72 గంటల్లో రూ. 28.05 కోట్లు కట్టండి

72 గంటల్లో రూ. 28.05 కోట్లు కట్టండి


సదావర్తి భూములపై దేవాదాయ శాఖ పీఎల్‌ఆర్ సంస్థకు లేఖ



 సాక్షి, విజయవాడ బ్యూరో : రూ. 28.05 కోట్లు 72 గంటల్లోగా డిపాజిట్ చేస్తే సదావర్తి భూములు మళ్లీ వేలం వేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్సుకు లేఖ రాశారు. ఆ లేఖను శనివారం పత్రికలకు విడుదల చేశారు. గత ంలో రూ.22.44 కోట్లకు సదావర్తి భూములను వేలం వేయగా, ఆ మొత్తానికి మరో 25 శాతం ఎక్కువ సొమ్మును కలిపి డిపాజిట్ చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. తమిళనాడులోని సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల విలువైన భూములను దేవాదాయశాఖ  కారు చౌకగా వేలం వేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి బంధువులు రూ. 1000 కోట్లకు పైగా విలువైన ఈ భూములను రూ. 22.44 కోట్లకు వేలంలో దక్కించుకున్నారు.



ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకు రాగా, పలు సంస్థలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఈ దోపిడీని ప్రశ్నించారు. దాంతో రూ.5 కోట్లు అదనంగా చెల్లించేవారికి ఆ భూములు అప్పగిస్తామని ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి ప్రకటనలుచేశారు. వాటికి స్పందిస్తూ పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 5 కోట్లు చెల్లించడానికి సిద్ధమేనని ఆసక్తి ప్రతిపాదనను పంపించింది. దీంతో వారికి కొత్తగా అనేక షరతులు పెడుతూ దేవాదాయ శాఖ కమిషనర్ రాసిన లేఖ పలు విమర్శలకు దారి తీసింది. ఈ కొత్త షరతులేమిటని ప్రశ్నిస్తూ పీఎల్‌ఆర్ సంస్థ రాసిన లేఖకు స్పందిస్తూ ఇపుడు దేవాదాయశాఖ ఈలేఖ పంపించింది.

 

 ఆ డబ్బు చెల్లించడానికి  మేం సిద్ధం

 సాక్షి, హైదరాబాద్: సదావర్తి సత్రం భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన సవాలుకు తాము సిద్ధమని పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. రాష్ర్టప్రభుత్వం అడుగుతున్నట్లుగా రూ. 22.44 కోట్లకు అదనంగా రూ. 5.60 కోట్లు కలిపి మొత్తం రూ. 28.05 కోట్లను 72 గంటల్లోగా డిపాజిట్ చేయడానికి తాము సిద్ధమని ఆ సంస్థ పేర్కొంది. శనివారం ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తాము డబ్బు కట్టిన వెంటనే తమ సంస్థ పేరిట సదావర్తి భూములను రిజిస్టర్ చేయాలని కోరింది. అందుకు రాష్ర్టప్రభుత్వం సిద్ధమైతే తాము డబ్బు కట్టడానికి సిద్ధమేనని  తెలిపింది.



అలా కాకుండా సదావర్తి భూములకు మళ్లీ వేలం వేసినా ఆ వేలంలో తాము పాల్గొనడానికి సిద్ధమని, నిబంధ నల ప్రకారం ఈఎండీగా రూ. 10 లక్షలు కట్టి వేలంలో పాల్గొంటామని పేర్కొంది. ‘‘రూ.28.05 కోట్లు కట్టి వేలంలో పాల్గొనాలన్న షరతు మాకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. మిగిలిన బిడ్డర్ల మాదిరిగా రూ.10 లక్షల ఈఎండీ కట్టి వేలంలో పాల్గొనడానికి మాకూ అవకాశం ఇవ్వండి.’’అని పేర్కొంది. తొలిసారి వేలం నిర్వహించినపుడు వేలంలో పాల్గొన్న వ్యక్తులు, సంస్థలు కట్టిన ఈఎండీ మొత్తం అదేనని ఆ సంస్థ తెలిపింది. ఎవరు ఎక్కువ చెల్లించడానికి సిద్ధపడితే వారికి ఆ భూములు అప్పగించాలని, తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని పేర్కొంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top