‘ఓటుకు కోట్లు’పై పిల్ కొట్టివేత

‘ఓటుకు కోట్లు’పై పిల్ కొట్టివేత - Sakshi


న్యాయవాది పీవీ కృష్ణయ్య తీరుపై హైకోర్టు మండిపాటు

కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారన్న ధర్మాసనం


 

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసు దర్యాప్తును ఏసీబీ నుంచి సీబీఐకి బదలాయించాలం టూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యా న్ని హైకోర్టు కొట్టేసింది. పార్టీ ఇన్ పర్సన్‌గా (పిటిషనర్ కమ్ న్యాయవాది) ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసిన న్యాయవాది పి.వి.కృష్ణయ్య తీరుపై మండిపడింది. కృష్ణయ్య తన చర్యల ద్వారా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో మొదటి నుంచి కృష్ణయ్య వ్యవహరించిన తీరును తమ ఉత్తర్వుల్లో ప్రస్తావిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అలాగే తాను రూ.లక్ష డిపాజిట్ చేయాలంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ కృష్ణయ్య దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సైతం కొట్టేసింది.

 

 ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడి న ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. ఓటుకు కోట్లు కేసులో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని, అందువల్ల కేసును సీబీఐకి బదలాయించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కృష్ణయ్య పిల్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిల్ దాఖలు వెనుక సదుద్దేశాలు ఉన్నాయని నిరూపించుకోవాలని, ఇందు కు గాను రూ. లక్షను కోర్టులో డిపాజిట్ చేయాలని, ఆ తర్వాతే కేసు తదుపరి విచారణను చేపడతామంటూ విచారణను వాయిదా వేసింది. కేసు తదుపరి విచారణ సమయంలో లక్ష రూపాయల డిపాజిట్ ఉత్తర్వులపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నానని కృష్ణయ్య తెలిపారు. దీంతో ధర్మాసనం కేసును వాయిదా వేసింది. అయితే కృష్ణయ్య సుప్రీంకోర్టులో కేసు వేశానని ఒకసారి, కేసు వేయలేదని మరోసారి చెప్పి వాయిదాలు కోరారు.

 

 ఈ నేపథ్యంలో తన కేసును న్యాయవాది రాజుకు అప్పగించారు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించలేదని తెలుసుకున్న ధర్మాసనం.. కృష్ణయ్య వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చింది. తాజాగా వ్యాజ్యం విచారణకు రాగా.. వ్యక్తిగత సమస్యల వల్ల కృష్ణయ్య కోర్టు ముందు హాజరు కాలేకపోతున్నారని ఆయన తరఫు న్యాయవాది రాజు కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట్నుంచీ ఈ కేసులో కృష్ణయ్య ఇలాగే వ్యవహరిస్తున్నారని, కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని మండిపడింది. ఆయన తీరును ఉత్తర్వుల్లో పొందుపరిచింది. పిల్‌ను, దానితోపాటు అనుబంధ పిటిషన్‌ను కొట్టేసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top