స్నేహితులకు పోలీసుల వేధింపులు


రసూల్‌పురా: సిబ్బంది ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందు నగర పోలీసు కమిషనర్ ఎన్నో సంస్కరణలు చేపడుతున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రవేశపెట్టారు.  అయితే, ఇవేవీ కొందరు పోలీసుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం లేదు. కార్ఖాన పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు స్నేహితులైన ఓ జంటను వేధించి డబ్బు డిమాండ్ చేయడమే ఇందుకు తాజా నిదర్శనం.


తమను వేధించిన సదరు ఖాకీలపై బాధితులు అదే పీఎస్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు గతంలో పలువుని వేధించి నా.. ఫిర్యాదు చేసేందుకు ఎవ్వరూ సాహసించలేదని తెలుస్తోంది.  వివరాలు...  ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న స్నేహితులు (అమ్మాయి, అబ్బాయి) మంగళవారం రాత్రి 7 గంటలకు  కేజేఆర్ గార్డెన్ వద్ద ఆటోలో కూర్చుని మాట్లాడుకుంటుండగా కార్ఖాన పీఎస్‌లో విధులు నిర్వహించే భరత్‌బాబు(4580), రమేష్ కుమార్(2210) బైక్‌పై అక్కడికి వచ్చారు.


వారిద్దరినీ పలురకాలుగా మాటలతో వేధించారు. తమకు డబ్బు ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరించారు. వారి బారి నుంచి బయటపడిన బాధితులు బుధవారం పోలీసుస్టేషన్‌కు వెళ్లి కానిస్టేబుళ్లు భరత్, రమేష్‌లపై ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కార్ఖాన సీఐ నాగేశ్వర్‌రావును వివరణ కోరగా... సదరు కానిస్టేబుళ్లపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని చెప్పారు.

 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top