రూ.200 కోట్ల ఆస్తి పత్రాల చోరీ కేసులో పోలీసులు సక్సెస్


హైదరాబాద్‌సిటీ (సుల్తాన్‌బజార్): ఇటీవల సంచలనం సృష్టించిన రూ. 200 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, ఇతర వస్తువులు చోరీకి గురైన సంఘటనలో సుల్తాన్‌బజార్ పోలీసులు శుక్రవారం పురోగతి సాధించారు. ఈ నెల 23వతేదీ తన ఆస్తులకు చెందిన రూ. 200 కోట్ల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు చోరికి గురైయ్యాయని వ్యాపారీ సుశీల్ కాపాడియా సుల్తాన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ఉన్నతాధికారులతోపాటు కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో పోలీసులు కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. చోరీకి గురైన వస్తువులను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... వ్యాపారి సుశీల్‌కుమార్ కాపాడియా ఛారిటబుల్ ట్రస్ట్‌తో పాటు 45 సంస్థలకు చెందిన ఆస్తుల పత్రాలు, ఇతర ఫిక్స్ డ్ డిపాజిట్లు, బాండ్లను సుల్తాన్‌బజార్ గుజరాతీ గల్లీలోని తన కార్యాలయంలో భధ్రపరిచారు. ఇదేసమయంలో కార్యాలయం అద్దె విషయంలో యజమాని చైతన్యకుమార్‌కు, సుశీల్‌కుమార్‌లకు విభేదాలు తలెత్తాయి. సుశీల్‌కుమార్ ఆ కార్యాలయం తెరవకపోవడంతో 21వ తేదీన యాజమాని చైతన్యకుమార్ కాపాడియా చారిటబుల్ ట్రస్ట్‌లో ఉన్న 12 బీరువాలు, 3 లాకర్‌లు, ఇతర ఫర్నీచర్‌ను ఖాళీ చేయించి మొయినాబాద్ లోని తన ఫాంహౌస్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో తన ఆస్తులకు సంబంధించిన రూ.200 కోట్ల విలువైన డాక్యుమెంట్లు, నగదు, ఫర్నిచర్ చోరీకి గురయ్యాయని సుశీల్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం రూ. 200 విలువైన డాక్యుమెంట్లు, 12 బీరువాలు, 3 లాకర్లు, ఇతర ఫర్నీచర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top