అర్ధనగ్న సెల్ఫీలు సేకరించాడు. ఫేస్‌బుక్‌లో వాళ్లతో అమ్మాయిలా చాట్ చేస్తూ ఇవి తీసుకున్నాడు. అమ్మాయిలు తమ తల్లిదండ్రులకు కూడా తెలియని చాలా విషయాలు అతడితో చెప్పేవారు. మందుకొట్టడం, సిగరెట్లు తాగడం, బోయ్‌ఫ్రెండ్లు, సెక్స్ అనుభవాలు.. అన్నింటినీ వెల్లడించేవారు. ఆ ఫొటోలు, వివరాలు తీసుకున్న తర్వాత.. వాటిని ఇంటర్‌నెట్‌లో పెడతానంటూ అతడు వాళ్లను బ్లాక్‌మెయిల్ చేశాడు. ఏడు నెలల్లోనే రెండుసార్లు అరెస్టయిన అతడిపై పోలీసులు పీడీ యాక్ట్ కూడా పెట్టారు.



మహిళలు ఎ్టటి పరిస్థితుల్లోనూ సెల్ఫీలను ఇతరులకు షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రైం విభాగానికి వచ్చే కేసుల్లో చాలావరకు తమకు తెలిసినవారి చేతుల్లో మోసపోయేవారే ఉంటున్నారన్నారు. చాలా కేసుల్లో అమ్మాయిల తల్లిదండ్రులు కేసు పెట్టడానికి ఇష్టపడకపోవడంతో పోలీసులు నిందితులను పట్టుకున్నా, ఫొటోలు డిలీట్ చేసి.. వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చి పంపేయాల్సి వస్తోంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top