ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకులు

ఆగ్రోస్‌ ఆధ్వర్యంలో పెట్రోల్‌ బంకులు - Sakshi

- తొలుత వరంగల్‌ జిల్లాలో ఏర్పాటుకు సన్నాహాలు

నష్టాల నుంచి బయటపడేందుకు వివిధ రకాల వ్యాపారాలు  

సాక్షి, హైదరాబాద్‌: నష్టాల నుంచి బయట పడేందుకు ఆగ్రోస్‌ విశ్వప్రయత్నాలు చేస్తోంది. వినూత్న పద్ధతుల్లో వివిధ రకాల వ్యాపారాలు చేయడం ద్వారా ఉనికిని కాపాడుకోవాలని యోచిస్తోంది. అందులో భాగంగా పలుచోట్ల పెట్రోల్‌ బంకులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముందుగా వరంగల్‌ జిల్లాలో ఒక పెట్రోల్‌ బంకు ఏర్పాటుకోసం దరఖాస్తు చేసుకుంది. దానికి అవసరమైన భూమిని కేటాయించాలని రెవెన్యూ శాఖను కోరినట్లు తెలిసింది. పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేస్తే నెలకు దాదాపు రూ. 5 లక్షలు ఆదాయం సమకూరనుంది. అలాగే పలు ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఫ్యాన్లు, ఏసీలు, వాహనాలకు స్పేర్‌పార్టులు తదితరాలు సరఫరా చేయాలని ఇటీవల నిర్ణయించిన సంగతి తెలిసిందే. వివిధ రకాల పద్ధతుల ద్వారా ఏడాదిలోగా నష్టాల నుంచి బయటపడతామని ఆగ్రోస్‌ ౖచైర్మన్‌ కిషన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. 

 

రావాల్సిన బకాయిలు 17 కోట్లు

వ్యవసాయశాఖకు అవసరమైన యంత్రాలను సరఫరా చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ ఆగ్రోస్‌)ను ఏర్పాటు చేశారు. యంత్రాలను రైతులకు సరఫరా చేసిన సందర్భంలో సేవా పన్ను కింద 4 శాతం ఆగ్రోస్‌కు వ్యవసాయశాఖ కమీషన్‌గా చెల్లించాలి. కానీ ఆగ్రోస్‌కు వ్యవసా య శాఖ కమీషన్లు ఇవ్వకపోవడంతో 10 కోట్ల వరకూ బకాయిలు పేరుకుపోయాయి. అలాగే ఆగ్రోస్‌కు విభజన వాటాగా చెల్లించాల్సిన  రూ. 12 కోట్లల్లో ఏపీ రూ. 5 కోట్లు మాత్రమే చెల్లిం చింది. ఇంకా రూ.7 కోట్ల వరకు రావాల్సి ఉం దని కిషన్‌రావు చెబుతున్నారు. అలాగే వ్యవసా య యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని జిల్లాల్లో అద్దె కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కేంద్రాలు ఏర్పాటుచేస్తే వరి కోత యంత్రాలు, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు తదితరమైనవి రైతులకు అద్దెకు ఇవ్వాలని భావిస్తున్నారు.
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top