ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్న చంద్రబాబు

ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్న చంద్రబాబు - Sakshi


వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపాటు

 

 సాక్షి,హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేది అభివృద్ధి మంత్రం.. చేసేది అవినీతి తంత్రమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. తనను ప్రశ్నించేవాళ్లపై, అసహనంగా ఉన్న ప్రజలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తున్న ప్రజా సంఘాలపై, తన అవినీతిపై అనునిత్యం పోరాటం చేస్తున్న ప్రతిపక్షాలపై భరించలేని తత్వంతో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారని చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. భూమన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అదే అంశాన్ని ఆయుధంగా చేసుకున్నారని చెప్పారు. ప్రజా సంఘాలను, ప్రతిపక్షాలను, తమను వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ లోబరుచుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు.



 వ్యతిరేకించే వారందరిపైనా నిఘా: ‘‘1885,1971 ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం.. కేంద్ర హోంశాఖ అనుమతితో దేశద్రోహుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేస్తారు. కానీ, చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా తనను వ్యతిరేకించే ప్రతి ఒక్కరి మీదా నిఘా వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంతోపాటు పారిశ్రామికవేత్తలు, పోలీసు అధికారులు, పత్రికల యజమానులు, తనను వ్యతిరేకించే విలేకరులు, ఆఖరికి సొంత పార్టీ నేతల ఫోన్లను సైతం చంద్రబాబు ట్యాప్ చేయిస్తున్నారు.  చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే తామేమీ ఫోన్లను ట్యాప్ చేయలేదని స్పష్టంగా ప్రకటించాలి. లేకపోతే ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతాం. ప్రజా సంఘాలను కలుపుకుని సర్కారు తీరుపై పోరాడుతాం’’ అని భూమన హెచ్చరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top