'పెట్స్‌'తో స్కెచ్‌!

'పెట్స్‌'తో స్కెచ్‌!


పెంపుడు జంతువులకు బాంబులు అమర్చి పేలుళ్లకు పథకం

గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి ముష్కరుల కుట్ర

పారిస్‌ తరహాలో వాహనంతో విరుచుకుపడొచ్చు

పెద్దనోట్ల రద్దుతో నిధులందక ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి

తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించేందుకు ప్లాన్‌

అన్ని సంస్థలు ఒక్కటై ఏకకాలంలో పేలుళ్లకు పాల్పడొచ్చు

రాష్ట్రాలన్నింటిని అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా వర్గాలు




సాక్షి, హైదరాబాద్‌

గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఉగ్ర మూకలు కుట్రపన్నాయా? పెద్దనోట్ల రద్దుతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముష్కర సంస్థలు తక్కువ ఖర్చుతో భారీ విధ్వంసం సృష్టించేందుకు స్కెచ్‌ వేస్తున్నాయా? గతానికి భిన్నంగా ఎవరికీ అనుమానం రాకుండా పెంపుడు జంతువుల(పెట్స్‌)కు  బాంబులు అమర్చి పేలుళ్లకు పథక రచన చేస్తున్నాయా? కేంద్ర నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో పాటు ఐసిస్, ఏక్యూఐఎస్‌ వంటి అంతర్జాతీయ సంస్థలూ విధ్వంసాలకు కుట్ర పన్నే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈ నెల 27 వరకు అప్రమత్తంగా ఉండాలంటూ శనివారం రాష్ట్రాలకు స్పష్టంచేశాయి. ఉగ్రవాదుల కుట్ర అమలుకు ఆర్థిక వనరులే అత్యంత కీలకం. అయితే పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దేశంలోని నిద్రాణ దళాలు (స్లీపర్‌ సెల్స్‌), సానుభూతిపరులకు నిధుల రాక ఆగిపోయింది. దీంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.



ఈ నేపథ్యంలో వారికి అవసరమైన నిధులను హవాలా మార్గంలో అందించేందుకు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటికే రూ.2000, రూ.500 కొత్త నోట్లతోపాటు రూ.100 నోట్లను పాక్, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో సిద్ధం చేసి ఉంచినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిధుల్ని దేశంలోకి పంపడం కష్ట సాధ్యం కావడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావం చూపే దాడులకు కుట్ర చేస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి.



పెంపుడు జంతువులతో విధ్వంసం..

మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్‌) అధికారులకు ఇటీవల ఓ కీలక సమాచారం అందింది. సాంకేతిక ఆధారాలతోపాటు గడిచిన రెండేళ్లలో అరెస్టు చేసిన ముష్కరుల విచారణలో ఇది బయటపడింది. దీని ప్రకారం ఈసారి ఉగ్రవాదులు పెంపుడు జంతువుల (పెట్స్‌) ద్వారా విధ్వంసానికి కుట్ర పన్నే ప్రమాదం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పెంపుడు జంతువులకు బాంబుల్ని అమర్చి ఎంపిక చేసుకున్న బహిరంగ ప్రదేశాల్లో ముష్కరులు పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు ఏటీఎస్‌ అధికారులు చెబుతున్నారు. దీంతో బహిరంగ ప్రదేశాలతో పాటు కీలక ప్రాంతాల్లో సంచరించే పెంపుడు జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ప్రధానంగా శీతాకాలం నేపథ్యంలో రొటీన్‌కు భిన్నంగా ప్రత్యేక వస్త్రాలతో, అసహజ/అనుమానాస్పద కదలికలతో ఉన్న పెంపుడు జంతువులతోపాటు వాటి యజమానుల పైనే కన్నేసి ఉంచాల్సిందిగా అన్ని రాష్ట్రాలనూ హెచ్చరించాల్సిందిగా ఏటీఎస్‌ కేంద్ర నిఘా వర్గాలను కోరింది. గణతంత్ర దినోత్సవాలు జరిగే ప్రాంతాలతోపాటు నగరాలు, పట్టణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా సూచించాయి.



ఒంటరిగా వెళ్లి పెను విధ్వంసం..

ఉగ్రవాదులు, సానుభూతిపరులతో మాడ్యుల్‌ ఏర్పాటు, పేలుడు పదార్థాల సమీకరణ, బాంబుల తయారీ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. దీంతో ముష్కర మూకలు ‘నైస్‌æ ఎటాక్స్‌’గా పిలిచే ‘లోన్‌ ఉల్ఫ్‌’దాడులకు కుట్ర పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పారిస్‌ తరహాలో జనసమ్మర్థ ప్రాంతంలో భారీ వాహనంతో దూసుకుపోయి, వీలైనంత ఎక్కువ ప్రాణనష్టం కలిగించడాన్నే ‘నైస్‌ ఎటాక్‌’గా పిలుస్తారు. ఆ వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరించే ముష్కరుడు తప్ప మరో వ్యక్తితో అవసరం లేదు. ఇలా ఒకే వ్యక్తితో పూర్తి చేయించే దాడుల్ని ‘లోన్‌ ఉల్ఫ్‌’దాడులు అంటారు. ఎదుటి వ్యక్తి తేరుకునే లోపే ఒంటరిగా వెళ్లి ‘పని’పూర్తి చేసుకురావడం ఈ దాడుల ప్రత్యేకత. బుధ, గురువారాల్లో గణతంత్ర దినోత్సవాలు జరిగే ప్రాంతాల సమీపంలో భారీ వాహనాల రాకపోకల్ని రాష్ట్రాలు నిషేధిస్తే ఉత్తమమని నిఘా వర్గాలు సూచించాయి. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతోపాటు కీలక సందర్భాల్లో హెచ్చరికలు వెలుడుతుంటాయి. ఈసారి స్పష్టమైన సూచనలు ఉండటంతో ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశాం. దక్షిణాదిలో హైదరాబాద్‌ అత్యంత కీలకమైన ప్రాంతం’’అని అన్నారు.



మూకుమ్మడి దాడులకు ప్లాన్‌!

సాధారణంగా ఉగ్రవాద సంస్థలు వేటికవే విడివిడిగా ఆపరేషన్స్‌ చేపడతాయి. అయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఉగ్రకుట్రలు భగ్నమయ్యాయి. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లకు పాల్పడిన ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) సహా మరికొన్ని సంస్థలకు చెందిన ఉగ్రవాదులకు శిక్షలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రతీకారంగా ఐదు సంస్థలు ఏకకాలంలో దాడులు చేయడానికి కుట్ర పన్నుతున్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌)తోపాటు భారత్‌లో ఆపరేషన్స్‌ కోసం ఏర్పడిన అల్‌కాయిదా అనుబంధ సంస్థ అల్‌కాయిదా ఇండియన్‌ సబ్‌–కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌), పాక్‌ ప్రేరేపిత హిజ్బుల్‌ ముజాహిదీన్‌ (హెచ్‌యూఎం), ఐఎం, లష్కరేతొయిబా (ఎల్‌ఈటీ)లు ఏకకాలంలో దాడులకు పథక రచన చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఒక్కో సంస్థ ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని, ఒక్కో తరహాలో ఏకకాలంలో విరుచుకుపడాలని భావిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి. దీంతో గణతంత్ర దినోత్సవం ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని రాష్ట్రాలను హెచ్చరించాయి.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top